న్యూ ఇయర్‌ వేడుకల్లో పొట్టి దుస్తులకు నో..

27 Dec, 2018 11:32 IST|Sakshi

అహ్మదాబాద్‌ : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మహిళల భద్రతపై రాజీపడబోమని వడోదర పోలీసు అధికారులు స్పష్టం చేశారు. న్యూ ఇయర్‌ వేడుకల్లో పొట్టి దుస్తులు వేసుకోరాదని మహిళలు, యువతులను పోలీసులు హెచ్చరించారు. చిన్నారులు, సమాజంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపే కార్యకలాపాల్లో పాల్గొనరాదని పోలీసులు జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేయడం, మద్యపానం, మితిమీరి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని వడోదర పోలీస్‌ కమిషనర్‌ అనుపమ్‌ సింగ్‌ గహ్లోత్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

ఏటా నూతన సంవత్సర వేడుకల పేరుతో డిసెంబర్‌ 31న విపరీతంగా మద్యం,డ్రగ్స్‌ సేవించడంతో పాటు అసభ్యకర ధోరణులతో సంఘ వ్యతిరేక శక్తులు చెలరేగుతున్నాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. న్యూ ఇయర్‌ వేడుకల్లో లౌడ్‌ స్పీకర్లు వాడరాదని, రాత్రి పదిగంటల తర్వాత బాణాసంచా కాల్చరాదని స్పష్టం చేశారు. వేడుకల నిర్వాహకులు సీసీటీవీ కెమెరాలు అమర్చాలని, అశ్లీల నృత్యాలు చేయరాదని పేర్కొన్నారు. 

ఇక న్యూఇయర్‌ వేడుకల సందర్భంగా వడోదరలో 40 చెక్‌పోస్టులు నగరంలో 1000 మంది పోలీసులను మోహరిస్తున్నట్టు నోటిఫికేషన్‌లో  పొందుపరిచారు.కాగా పోలీసులు జారీ చేసిన నోటిఫికేషన్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. మహిళలు, పురుషులు వారు ఏం  ధరించాలనేదానిపై నియంత్రణలు తగవని ఇది మోరల్‌ పోలీసింగ్‌కు దారితీస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు