మరో 500 డిజిటల్‌ గ్రామాలు | Sakshi
Sakshi News home page

మరో 500 డిజిటల్‌ గ్రామాలు

Published Wed, May 3 2017 1:00 AM

మరో 500 డిజిటల్‌ గ్రామాలు

ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈఓ చందా కొచర్‌

న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ ఐసీఐసీఐ బ్యాంకు 100 రోజుల్లో దేశవ్యాప్తంగా 100 గ్రామాలను డిజిటల్‌గా తీర్చిదిద్దే ప్రాజెక్టును పూర్తి చేసింది. ఈ ఏడాది చివరికి మరో 500 గ్రామాలను కూడా ఇదే విధంగా మార్చనున్నట్టు ఐసీఐసీఐ బ్యాంకు చీఫ్‌ చందా కొచర్‌ మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా తెలిపారు. నైపుణ్య శిక్షణతోపాటు రుణ సదుపాయం కల్పించడం వంటి కార్యక్రమాలను బ్యాంకు ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టింది. 100 రోజుల్లో బ్యాంకు 11,300 మందికి వొకేషనల్‌ శిక్షణ ఇప్పించింది.

 వీరిలో 70 శాతం మహిళలే కావడం గమనార్హం. ‘‘2 లక్షలకు పైగా బ్యాంకు ఖాతాలను కూడా తెరిపించాం. మహిళలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాం. టైలరింగ్‌లో, డ్రెస్‌ డిజైనింగ్‌లో శిక్షణ ఇవ్వడంతో నెలకు రూ.20,000–30,000 సంపాదించుకోగలుగుతున్నారు’’ అని కొచర్‌ వివరిం చారు. ఈ గ్రామాల్లోని వారికి రూ.14 కోట్ల రుణాలు కూడా మంజూరు చేశామన్నారు. మరో 500 గ్రామాలను 2017 డిసెంబర్‌ నాటికి ఐసీఐసీఐ డిజిటల్‌ గ్రామాలుగా తీర్చిదిద్దుతామని, మరో 50,000 మందికి శిక్షణ ఇప్పిస్తామని కొచర్‌ పేర్కొన్నారు.

అకోదర స్ఫూర్తితో...
ఐసీఐసీఐ బ్యాంకు 100 డిజిటల్‌ గ్రామాల ప్రాజెక్టు గతేడాది నవంబర్‌లో మొదలైంది. 2015లో గుజరాత్‌లోని అకోదర గ్రామంలో బ్యాంకు ప్రయోగాత్మకంగా డిజిటల్‌గా ప్రాజెక్టును చేపట్టింది. ఇది విజయవంతం కావడంతో 100 గ్రామాలను ఇదే విధంగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్టు చందాకొచర్‌ తెలిపారు. తొలిదశ ప్రాజెక్టులో ఏపీ, తెలంగాణ, గుజరాత్‌ సహా 17 రాష్ట్రాలను చేరుకున్నామని, తదుపరి 500 గ్రామాల ప్రాజెక్టులో మరిన్ని రాష్ట్రాల్లోని గ్రామాలను ఎంచుకోనున్నట్టు కొచర్‌ తెలిపారు.

పేదలకు సంస్కరణల ఫలితాలు: జైట్లీ
ఆర్థిక సంస్కరణల ఫలితాలు వెనుకబడిన పేదలను చేరుకుంటుండటంతో దానిపై రాజకీయంగా జరుగుతున్న చర్చకు తెరపడుతోందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. సంస్కరణల ఫలితాలు గ్రామీణ ప్రజలను చేరుకోవాల్సి ఉందని... ఆ విధమైన ప్రాథమిక మార్పు ఇప్పుడు చోటుచేసుకుంటోందని చెప్పారు.. ఐసీఐసీఐ డిజిటల్‌ గ్రామాల ప్రాజెక్టును ఇతర బ్యాంకులు సైతం అనుసరిస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement