ఆ రెండు గ్రామాల్లో సోలార్ వెలుగులు

31 Mar, 2016 21:21 IST|Sakshi
ఆ రెండు గ్రామాల్లో సోలార్ వెలుగులు

ఆ గ్రామాల్లో సౌరశక్తి వెలుగులు విరజిమ్మనున్నాయి. ఓ ప్రైవేటు సంస్థ అభివృద్ధి చేసే రెండు మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ సహాయంతో ఈ ఏడాది నుంచే పూర్తి శాతం సోలార్ విద్యుత్ వినియోగంలోకి రానుంది. దీంతో దేశంలోనే వందశాతం సోలార్ విద్యుత్తును వినియోగించే మొట్ట మొదటి  గ్రామాలుగా ఆ రెండు గ్రామాలు గుర్తింపును తెచ్చుకోనున్నట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖామంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సంసద్ ఆదర్శ గ్రామ యోజన (ఎస్ ఏ జీ వై) ద్వారా ఆ రెండు గ్రామాలను తాను దత్తత తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.  

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పుతాళ్ళు, పెద మైనవానిలంక గ్రామాలు ఇప్పుడు దేశంలోనే మొట్టమొదటి సోలార్ గ్రామాలుగా అభివృద్ధి చెందనున్నాయి. సౌరశక్తిని వినియోగించి గ్రామాల్లో  పూర్తిశాతం విద్యుత్ సరఫరా జరిపేందుకు యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు జరుగుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ డిస్కమ్ సహాయంతో రెండు మెగావాట్ల సోలార్ పవర్ ను ఉత్పత్తి చేసి... గ్రామాల్లో పూర్తిశాతం సోలార్ విద్యుత్తును అందించేందుకు సంస్థ సిద్ధం చేస్తోంది. ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయిన 2 మెగావాట్ల సోలార్ విద్యుత్తును ఆంధ్ర ప్రదేశ్  తూర్పు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కొనుగోలు చేసి గ్రామాలకు సరఫరా చేస్తుంది.

సోలార్ ప్లాంట్ నిర్మాణం కోసం ఇప్పటికే జిల్లా యంత్రాంగం భూమిని కేటాయించగా.. ప్లాంట్ లో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును కొనుగోలు చేసేందుకు ఏపీఈపీడీసీఎల్  అంగీకారం తెలిపింది. దీంతో  ప్లాంట్ నిర్మాణం 2016 ఆగస్టు నాటికి పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లో సామాజిక, సాంస్కృతిక అభివృద్ధే లక్ష్యంగా సంసద్ ఆదర్శ గ్రామయోజన కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.

 

కార్యక్రమంలో భాగంగా పార్లమెంట్ లోని ప్రతి సభ్యుడు మూడు గ్రామాలను దత్తత చేసుకొని అభివృద్ధి చేయాల్సిన బాధ్యతను అప్పగించారు. ముందుగా తమ స్వంత నియోజక వర్గాల్లోని ఒక గ్రామాన్ని దత్తత చేసుకొన్న సభ్యులు 2019 నాటికి ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అంతేకాదు నిబంధనల ప్రకారం అది వారి స్వంత గ్రామం గాని,  అత్తింటివైపు వారి గ్రామం గాని అయి ఉండకూడదు. అనంతరం అదే పద్ధతిలో మరో రెండు లేదా మూడు గ్రామాలను కూడ సభ్యులు 2019 నాటికి అభివృద్ధి చేయాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు