డబ్బు కట్టలు వదిలి.. ఉల్లి ఎత్తుకెళ్లారు!

30 Nov, 2019 14:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కోల్‌కతా: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే నానుడి వినే ఉంటారు కదా. అంత మేలు చేసే ఉల్లి ధరలు ఇటీవల మార్కెట్‌లో ఆకాశాన్నంటిన సంగతి తెలిసిందే. మార్కెట్‌లలో కిలో ఉల్లి ధర రూ 100 నుంచి రూ.500 వరకు ఉండటంతో ఉల్లిపాయలను కొందామని మర్కెటికి వెళ్లిన వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి బయట డబ్బు, నగలకంటే ఉల్లిపాయలకే డిమాండ్‌ ఎక్కువగా ఉందనడంలో అతిశయోక్తి లేదు. ఇందుకు ఉదాహరణగా తాజా ఘటన నిలిచింది. ఓ షాపులో దొంగతనానికి వెళ్లిన దుండగులు డబ్బుల కట్టలను అక్కడే ఉంచి, ఉల్లిపాయల సంచులను ఎత్తుకెళ్లిన ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకుంది. బెంగాల్‌కు చెందిన అక్షయ్‌ దాస్‌ అనే ఓ కూరగాయల వ్యాపారికి తూర్పు మిడ్నాపూర్‌ జిల్లాలో షాపు ఉంది. రోజులాగే యథావిధిగా మంగళవారం షాపు తెరిచిన అక్షయ్‌ దాస్‌ ఒక్కసారిగా కంగుతిన్నాడు. షాపులోని వస్తువులు, కూరగాయలు చెల్లాచెదుదరుగా పడి ఉండటం చూసిన దాస్‌ కంగారు పడుతూ లోపలికి వెళ్లి చూశాడు.

షాపు అంతా చూసిన అతనికి దొంగతనం జరిగిన విషయం అర్థమైంది. ఇక మరు నిమిషం ఆలస్యం చేయకుండా షాపులోని నగదు పెట్టె వద్దకు వెళ్లి చూసుకున్నాడు. అందులోని డబ్బులు చెక్కు చెదరకుండా అలాగే ఉంటడంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా షాపుంతా పరిశీలించిన తర్వాత దాస్‌ మళ్లీ ఉలిక్కిపడ్డాడు. షాపులోని 50వేల రూపాయల విలువ చేసే ఉల్లిపాయల బస్తాలు లేకపోవడంతో లబోదిబోమన్నాడు. పశ్చిమ బెంగాల్‌ మార్కెట్‌లో ప్రస్తుతం ఉల్లి ధర కిలో రూ.100పైగా ఉండటంతో దొంగలు డబ్బుల కంటే ఈ ఉల్లిపాయలు తీసుకేళ్లడం మేలు అనుకున్నారేమో అందుకే డబ్బు వదిలేసి ఉల్లిపాయలు ఎత్తుకెళ్లారు.

మరిన్ని వార్తలు