సంస్కృతాన్ని సంరక్షిద్దామన్న హిమాచల్ సీఎం..

16 Sep, 2016 09:52 IST|Sakshi
సంస్కృతాన్ని సంరక్షిద్దామన్న హిమాచల్ సీఎం..

సిమ్లాః ప్రాచీన సంస్కృత భాషను సంరక్షించడం తక్షణావసరమని  హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ పిలుపునిచ్చారు. ప్రపంచంలోని అన్ని భాషలకు ప్రధానమైన... తల్లిలాంటి సంస్కృతభాష.. మన సంస్కృతి కూడా అని ఆయన గుర్తు చేశారు.

వేదాలు, పురాణాలు, ఇతిహాసాలతోపాటు.. అనేక గ్రంథాలు.. దేవభాషగా చెప్పే సంస్కృతంలోనే లిఖించబడి ఉన్నాయని, అందుకే సంస్కృతాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సింగ్ తెలిపారు. 'సమాజం, దేశం అభివృద్ధిలో సంస్కృతం పాత్ర' పై సోలాన్ లో జరిగే మూడు రోజుల జాతీయ సంస్కృత సెమినార్ కు ఆయన అధ్యక్షత వహించారు. భారత దేశాన్ని 'విశ్వ గురు' గా నిలిపేందుకు, పురాతన భారతీయ నాగరికత పరిణామం గురించి తెలుసుకునేందుకు సంస్కృతం ఎంతగానో సహకరించిందని ఆయనన్నారు. మన సంప్రదాయాలు, సంస్కృతితోపాటు.. పురాతన భాషను సంరక్షించడం తక్షణావసరమని వీరభద్రసింగ్ పేర్కొన్నారు.

సంస్కృత భాషలో లిఖించిన భారత ఇతిహాసాలు, మహాకావ్యాలు ఇతర భాషల్లో సైతం అనువదిస్తున్నారని, అధ్యయనాలు చేపడుతున్నారని,   సంస్కృతాన్ని పశ్చిమాన ఓ విదేశీ భాషగా కూడా చదువువుతున్నారని.. అటువంటిది మనం సంస్కృతాన్ని విస్మరించడం తగదని సింగ్ అభిప్రాయపడ్డారు. సంస్కృత భాషపై యువతకు ఆసక్తి తగ్గుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమయంలో భారత భాషల విశిష్టతను తెలుపుతూ.. వాటి అధ్యయనానికి యువతను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. సంస్కృతంలో ఉన్నత విద్య చదివాలనుకున్నవారికి తమ ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని చెప్పిన సింగ్.. రాష్ట్రంలో భాషను ప్రచారం చేస్తున్న పండితులను కొనియాడారు.

మరిన్ని వార్తలు