58 పురాతన చట్టాల రద్దు

18 Jul, 2019 02:53 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న మంత్రులు

ఈ సమావేశాల్లోనే పార్లమెంటుకు ఎన్‌ఎంసీ బిల్లు

కేంద్ర మంత్రివర్గ భేటీలో నిర్ణయం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బుధవారం మరో 58 పురాతన, వాడుకలోలేని చట్టాలను రద్దు చేసింది. దీంతో ప్రధాని మోదీ నేతృత్వంలోని రెండు (గత, ప్రస్తుత) ప్రభుత్వాలు కలిసి రద్దు చేసిన పురాతన చట్టాల సంఖ్య 1,824కు చేరింది. చట్టాల రద్దు, సవరణ బిల్లు–2019కు పార్లమెంటు ఆమోదం లభించడంతో త్వరలోనే మరో 137 పురాతన చట్టాలు రద్దు కానున్నాయి. మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితులకు, ఈ పురాతన చట్టాలకు అసలు సంబంధమే లేదనీ, ఈ కాలానికి అవి పనికిరావని కేంద్రం చెబుతోంది. తాజాగా రద్దు అయిన 58 చట్టాలేవో ఇంకా తెలియరాలేదు. అయితే అవన్నీ ప్రధాన చట్టాలకు సవరణలు చేసేందుకు తీసుకొచ్చినవేనని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి.

వైద్య విద్యలో ‘నెక్ట్స్‌’కు ఆమోదం
భారత వైద్య మండలి (మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా) స్థానంలో కొత్తగా జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ–నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌)ని ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన బిల్లును ప్రస్తుత సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లును కేంద్రం 2017 డిసెంబర్‌లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పటికీ 16వ లోక్‌సభ గడువు ముగిసే నాటికి అది ఆమోదం పొందకపోవడం కారణంగా రద్దయింది. ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం పరీక్షను అందరికీ ఉమ్మడిగా జాతీయ నిష్క్రమణ పరీక్ష (నెక్ట్స్‌–నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌) పేరిట నిర్వహించేలా బిల్లులో నిబంధనలున్నాయి.  ఠి 15వ ఆర్థిక సంఘం తన నివేదికను సమర్పించేందుకు గడువును కేంద్రం మరో నెల రోజులు పొడిగించి నవంబర్‌ 30 వరకు సమయం ఇచ్చింది. ఠి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ డిజైన్‌ చట్టం–2014ను సవరించేందుకు ఉద్దేశించిన ఓ బిల్లును కేబినెట్‌ ఆమోదించింది. మరో నాలుగు ఎన్‌ఐడీలను ఈ చట్టం పరిధిలోకి తెచ్చి, వాటిని జాతీయ ప్రాధాన్యం ఉన్న సంస్థలుగా ప్రకటించేందుకు ఈ సవరణను చేపడుతున్నారు. అమరావతి, భోపాల్, జొర్హాత్, కురుక్షేత్రల్లోని ఎన్‌ఐడీలను కొత్తగా ఈ చట్టం పరిధిలోకి తేనున్నారు.
 

మరిన్ని వార్తలు