మైఖేల్‌ జాక్సనా.. మంగళ్‌ పాండేనా?

3 Apr, 2018 11:20 IST|Sakshi

లుథియానా : పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా తయారయ్యింది పంజాబ్‌కు చెందిన చంద్రశేఖర్‌ ప్రభాకర్‌ పరిస్థితి. ప్రముఖుల మైనపు విగ్రహాలను తయారు చేసే మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంను సందర్శించాలని చాలా మంది ఔత్సాహికులు కోరుకుంటారు. ప్రభాకర్‌ కూడా ఆ కోవక చెందిన వారే. టుస్సాడ్స్‌ మ్యూజియం చూడగానే ఆయన కూడా అలాంటి మ్యూజియం ప్రారంభించాలని ఆరాటపడ్డారు. అందుకే 2005లో లుథియానాలో ప్రభాకర్‌ మైనపు విగ్రహాల మ్యూజియం ప్రారంభించారు.

అబ్దుల్‌ కలామ్‌, మదర్‌ థెరిసా, సచిన్‌ టెండూల్కర్‌, బరాక్‌ ఒబామా, మైఖేల్‌ జాక్సన్‌ వంటి 52 మంది ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. చంద్రశేఖర్‌ మ్యూజియాన్ని చూసిన సందర్శకులు ట్విటర్‌ వేదికగా ఆయనపై జోకులు పేలుస్తున్నారు. సెలబ్రిటీల అసలు రూపానికీ, వారి విగ్రహాలకు అసలేమైనా పొంతన ఉందా అంటూ ఫొటోలతో ట్రోల్‌ చేస్తున్నారు.

‘మదర్‌ థెరిసా విగ్రహం హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌లా ఉంది’అని, ‘అబ్దుల్‌ కలాం హిల్లరీ క్లింటన్‌లా మారిపోయారని ఒక నెటిజన్‌ ట్వీట్‌ చేస్తే.. శశిథరూర్‌ అభిమాని కలాం విగ్రహాన్ని అలా మలచడంలో తప్పు లేదంటూ’ మరొకరు సెటైర్‌ వేశారు. ‘మ్యూజియం గనుక విగ్రహాలను చూసి ఆ సెలబ్రిటీ ఎవరో చెప్పాలనే పోటీ పెడితే ఒక్కరు కూడా గెలవలేరంటూ’  ప్రకాశ్‌ రాజ్‌ ట్వీట్‌ చేశారు.

విమర్శలపై స్పందించిన చంద్రశేఖర్‌.. ‘టుస్సాడ్స్‌ మ్యూజియంలో అధునాతన టెక్నాలజీ అందుబాటులో ఉంటుంది. వారు సెలబ్రిటీలను సంప్రదించి కొలతలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ మేం సింగిల్‌ డైమెన్షన్‌ ఆధారంగా విగ్రహాలు రూపొందిస్తున్నాము. ఇది సవాలుతో కూడుకున్న పని. మ్యూజియం నెలకొల్పి నా వంతుగా ఏదైనా చేయాలనుకున్నాను. ప్రస్తుతం అదే చేస్తున్నాను అంటూ’  వివరణ ఇచ్చారు.

మరిన్ని వార్తలు