కార్పొరేట్కు పెద్దపీట.. సామాన్యుడికి నిరాశ

28 Feb, 2015 12:58 IST|Sakshi

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ 2015-16 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో కార్పొరేట్ వర్గాలకు పెద్దపీట వేసి.. సామాన్యుడికి మాత్రం నిరాశనే మిగిల్చినట్లయింది. పన్ను రాయితీల కోసం ఎంతగానో ఎదురుచూసిన సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు పెద్దగా ఎలాంటి ప్రయోజనాలు కనిపించలేదు. ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులపై పన్ను రాయితీ పరిమితి పెంచుతున్నట్లు ప్రకటించినా.. వాస్తవానికి ఏడాదికి రూ. 25 వేల ప్రీమియం చెల్లిస్తే.. 40 ఏళ్లు దాటిన వారికి సుమారు రూ. 15 లక్షల ఆరోగ్య బీమా వస్తుంది. అంత మొత్తాన్ని సామాన్య, మధ్యతరగతి ఉద్యోగులు సాధారణంగా చేయించుకునే అవకాశం ఉండదు. పైపెచ్చు సేవాపన్నును కూడా 12.36 శాతం నుంచి 14 శాతానికి పెంచడం వల్ల దాదాపు అన్ని ఖర్చులూ బాగా పెరుగుతాయి.

కార్పొరేట్ పన్నును మాత్రం ఇప్పుడున్న 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు. ఇప్పుడున్న 30 శాతం పన్ను వల్ల ఆశించిన మొత్తంలో వసూళ్లు రావడం లేదని, అందుకే ఈసారి 25 శాతానికి తగ్గిస్తున్నామని చెప్పారు. ఇది నాలుగేళ్ల పాటు వర్తిస్తుందన్నారు. ఆ రకంగా కార్పొరేట్ వర్గాలకు పెద్దపీట వేస్తూ సామాన్యుడిపై చిన్నచూపు చూసినట్లుగా జైట్లీ బడ్జెట్ ఉందని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు