గడ్డి గాదం... అవుతుంది బొగ్గు!

18 Nov, 2017 14:55 IST|Sakshi

ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతమైంది... పంజాబ్, హర్యానాలలో పంటపొలాల్లో గడ్డి కాల్చేయడం దీనికి కారణమని అంటున్నారు? అలా ఎందుకు వృథాగా తగలేస్తున్నారన్న అనుమానం మీకెప్పుడైనా వచ్చిందా? చాలామందికి వచ్చే ఉంటుంది.. కోతలయ్యాయి కాబట్టి గడ్డి ఇక పనికి రాదన్నది రైతుల అంచనా కావచ్చుగానీ.. నాటింగ్‌హామ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు మాత్రం ఆ వృథాకు కొత్త అర్థం చెబుతున్నారు. తాము అభివృద్ధి చేసిన వినూత్న సాంకేతిక పరిజ్ఞానంతో గడ్డితోపాటు అన్ని రకాల సేంద్రీయ పదార్థాలను బొగ్గులాంటి ఇంధనంగా మార్చేయవచ్చునని వారు అంటున్నారు. గడ్డిని అధిక పీడనానికి గురిచేసి.. కొద్దిగా వెచ్చబెట్టడం ద్వారా తేమ ఎక్కువ ఉన్న సేంద్రీయ పదార్థాలనూ బొగ్గులాంటి ఇంధనాలుగా మార్చవచ్చునని నిరూపించారు. ]

ఎప్పుడో కోట్ల సంవత్సరాల క్రితం భూమిలోకి చేరిన సేంద్రీయ పదార్థాలు అక్కడి పీడనం, ఉష్ణోగ్రతల కారణంగా బొగ్గు, చమురు వంటి ఇంధనాలుగా మారతాయి. ఇందుకు వేల ఏళ్లు పడుతుంది. నాటింగ్‌హామ్‌ శాస్త్రవేత్తలు ఇదే ప్రక్రియను ఫ్యాక్టరీల్లో కొన్ని గంటల్లోనే పూర్తయ్యేలా చేశారు. అన్నీ సవ్యంగా సాగితే కార్బన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీస్‌ అనే సంస్థ యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో ఈ టెక్నాలజీతో పనిచేసే ఫ్యాక్టరీని త్వరలోనే మొదలుపెట్టనుంది. ఈ రకమైన టెక్నాలజీలతో కాలుష్యకారక శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయాలు లభించి వాతావరణ మార్పులను అడ్డుకునే వీలు ఏర్పడుతుంది. 

మరిన్ని వార్తలు