అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు

9 Oct, 2023 04:17 IST|Sakshi
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని సన్మానిస్తున్న లాలాపేట బస్తీ సంక్షేమ సంఘాల నేతలు 

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

లాలాపేట (హైదరాబాద్‌): హైదరాబాద్‌ నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి సహకరించడం లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఆయన ఆదివారం తార్నాక డివిజన్‌ లాలాపేటలోని బస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా బస్తీ వాసులంతా పలు సమ స్యలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా బస్తీ వాసులు కిషన్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడు తూ... హైదరాబాద్‌ నగరంలోని బస్తీలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. హైదరాబాద్‌ మొత్తం సింగపూర్, డల్లాస్‌ అయినట్లు బీఆర్‌ఎస్‌ నేతలు మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, బంధులు వంటి పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో నాలుగు రైల్వే స్టేషన్ల నిర్మాణం చేపట్టిందన్నారు. చర్లపల్లిలో మరో టెర్మినల్‌ నిర్మాణంలో ఉందన్నారు. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లను ఆధునీకరిస్తు న్నామని తెలిపారు. హైదరాబాద్‌ చుట్టూ ట్రిపుల్‌ ఆర్‌ రోడ్డును రూ.26 కోట్లతో మంజూరు చేశామన్నారు. సర్వే ఆఫ్‌ ఇండియా దగ్గర రూ.450 కోట్లతో నేషనల్‌ సైన్స్‌ సిటీని మంజూరు చేశామని కానీ దాని కోసం 25 ఎకరాల స్థలం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ పార్టీ కార్యాలయాలకు తప్ప ఇప్పటివరకు సైన్స్‌ సిటీకి స్థలం కేటాయించలేదని మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ మేయర్‌ బండ కార్తీకరెడ్డి బీజేపీ నేతలు బండ చంద్రారెడ్డి, రాము వర్మ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు