'దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించం'

20 Aug, 2019 16:58 IST|Sakshi

రిగా : లాత్వియా దేశ అధ్యక్షుడు లేవిట్స్‌తో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమావేశమై రెండు దేశాల మధ్య సాంస్కృతిక, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, విద్య రంగంపై చర్చలు జరిపారు. లిథువేనియా, లాత్వియా, ఎస్టోనియాలో ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి మంగళవారం ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా  భారత- లాత్వియా దేశాల మధ్య పలు ద్వైపాక్షిక అంశాలు చర్చకు వచ్చి మైత్రి సంబంధాలు మరింత పటిష్టం కావాలని అభిలాషించారు.  

లాత్వియా స్వాతంత్ర సమరయోధుల స్థూపం వద్ద నివాళులర్పించిన వెంకయ్య నాయుడు అనంతరం ఆ దేశ చారిత్రక మ్యూజియంను సందర్శించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌ శాంతికాముక దేశమని, జమ్మూ కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని ఆయన స్పష్టం చేశారు. భారత్‌ ఏ దేశాన్ని ఆక్రమించబోదనీ అయితే దేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటే మాత్రం ఊరుకునేది లేదని ఆయన పేర్కొన్నారు. 

ఇక ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్‌కు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలని లాత్వియా అభిప్రాయపడింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భద్రతామండలిలో సంస్కరణలు జరగాలని పేర్కొంది.

మరిన్ని వార్తలు