వాట్సప్ సాక్ష్యం.. రేపిస్టులకు 20 ఏళ్ల జైలు!

6 Jun, 2017 08:37 IST|Sakshi
వాట్సప్ సాక్ష్యం.. రేపిస్టులకు 20 ఏళ్ల జైలు!

ముగ్గురు న్యాయ విద్యార్థులు కలిసి తమ యూనివర్సిటీలో కొత్తగా చేరిన ఒక అమ్మాయిపై రెండేళ్ల పాటు అత్యాచారం చేశారు. బాధితురాలికి, నిందితులకు మధ్య జరిగిన వాట్సప్ చాటింగ్‌నే సాక్ష్యంగా పరిగణించిన కోర్టు.. ఆ ముగ్గురిలో ఇద్దరికి 20 ఏళ్ల చొప్పున జైలుశిక్ష విధించింది. మూడో విద్యార్థికి ఏడేళ్ల జైలుశిక్ష వేసింది. దేశంలోనే తొలిసారిగా వాట్సప్ చాటింగ్‌ను సాక్ష్యంగా ఉపయోగించుకున్న ఈ ఘటన హరియాణాలోని సోనేపట్‌లో గల ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో చోటుచేసుకుంది. మేనేజ్‌మెంట్ విద్యార్థినిపై రెండేళ్ల పాటు అత్యాచారం చేయడం, ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడం లాంటి నేరాలకు గాను ప్రధాన నిందితుడు హార్దిక్ సిక్రీ, అతడి స్నేహితుడు కరణ్ ఛాబ్రాలకు 20 ఏళ్లు, మూడో వ్యక్తి వికాస్ గార్గ్‌కు ఏడు సంవత్సరాలు జైలుశిక్ష పడింది. వాట్సప్ చాటింగ్‌లో వాళ్లు ఉపయోగించిన పదాలు దారుణాతి దారుణంగా, అత్యంత అసభ్యంగా ఉన్నాయని.. అందువల్ల వాటిని తీర్పులో కూడా ప్రస్తావించలేకపోతున్నానని అదనపు సెషన్స్ జడ్జి సునీతా గ్రోవర్ తెలిపారు.

బాధితురాలు 2013 ఆగస్టు నెలలో యూనివర్సిటీలో చేరింది. అప్పటి నుంచి అదే యూనివర్సిటీలో చదువుతున్న న్యాయవిద్యార్థులు తనపై అత్యాచారాలు చేస్తూనే ఉన్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో 2015 ఏప్రిల్‌ నుంచి నిందితులు జైల్లో ఉన్నారు. ప్రధాన నిందితుడైన హార్దిక్ ఆమె నగ్న చిత్రాలను వాట్సప్‌లో స్నేహితులందరికీ పంపాడు. అంతేకాదు, యాపిల్ ఐక్లౌడ్‌లో కూడా వాటిని భద్రపరిచాడు. విషయం ఎవరికైనా చెబితే యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో వాటిని పెడతానని ఆమెను బెదిరించాడు. అంతేకాదు, ఒక సెక్స్ టాయ్ కొని, దాన్ని వాడుతూ తనకు స్కైప్‌లో చూపించాలని ఆమెను బెదిరించాడు. తరచు చండీగఢ్ తీసుకెళ్లి తనను అనుభవించేవాడని ఆమె తెలిపింది. ఆ విషయం కూడా వాట్సప్ చాటింగ్‌లో ఉండటంతో దాన్ని కోర్టు సాక్ష్యంగా అంగీకరించింది.

ఆ అమ్మాయి వాళ్లతో లైంగిక సంబంధాలకు అంగీకరించే వచ్చిందని, తనంతట తానే చండీగఢ్ పర్యటనలో బీర్ కొని, డ్రగ్స్ తీసుకోడానికి కూడా ఒప్పుకొందని డిఫెన్స్ న్యాయవాదులు చేసిన వాదనను కోర్టు అంగీకరించలేదు. నిందితులు సీనియర్లు కావడంతో వాళ్లు ఆమెను డామినేట్ చేసేవారని, బాధితురాలు వాళ్ల మాట కాదనలేకపోయిందని వాట్సప్ చాటింగ్‌ను బట్టి తెలుస్తోందని జడ్జి అన్నారు.

మరిన్ని వార్తలు