హనీ.. సింగ్‌.. ఓ కథ..

16 Jul, 2017 01:56 IST|Sakshi
హనీ.. సింగ్‌.. ఓ కథ..
- తలలంటుకుని జన్మించిన చిన్నారులు
ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబం
శస్త్ర చికిత్సకు ఢిల్లీ ఎయిమ్స్‌లో ఏర్పాట్లు
చేయూతనందించిన రైల్వే శాఖ
 
సాక్షి, భువనేశ్వర్‌: తెలుగునాట తలలంటుకుని జన్మించిన వీణావాణిలను మరిచిపోకముందే.. ఒడిశాలోని కంధమాల్‌ జిల్లా ఫిరంగియా గ్రామంలోనూ వీరిలానే ఇద్దరు చిన్నారులు తలలంటుకుని నరకయాతన అనుభవిస్తున్నారు. వారే రెండున్నరేళ్ల హానీ, సింగ్‌. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు తమ బిడ్డల బాధలు చూడలేక తల్లిదండ్రులు విలవిల్లాడుతున్నారు. ఒకేసారి జన్మించిన సోదరులు విధి వైచిత్రితో ఇంతవరకు ఒకరి ముఖం ఒకరు చూడలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.
 
అందరి సాయంతో
చిన్నారుల దయనీయ పరిస్థితి అందరి హృదయాల్ని కలిచివేసింది. చికిత్స కోసం తల్లిదండ్రులు కటక్‌లోని ఎస్సీబీ మెడికల్‌ కళాశాల ఆస్పత్రి వైద్యుల్ని సంప్రదించారు. అయితే చిన్నారులకు చికిత్స అందించడానికి స్థానికంగా వైద్య సదుపాయాలు అందుబాటులో లేవు. దీంతో కళాశాల సలహా మేరకు చిన్నారులతో కలసి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు బయలుదేరారు. వీరితోపాటు నువాపడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ఆయుష్‌ వైద్యుడు, జాతీయ బాలల ఆరోగ్య కార్యక్రమం విభాగం నుంచి మరో అధికారి కూడా ఉన్నారు. కంధమాల్‌ కలెక్టర్‌ స్వయంగా ఎయిమ్స్‌ డీఎంఈటీ డైరెక్టర్‌ డాక్టర్‌ అశోక్‌ మహాపాత్రోతో ఫోన్‌లో మాట్లాడారు.

ఎయిమ్స్‌ న్యూరోవిభాగం వీరికి శస్త్రచికిత్స నిర్వహిస్తుంది. ఎయిమ్స్‌లో చికిత్స విజయవంతమై అన్నదమ్ములిద్దరూ  ఆడుతూపా డుతూ ఉండాలని అందరూ నిరీక్షిస్తున్నారు. అయితే వీరికి శస్త్రచికిత్స నిర్వహించే తేదీని ఎయిమ్స్‌ ఇంకా ఖరారు చేయలేదు. మరోవైపు రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో న్యూఢిల్లీ బయల్దేరిన హానీ, సింగ్‌లకు దారిపొడవునా ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. టాటా నగర్‌ రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక వైద్య నిపుణుల బృందం చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించింది. 
మరిన్ని వార్తలు