‘వర్చువల్‌’గా పార్లమెంటు సమావేశాలు! 

10 Jun, 2020 01:57 IST|Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలపై కరోనా ప్రభావం పడింది. గతంలో వలె.. వర్షాకాల సమావేశాల నిర్వహణ సాధ్యం కాదని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులకు ఇరు సభల సెక్రటరీ జనరల్స్‌ స్పష్టం చేశారు. కనీసం ఒక మీటరు భౌతిక దూరం పాటిస్తూ సీట్లకు కేటాయించినా∙సమావేశ మందిరాల్లో సభ్యులందరికీ సీట్లు కేటాయించలేమన్నారు. పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో, విజ్ఞానభవన్‌ ప్లీనరీ హాల్‌లో అందరు సభ్యులకు సీట్లు కేటాయించగలిగేంత స్థలం లేదన్నారు. భౌతిక దూరం పాటిస్తూ ఎంతమంది ఎంపీలకు సభలో సీట్లు కేటాయించగలమో వారికి తెలిపారు. భౌతిక దూరం పాటిస్తూ సీట్లను ఏర్పాటు చేస్తే రాజ్యసభ సమావేశ మందిరంలో 60 మందికే కూర్చునే అవకాశం లభిస్తుందని, సెంట్రల్‌హాల్‌లో 100 మందికే కూర్చునే వీలుంటుందని తెలిపారు.

గ్యాలరీల్లోనూ కూర్చునేలా ఏర్పాట్లు చేసినా అందరు ఎంపీలకు అవకాశం కల్పించలేమన్నారు. దాంతో ఆన్‌లైన్‌ ద్వారా వర్చువల్‌ విధానంలోనో, లేదా హైబ్రిడ్‌ విధానంలోనో సమావేశాల నిర్వహణ సాధ్యమవుతుందా? అనే విషయాన్ని ఓం బిర్లా, వెంకయ్య పరిశీలించారు. కొందరు సభ్యులు ప్రత్యక్షంగా సమావేశాలకు హాజరైతే మిగతావారు వీడియో లింక్‌ ద్వారా వర్చువల్‌గా సభా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడమే హైబ్రిడ్‌ విధానం. రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా.. ఏ రోజు ఏ ఎంపీ భాగస్వామ్యం ప్రత్యక్షంగా అవసరమో, వారినే సభలోనికి అనుమతించి, మిగతా వారు ఆన్‌లైన్‌లో సభాకార్యక్రమాల్లో పాల్గొనేలా చేయాలనే విషయాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలను వర్చువల్‌గానో, హైబ్రిడ్‌ విధానంలోనో నిర్వహించడానికి సంబంధించి అన్ని సాంకేతిక అంశాలను పరిశీలించాలని సెక్రటరీ జనరల్స్‌ను ఇరు సభల అధ్యక్షులు ఆదేశించారు.

మరిన్ని వార్తలు