ఆస్పత్రిలో కెప్టెన్

10 Jul, 2014 00:49 IST|Sakshi
ఆస్పత్రిలో కెప్టెన్

 సాక్షి, చెన్నై: డీఎండీకే అధినేత విజయకాంత్ ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చేరిన సమాచారం ఆ పార్టీ వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ నాటి నుంచి విశ్రాంతి లేకుండా ఆయన ఉరుకులు పరుగులు తీయడంతోనే అనారోగ్యం పాలు కావాల్సి వచ్చిం దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  లోక్‌సభ ఎన్నిక ల ముందు నుంచి విజయకాంత్ పార్టీ పరంగా, తనయుడి తెరంగేట్రం పరంగా బిజీ బిజీగా ఉన్నారు. కొన్నాళ్లు సింగపూర్‌లో సైతం ఆ చిత్ర విషయంగా మంతనాల్లో మునిగారు. అలాగే, లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు వ్యవహారం తేల్చుకునే పని సైతం సింగపూర్‌లోనే పూర్తి చేశారు. అక్కడి నుంచి వచ్చీరాగానే, బీజేపీతో దోస్తీ కట్టేసి, తమ అభ్యర్థుల్ని ప్రకటించేశారు.

ఎన్నికల ప్రచారబాట పట్టి రేయింబవళ్లు శ్రమించారు. చివరకు ఫలితం తమ పార్టీ డిపాజిట్లు గల్లంతు కావడంతోపాటుగా ఓటు బ్యాంక్ తగ్గడమే. దీంతోపాటు పార్టీ నుంచి వలసలు మొదలయ్యూయన్న ఆందోళన ఆయన్ను వెంటాడింది. ఎట్టకేలకు పార్టీని రక్షించుకోవడంతో పాటుగా కార్యకర్తల్లో నూతనోత్సాహం లక్ష్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. అదే సమయంలో తనయుడు షణ్ముగ పాండియన్ శతాబ్దం చిత్రంలో తాను ప్రత్యేక పాత్రలో కన్పిస్తుండడంతో ఆ షూటింగ్ బిబీలో పడ్డారు. సింగపూర్‌లో రెండు, మూడు వారాలు గడిపి షూటింగ్ ముగించుకుని చెన్నైకు రాగానే, పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టారు.

మీతో నేను : కార్యకర్తల చెంతకు నేరుగా వెళ్లేందుకు నిర్ణయించిన విజయకాంత్ ఁమీతో నేను* కార్యక్రమానికి గత నెల శ్రీకారం చుట్టారు. తొలుత దక్షిణాది జిల్లాలో పర్యటించిన ఆయన, ప్రస్తుతం చెన్నై , తిరువళ్లూరు పర్యటనలో ఉన్నారు. మంగళవారం తిరువళ్లూరులో మీతో నేను అంటూ కార్యకర్తల్ని, నాయకుల్ని పలకరించారు. పార్టీ బలోపేతం లక్ష్యంగా అందరికీ ప్రత్యేక సూచనలు ఇచ్చారు. తన వ్యూహాలకు పదును పెట్టే పనిలో ఉన్న విజయకాంత్‌కు బుధవారం ఉదయాన్నే ఛాతినొప్పి రావడం ఆ  పార్టీ వర్గాల్లో కలవరం రేపింది.

విశ్రాంతి లేకుండా విజయకాంత్ బిజీ షెడ్యూల్‌లో పడి ఆరోగ్యం గురించి విస్మరించినట్టున్నారు. ఉదయాన్నే ఇంట్లో ఉన్న విజయకాంత్‌కు స్వల్పంగా ఛాతి నొప్పి వచ్చింది. దీంతో ఆయన్ను హుటాహుటిన కుటుంబీకులు గ్రీమ్స్ రోడ్డు అపోలోకు తరలించారు. అక్కడి మూడో అంతస్తులో విజయకాంత్‌కు చికిత్స అందిస్తున్నారు. అయితే, తమ అధినేత విజయకాంత్‌కు చాతినొప్పి సమాచారంతో ఆ పార్టీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. అయితే, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆ పార్టీ వర్గాలు వివరణ ఇచ్చుకునే పనిలో పడ్డాయి.

అవిశ్రాంతంగా విజయకాంత్ తన షెడ్యూల్‌ను రూపొందించుకుని చివరకు ఆస్పత్రి పాలయ్యారంటూ ఆ పార్టీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారుు. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆ పార్టీ నాయకులు అక్కడికి వచ్చిన కార్యకర్తలకు నచ్చచెప్పి పంపుతున్నారు. ఎవరూ ఆస్పత్రి వద్దకు రావాల్సిన అవసరం లేదని, విజయకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారని చెబుతున్నారు. అయితే, విజయకాంత్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం యాంజియో గ్రాంకు నిర్ణయించినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

whatsapp channel

మరిన్ని వార్తలు