1,400 కిమీ దూరం, 4 ఏళ్లు సా...గింది

28 Jul, 2018 18:59 IST|Sakshi

బస్తీ, ఉత్తరప్రదేశ్‌ : బండి బండి రైలు బండి వేళకంటూ రాదులెండి.. దీన్ని గాని నమ్ముకుంటే ఇంతేనండి  ఈ పాట మన రైల్వేలకు చాలా బాగా సరిపోతుంది. మన రైల్లు గంటలు, నిమిషాలు మాత్రమే కాక అప్పుడప్పుడు రోజుల తరబడి కూడా ఆలస్యంగా నడుస్తుంటాయి. కానీ ఇప్పుడు మేం చెప్పబోయే రైలు బండి మాత్రం ఏకంగా సంవత్సరాల తరబడి ఆలస్యంగా వచ్చింది. ఏపీ నుంచి యూపీకి అంటే దాదాపు 1, 400 కిమీ దూరాన్ని చేరడానికి ఈ గూడ్స్‌ వ్యాగన్‌ బండికి ఏకంగా నాలుగేళ్లు పట్టింది.

వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీకి చెందిన రామచంద్ర గుప్తా అనే వ్యాపారి ఆంధ్రప్రదేశ్‌, విశాఖపట్టణంలో ఉన్న ఇండియన్‌ పొటాషియమ్‌ లిమిటెడ్‌ (ఐపీఎల్‌) కంపెనీ నుంచి 1, 316 బస్తాల డీఏపీ ఎరువును బుక్‌ చేశాడు. దాంతో ఐపీఎల్‌ కంపెనీ ఈ ఎరువును సరఫరా చేసేందుకు రామచంద్ర గుప్తా పేరు మీద ఒక గూడ్స్‌ వ్యాగన్‌ను బుక్‌ చేశారు. సాధరంణంగా విశాఖ నుంచి యూపీలోని బస్తీని చేరడానికి పట్టే సమయం దాదాపు 42 గంటలు, అంటే మూడు రోజులు. కానీ మన రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ గూడ్స్‌ వ్యాగన్‌ యూపీకి చేరడానికి ఏకంగా నాలుగేళ్లు పట్టింది. 2014 నవంబర్‌లో ప్రయాణం ప్రారంభించిన ఈ గూడ్స్‌ వ్యాగన్‌ ఈ రోజు (జులై 28) మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో బస్తీని చేరుకుంది.

దాంతో ఆశ్యర్యపోయిన రైల్వే అధికారులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 2014లో ప్రయాణం ప్రారంభించిన ఈ వ్యాగన్‌ ఫిజికల్‌ కండిషన్‌ సరిగా లేకపోవడం చేత దానికి మరమత్తులు చేసే ఉద్దేశంతో బోగిని తప్పించారు. తరువాత ఆ విషయాన్ని మర్చిపోయారు. ఇన్నాళ్ల తర్వాత దాన్ని తిరిగి తన గమ్యస్థానికి చేర్చే ప్రయత్నం చేశారు. ఫలితంగా దాదాపు 3 సంవత్సరాల 8 నెలల తర్వాత ఈ బోగీ బస్తీని చేరుకుంది. దాంతో రైల్వే అధికారులు రామచంద్ర గుప్తాకు ఈ వ్యాగన్‌ గురించి సమాచారం అందించారు. కానీ గుప్తా మాత్రం ఆ ఎరువులను తీసుకోవడానికి నిరాకరించారు.

పాడైపోయిన ఈ ఎరువులను తీసుకుని ఏం చేసుకోవాలి అని ప్రశ్నించారు. అంతేకాక తాను గతంలోనే పలుమార్లు ఈ వ్యాగన్‌ గురించి రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశానని కానీ వారు మాత్రం దాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. ఇప్పుడు ఈ విషయం కంపెనీ యాజమాన్యం, రైల్వే బోర్డు మాట్లాడుకోని నిర్ణయించుకుంటారని తెలిపారు. వ్యాగన్‌లోని ఎరువుల ఖరీదు దాదాపు 10 లక్షల రూపాయల వరకూ ఉంటుందని తెలిపారు.

మరిన్ని వార్తలు