వెనక్కి తగ్గి, క్షమాపణలు చెప్పిన సీఎం!

28 Apr, 2018 15:31 IST|Sakshi
ఐశ్వర్యరాయ్‌, బిప్లబ్ కుమార్ దేబ్, డయానా హెడెన్ (ఫైల్ ఫొటో)

నటి డయానా హెడెన్‌పై అనుచిత వ్యాఖ్యలు

విమర్శలతో వెనక్కి తగ్గిన బిప్లబ్ కుమార్ దేబ్ 

అగర్తలా: త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్‌ కుమార్‌ దేబ్‌ తనపై చేసిన ‘బాడీ షేమింగ్‌’, వర్ణ వివక్ష పూరిత కామెంట్లపై 1997 ‘మిస్‌ వరల్డ్‌’, నటి డయానా హెడెన్ మండిపడ్డారు. ఏదైనా మాట్లాడే ముందు ఓసారి ఆలోచించుకోవాలని సీఎం బిప్లబ్‌కు సూచించారు. దాంతోపాటుగా మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసి బుద్ధి చూపించారంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, డయానా హెడెన్‌పై తాను చేసిన వ్యాఖ్యలపై బిప్లబ్‌ దేబ్ వెనక్కి తగ్గారు. స్త్రీలను అవమానపరచడం తన ఉద్దేశం కాదని, డయానాపై చేసిన వ్యాఖ్యలు కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనంటూ క్షమాపణలు చెప్పారు. ఫ్యాషన్ ఇండస్ట్రీలో జరుగుతున్న మోసాలను వివరించే యత్నంలో ఆ కామెంట్లు చేసినట్లు తెలిపారు.

వివాదం ఇది.. 
గత కొంతకాలం నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న త్రిపుర సీఎం బిప్లబ్ కుమార్ దేబ్ ఇటీవల మరో వివాదంలో చిక్కుకుని వెనక్కి తగ్గారు. మహా భారతం కాలంలోనే మనకు ఇంటర్‌నెట్‌ ఉండేదని, పాస్‌వర్డ్ కోసమే కురుక్షేత్ర యుద్ధం జరిగిందని ఆయన చెప్పిన మాటలను జోక్‌లా తీసుకుని నవ్వుకున్నారు. ఆపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మతి చెడిందని, ఆమెను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించాలంటూ కామెంట్లు చేశారు. తాజాగా శుక్రవారం త్రిపుర రాజధాని అగర్తలాలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న బిప్లబ్‌ ‘భారతీయ అందానికి ప్రతీక ఐశ్వర్యరాయ్‌ మాత్రమే. డయానా హైడన్‌ను అందగత్తె అంటారా ఎవరైనా? ఆమె మిస్‌ వరల్డ్‌ గెలిచిందంటే నవ్వొస్తుంది’ అని వ్యాఖ్యానించారు. కేవలం ‘సౌందర్య సాధనాల సంస్థలు మన దేశ మార్కెట్‌ను వశపరుచుకోవడానికి దేశ యువతులకు వరుసగా అందాల టైటిల్స్‌ ఇచ్చాయని అందులో భాగంగానే డాయానాకు సైతం మిస్ వరల్డ్ ఇచ్చారని ఆమెను కించపరిచే వ్యాఖ్యలు చేశారు. .

డయానా ఏమన్నారంటే..
నేను చామన ఛాయ రంగుతో ఉన్నాందుకు గర్వపడుతున్నాను. విదేశీయులు సైతం భారతీయుల రంగును మెచ్చుకుంటున్నారు. అయితే నాకు మిస్ వరల్డ్ టైటిల్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించడం వరకు వారి వ్యక్తిగత అభిప్రాయమే. కానీ రంగు గురించి మాట్లాడి వివక్షపూరిత వ్యాఖ్యలు చేయడం త్రిపుర సీఎం బిప్లబ్‌కు సబబు కాదు. ఒకరిపై కామెంట్లు చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించుకుని కామెంట్ చేయడం మంచిదని హైదరాబాద్‌కు చెందిన డయానా హితవు పలికారు.

మరిన్ని వార్తలు