New Parliament Dress Code: పార్లమెంట్‌ ఉద్యోగులకు కొత్త యూనిఫామ్‌.. 

13 Sep, 2023 07:51 IST|Sakshi

భారతీయత ఉట్టిపడేలా డ్రెస్‌లు   

కాంగ్రెస్‌ కౌంటర్‌ ఇదే..

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలకు సమయం సమీపిస్తోంది. ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకూ ఐదురోజులపాటు ఈ సమావేశాలు పార్లమెంట్‌లో నూతన భవనంలో జరుగుతాయి. మొదటి రోజు పాత భవనంలోనే సమావేశం నిర్వహించి, రెండో రోజు (ఈ నెల 19న) వినాయక చవితి సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి, కొత్త భవనంలోకి లాంఛనంగా అడుగుపెడతారు. 

కొత్త భవనానికి తరలివెళ్తున్న నేపథ్యంలో పార్లమెంట్‌ ఉద్యోగులు, సిబ్బంది ధరించే యూనిఫామ్‌ను మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అసలు సిసలైన భారతీయత ఉట్టిపడేలా ఈ దుస్తులు ఉంటాయని సమాచారం. నెహ్రూ జాకెట్లు, ఖాకీ రంగు ప్యాంట్లు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ(నిఫ్ట్‌) నిపుణులు ఈ యూనిఫామ్‌లను డిజైన్‌ చేస్తున్నారు. ఉన్నతాధికారులు ధరించే నెహ్రూ జాకెట్‌ ముదురు గులాబీ రంగులో కమలం పువ్వు డిజైన్‌తో ఉంటుందని సమాచారం. ఉభయ సభల మార్షల్స్‌ డ్రెస్‌ను కూ డా మారుస్తున్నారు. వారు మణిపురి తలపాగాలు ధరిస్తారు. సెక్యూరిటీ సిబ్బంది ధరించే సఫారీ సూట్లలోనూ మార్పులుంటాయి. సైని కులు ధరించే డ్రెస్‌ లాంటిది వారికి ఇవ్వబోతున్నారు.  

ఎన్నికల గుర్తు ముద్రించడం ఏమిటి?: కాంగ్రెస్‌ 
పార్లమెంట్‌ సిబ్బంది యూనిఫామ్‌పై ‘కమలం’ను ముద్రించబోతున్నారంటూ వచ్చిన వార్తలపై కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మాణిక్కం ఠాగూర్‌ స్పందించారు. జాతీయ జంతువు పులి, జాతీయ పక్షి నెమలి బొమ్మ కాకుండా కమలం గుర్తు ముద్రించడం ఏమిటని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. బీజేపీ ఎన్నికల గుర్తు కాబట్టే కమలాన్ని ముద్రిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ‘ట్విట్టర్‌’లో పోస్టు చేశారు.    

ఇది కూడా చదవండి:  జీ20 నిర్వహణకు రూ.4,100 కోట్లా

మరిన్ని వార్తలు