Israel-Palestine War Updates: గాజాలో ఆగని వేట

8 Nov, 2023 04:20 IST|Sakshi

నెల రోజులకు చేరిన ఇజ్రాయెల్‌–హమాస్‌ యుద్ధం  

దక్షిణ గాజాలో రాత్రి నుంచి ఉధృతంగా దాడులు  

గాజా స్ట్రిప్‌/జెరూసలేం: ఇజ్రాయెల్‌–హమాస్‌ మిలిటెంట్ల మధ్య యుద్ధం మంగళవారం నెల రోజులకు చేరుకుంది. సోమవారం రాత్రి నుంచి ఇజ్రాయెల్‌ సైన్యం దక్షిణ గాజాపై వైమానిక దాడులు నిర్వహించింది. ఖాన్‌ యూనిస్, రఫా, డెయిర్‌ అల్‌–బలా నగరాల్లో పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర గాజాలోని గాజీ సిటీలోకి ఇజ్రాయెల్‌ సేనలు అడుగుపెట్టినట్లు తెలిసింది.

యుద్ధంలో ఇప్పటిదాకా గాజాలో 4,100 మంది చిన్నారులు సహా 10,328 మంది, ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా జనం మరణించారు. గాజాలో హమాస్‌ను అధికారం నుంచి కూలదోయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ ప్రభుత్వం వ్యూహాలకు పదును పెడుతోంది. మిలిటెంట్ల కోసం ఇజ్రాయెల్‌ సైన్యం వేట కొనసాగిస్తోంది.  ఉత్తర గాజాపై దృష్టి పెట్టింది. గాజా జనాభా 23 లక్షలు కాగా, యుద్ధం మొదలైన తర్వాత 70 శాతం మంది నిరాశ్రయులయ్యారు. ఆహారం, నీరు, ఔషధాలు, నిత్యావసరాలు లేక క్షణమొక యుగంగా కాలం గడుపుతున్నారు.  

మరో ఐదుగురు బందీల విడుదల  
ఇప్పటికే నలుగురు బందీలను విడుదల చేసిన హమాస్‌ మిలిటెంట్లు మరో ఐదుగురికి విముక్తి కలిగించారు. అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌ దాడిచేసిన మిలిటెంట్లు దాదాపు 240 మందిని బందీలుగా గాజాకు తరలించడం తెల్సిందే.  

గాజా రక్షణ బాధ్యత మాదే: నెతన్యాహూ   
హమాస్‌ మిలిటెంట్లపై యుద్ధం ముగిసిన తర్వాత గాజా స్ట్రిప్‌ రక్షణ బాధ్యతను నిరవధికంగా ఇజ్రాయెల్‌ తీసుకుంటుందని ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహూ చెప్పారు. తద్వారా గాజా స్ట్రిప్‌ మొత్తం ఇజ్రాయెల్‌ నియంత్రణ కిందికి వస్తుందని సంకేతాలిచ్చారు. గాజాను తమఅదీనంలోకి తీసుకొచ్చేందుకు ఇజ్రాయెల్‌ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో నెతన్యాహూ మాట్లాడారు. గాజాలోకి మానవతా సాయాన్ని చేరవేయడానికి లేదా హమాస్‌ చెరలో ఉన్న 240 మంది బందీలను విడిపించడానికి వీలుగా మిలిటెంట్లపై యుద్ధానికి స్వల్పంగా విరామం ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే, బందీలను హమాస్‌ విడిచిపెట్టేదాకా గాజాలో కాల్పుల విరమణ పాటించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.  

పెట్రోల్, డీజిల్‌ నిల్వలు ఖాళీ!  
గాజాలోకి పెట్రోల్, డీజిల్‌ సరఫరాకు ఇజ్రాయెల్‌ అనుమతి ఇవ్వడం లేదు. గాజాలో ఇంధనం నిల్వలు పూర్తిగా నిండుకున్నట్లు సమాచారం. ఇంధనం లేక పరిస్థితి మరింత దిగజారుతోందని స్థానిక అధికారులు ఆందోళన చెందుతున్నారు. గాజాలో 35 ఆసుపత్రులు ఉండగా, వీటిలో 15 ఆసుపత్రుల్లో వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇజ్రాయెల్‌ దాడులతోపాటు ఇంధనం లేకపోవడమే ఇందుకు కారణం. మిగిలిన ఆసుపత్రులు పాక్షికంగానే పని చేస్తున్నాయి.   

సమస్య పరిష్కారంలో భద్రతా మండలి విఫలం  
నెల రోజులుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్‌–హమాస్‌ యుద్ధానికి పరిష్కారం సాధించడంలో ఐక్యరాజ్యసమితి భదత్రా మండలి మరోసారి విఫలమైంది. తాజాగా మండలిలో రెండు గంటలకుపైగా చర్చ జరిగింది. సభ్యదేశాలు భిన్న వాదనలు వినిపించాయి. ఏకాభిప్రాయానికి రాకపోవడంతో తీర్మానం ఆమోదం పొందలేదు. మానవతా సాయాన్ని గాజాకు చేరవేయడానికి అవకాశం కల్పించాలని ఇజ్రాయెల్‌కు అమెరికా సూచించింది. 

రఫా పట్టణంలో ఇజ్రాయెల్‌ దాడి తర్వాత స్థానికుల ఆక్రందన  

మరిన్ని వార్తలు