నిరుపేదలకు అండగా 'కల్కి కళ'

8 Sep, 2016 14:12 IST|Sakshi
నిరుపేదలకు అండగా 'కల్కి కళ'

కళాత్మకతకు తోడు ఆమెలోని సేవాభావం ఎందరో నిరుపేదలకు అండగా నిలుస్తోంది.  ట్రాన్స్ జెండర్ సంఘంలోని పేదలను విద్యావంతులుగా తీర్చి దిద్దుతోంది. 'సహోదరి' పేరున ఆమె స్థాపించిన సంస్థ.. ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీలో సాధికారతను సాధించి పెడుతోంది.

ఇటీవల ట్రాన్స్ జెండర్లు తమ హక్కులను కాపాడుకుంటూ అన్ని రంగాల్లోనూ అత్యున్నత స్థానాలను సైతం అలంకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో  ట్రాన్స్ జెండర్ ఆర్టిస్ట్.. కల్కీ సుబ్రమణియం... సంఘంలోని నిరుపేదలకు సాయం అందించేందుకు నడుం బిగించింది. వారి రాజకీయ, సామాజిక, న్యాయ సంబంధమైన హక్కులను కాపాడేందుకు కృషి చేస్తోంది. ముఖ్యంగా లింగ వివక్ష మెండుగా కనిపించే భారత దేశంలో ట్రాన్స్ జెండర్లపై వివక్షను నిర్మూలించేందుకు పోరాటం చేస్తోంది.

మనదేశంలో పాఠశాల, కళాశాల విద్యార్థులకు విద్యతోపాటు.. లింగ వివక్షపై కూడా అవగాహన కల్పించాల్సిన బాధ్యత విద్యాశాఖకు ఉందని, అందుకోసం ఆ శాఖ మరింత కృషి చేయాల్సి ఉంటుందని కల్కి అభిప్రాయపడింది. పాఠశాల విద్యా సమయంలో విద్యార్థులు లింగ వివక్షతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఈ పరిస్థితిని మార్చి, వారిలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపింది. తనలోని కళాప్రతిభను వినియోగించి.. తాను రూపొందించిన చిత్రాలను వేలం వేయగా వచ్చిన డబ్బుతో నిరుపేదలకు సహాయపడుతోంది.

మరిన్ని వార్తలు