కనీస మద్దతు ధర పెంపుపై స్పందనేంటి?

3 May, 2017 01:03 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆహార ధాన్యాలకు చెల్లించే కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)ను పెంచాలన్న ప్రొఫెసర్‌ రమేశ్‌చంద్‌ కమిటీ నివేదికపై తమ అభిప్రాయం చెప్పాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎంఎస్‌పీని పెంచాలంటూ సిటిజన్స్‌ రిసోర్స్, యాక్షన్‌ అండ్‌ ఇనీషియేటివ్‌ (క్రాంతి) స్వచ్ఛంద సంస్థ దాఖలుచేసిన పిటిషన్‌ను విచారిస్తున్న సీజేఐ జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌ల ధర్మాసనం మంగళవారం ఈ ఆదేశాలిచ్చింది.

కేసుకు సంబంధించిన గత డాక్యుమెంట్లు అన్నింటినీ పరిశీలించాక ప్రభుత్వం తన అభిప్రాయం చెబుతుందని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ పీఎస్‌ నర్సింహ సుప్రీంకోర్టుకు తెలిపారు. దీంతో, స్పందన తెలిపేందుకు కోర్టు ప్రభుత్వానికి నాలుగు వారాల గడువిచ్చింది. వ్యవసాయమనేది రాష్ట్రాలకు సంబంధించిన విషయమని, రైతు సంక్షేమ చర్యలు తీసుకునే బాధ్యత రాష్ట్రాలపైనా ఉందని, కేంద్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదని ధర్మాసనం చెప్పింది. అన్నదాతల ఆత్మహత్యల ఉదంతం తీవ్రమైన అంశమని, రైతు ఆత్మహత్యలకు పురిగొల్పుతున్న కారణాలపై దృష్టిపెట్టాలని కోర్టు ఆదేశించింది.

మరిన్ని వార్తలు