తుంగభద్ర డ్యామ్‌లో పెరుగుతున్న నీటిమట్టం

30 Jun, 2015 21:36 IST|Sakshi

- 26 టీఎంసీలకు పైగా చేరిన నీరు
- ఆయకట్టు రైతుల్లో హర్షాతిరేకం

సాక్షి, బళ్లారి : కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జీవనాడి అయిన తుంగభద్ర డ్యాంలో నీటిమట్టం రోజు రోజుకు పెరుగుతోంది. తుంగభద్ర డ్యాం గరిష్ట నీటి నిల్వ సామర్ధ్యం 101 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 26 టీఎంసీలకు పైగా నీరు నిల్వ చేరడంతో బళ్లారి, రాయచూరు, కొప్పళ జిల్లాలతో పాటు అనంతపురం, కర్నూలు, కడప, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన రైతుల్లో ఆశలు చిగురించాయి. ప్రస్తుతం డ్యాంలోకి 26 వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో రూపంలో చేరుతోంది. ఇదే ఇన్‌ఫ్లో మరో నాలుగు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని బోర్డు అధికారులు పేర్కొంటున్నారు. తుంగభద్ర డ్యాంలో గత ఏడాది ఇదే సమయానికి 13 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, ప్రస్తుతం 26 టీఎంసీల నీరు నిల్వ చేరడంతో రెండింతల నీరు వచ్చినట్లయింది. దీంతో ఖరీఫ్ సాగుకు ఎలాంటి ఢోకా ఉండబోదని చెప్పవచ్చు.


సకాలంలో ఆయకట్టు కాల్వలకు నీరు వదిలితే పంటలు సాగు చేసుకునేందుకు రైతులు సన్నద్ధం అవుతున్నారు. తుంగభద్ర డ్యాంకు ఎగువన నదీ పరివాహక ప్రాంతంలో మరోసారి భారీ వర్షాలు కురిస్తే జూలై నెలాఖరు కల్లా తుంగభద్ర డ్యాం పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం టీబీ డ్యాం నీటిమట్టం 1604.04 అడుగులు కాగా ఇన్‌ఫ్లో 26606 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 180 క్యూసెక్కులు, నీటి నిల్వ 25.131 టీఎంసీలు ఉందని, గత ఏడాది ఇదే సమయానికి డ్యాంలో నీటిమట్టం 1594.16 అడుగులు ఉండగా, ఇన్‌ఫ్లో 1703 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 205 క్యూసెక్కులు, నీటి నిల్వ సామర్ధ్యం 13.331 టీఎంసీలుగా ఉందని బోర్డు వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు