వాటి నిర్వాకం వల్లే మూడో కూటమి అవసరం

9 Feb, 2014 03:09 IST|Sakshi
వాటి నిర్వాకం వల్లే మూడో కూటమి అవసరం

 న్యూఢిల్లీ: కాంగ్రెస్, బీజేపీల గందరగోళ విధానాలతో దేశం ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా తృతీయ కూటమిని బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ తెలిపారు. ఆ కూటమి ఏర్పాటుకు నాయకత్వ అంశం సమస్య కాబోదన్నారు. కాంగ్రెస్, బీజేపీలు దేశంలో సృష్టించిన పరిస్థితుల వల్ల అవినీతి, నిరుద్యోగం వంటి అసలు సమస్యలు మరుగున పడిపోయాయని, ఏది సరైందో, ఏది సరికాదో తెలియని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. శనివారమిక్కడ వివిధ రాష్ట్రాల జేడీయూ శాఖల నేతలతో సమావేశమైన శరద్ యాదవ్ అనంతరం విలేకర్లతో మాట్లాడారు. మూడో కూటమి ప్రధాని అభ్యర్థి అంశాన్ని ప్రస్తావించగా.. ‘మావెంట లేని ఆ రెండు పార్టీల్లో(కాంగ్రెస్, బీజేపీ) ఆ సమస్య ఉండొచ్చు.. యునెటైడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడినప్పుడే మేం వీపీ సింగ్ పేరును ప్రకటించలేదు. ఇప్పుడెందుకు ఆ సమస్య వస్తుంది?’ అని అన్నారు.
 
  థర్డ్ ఫ్రంట్‌తో దేశం అధోగతికి చేరుతుందన్న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గురించి ప్రస్తావిస్తూ.. ‘ఆయనకు ప్రధాని కావాలని ఉబలాటంగా ఉంటే ఎర్రకోట నమూనాను వెనక ఉంచుకుని, పీఏ సంగ్మా(ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి) ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేసుకోవాలి’ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీలు అధికారంలోకి రావని, మోడీ ప్రధాని కారని అన్నారు.
 

మరిన్ని వార్తలు