పాక్ మిత్రదేశం తుర్కియే వక్రబుద్ధి.. ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ అంశం..

21 Sep, 2023 07:52 IST|Sakshi

న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి 78వ అసెంబ్లీ సమావేశాల సందర్బంగా తుర్కియే దేశాధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డొగాన్ మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. భారత్ పాకిస్తాన్ వ్యవహారాల్లో తలదూర్చవద్దని భారత్ పలుమార్లు హెచ్చరించినా కూడా పట్టించుకోని ఆయన తాజా సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తి దక్షిణాసియాలో శాంతి స్థాపన జరగాలంటే భారత్ పాక్ మధ్య సంధి కుదర్చాలని అన్నారు. 

సహకరిస్తాం..? 
న్యుయార్క్‌ వేదికగా జరుగుతున్న ఐక్యరాజ్యసమితి 78వ అసెంబ్లీ సమావేశాల్లో తుర్కియే అధ్యక్షుడు కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. దక్షిణాసియా ప్రాంతంలో ప్రాంతీయ శాంతి, సుస్థిరత, శ్రేయస్సు స్థాపించబడాలంటే భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య చర్చలు జరగాలని ఇరుదేశాల పరస్పర సహకారం ద్వారా కశ్మీర్‌లో సుస్థిరమైన శాంతని నెలకొల్పాలని అన్నారు. ఈ చర్చలకు తుర్కియే సహకారం ఉంటుందని చెప్పుకొచ్చారు. భారత్ పాకిస్తాన్ దేశాలు స్వాతంత్య్రం, సార్వభౌమాధికారం సాధించి 75 ఏళ్లు పూర్తయినా రెండు దేశాల మధ్య శాంతి సంఘీభావం స్థాపించబడాలపోవడం దురదృష్టకరమని అన్నారు. కశ్మీర్‌లో శాశ్వత శాంతితో పాటు శ్రేయస్సు కూడా స్థాపించబడలని కోరుకుంటూ ప్రార్ధిస్తున్నానన్నారు.   

చెప్పినా వినకుండా.. 
ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ ప్రస్తావన తీసుకురావద్దని భారత్ గతంలో కూడా అనేక మార్లు తుర్కియేను హెచ్చరించింది. ఒకవేళ వారు ఆ పని చేస్తే తాము సైప్రస్ అంశాన్ని లేవనెత్తుతామని కూడా తెలిపింది. ఇటీవల జరిగిన జీ20 సమావేశాల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ తుర్కియే అధ్యక్షుడు ఎర్డొగాన్‌తో వాణిజ్యం, మౌలిక సదుపాయాల సంబంధాలను బలోపేతం చేయడానికి చర్చలు కూడా జరిపారు. అయినా కూడా ఎర్డొగాన్‌ ఐక్యరాజ్య సమితిలో తమ మిత్రదేశమైన పాకిస్తాన్‌కు వత్తాసు పలికారు ఆ దేశ అధ్యక్షుడు. 

ప్రపంచం వారికంటే పెద్దది.. 
సమావేశాల్లో ఎర్డొగాన్‌ మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ పాత్ర పోషించడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో ఐదు శాశ్వత సభ్యులతో పాటు తాత్కాలిక సభ్యులుగా ఉన్న 15 దేశాలను కూడా శాశ్వత సభ్యులుగా చేయాలని డిమాండ్ చేశారు. ఈ 20 సభ్యదేశాలను రొటేషన్ పధ్ధతిలో శాశ్వత సభ్యదేశాలుగా కొనసాగించాలని అమెరికా, బ్రిటన్, చైనా, రష్యా, ఫ్రాన్స్ కన్నా ప్రపంచం చాలా పెద్దదని ఆయన అన్నారు.  

ఇది కూడా చదవండి: ట్రూడో ఆరోపణలు తీవ్రమైనవే: అమెరికా

మరిన్ని వార్తలు