చెన్నై శివారులో ఘోర రోడ్డు ప్రమాదం: 8 మంది మృతి

30 Jun, 2015 21:18 IST|Sakshi
చెన్నై శివారులో ఘోర రోడ్డు ప్రమాదం: 8 మంది మృతి

- మృతుల్లో ముగ్గురు పోలీసులు
సాక్షి ప్రతినిధి, చెన్నై : చెన్నై శివారులోని మరక్కాణం వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మంది మృత్యువాతపడ్డారు. ఇందులో ముగ్గురు పోలీసులు ఉన్నారు. పుదుచ్చేరిలో సోమవారం రాత్రి జరిగే వివాహ రిసెప్షన్‌కు చెన్నై కేకే నగర్‌కు చెందిన ధనపాల్ భార్య విజయ పది మంది బంధువులతో కలిసి రెండు కార్లలో వెళ్లారు. రిసెప్షన్ చూసుకుని సోమవారం రాత్రి 11 గంటలకు కార్లలో తిరుగు ప్రయాణమయ్యారు.

అర్ధరాత్రి 12 గంటల సమయంలో మరక్కాణం వద్ద ఎదురుగా వస్తున్న మినీలారీ ఒక కారును ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు గాయపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు పెద్దఎత్తున రోడ్డుపై గుమికూడారు. మరక్కాణం పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.

కారు లోపల ఇరుక్కుపోయిన క్షతగాత్రులను వెలికి తీస్తుండగా పుదుచ్చేరి నుంచి చెన్నైకి చేపల లోడుతో వస్తున్న ఒక భారీ కంటైనర్ సహాయక చర్యలు చేపడుతున్న వారిపైకి దూసుకొచ్చింది. అప్పటికే ప్రమాదానికి గురైన కారును అదే వేగంతో ఢీకొంది. గుంపులోని జనంలో కొందరు ఎగిరి దూరంగా పడ్డారు. మరక్కాణం ఎస్‌ఐ సుబ్బయ్య (52), ప్రత్యేక పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ అర్ముగం (57), హైవే పోలీస్ పెట్రోలింగ్ వాహన డ్రైవర్ తవశీలన్ (36), పోలీసులకు సహాయపడేందుకు వచ్చిన మరక్కాణంకు చెందిన సురేష్ (35), జగన్నాథపురానికి చెందిన శంకర్ (40), ఆలపాక్కంకు చెందిన కాళిదాస్ (25), టోల్‌గేట్ అంబులెన్స్ డ్రైవర్ శేఖర్ (35), రిసెప్షన్‌కు వెళ్లి వస్తున్న కేకే నగర్‌కు చెందిన విజయ (40) మృతి చెందారు. మొదటి లారీ ఢీకొన్నపుడు కేవలం ఇద్దరు మాత్రమే గాయపడగా కంటైనర్ ఢీకొనడంతో 8 మంది మృతిచెందడం విషాదాన్ని నింపింది. బంధువులు, కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.
 

మరిన్ని వార్తలు