ఆడవాళ్లు తీసుకునే జాగ్రత్తల గురించి ఆమెకు తెలుసా?

2 Dec, 2017 15:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చండీగఢ్‌లో గత నెల 22 ఏళ్ల యువతిపై జరిగిన గ్యాంగ్‌ రేప్‌ సంఘటనపై ఆ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ కిరణ్‌ ఖేర్‌ స్పందిస్తూ ‘నీవు ఎక్కాల్సిన ఆటోలో అప్పటికే ముగ్గురు యువకులు కూర్చొని ఉన్నప్పుడు ఆ ఆటో నీవు ఎక్కాల్సింది కాదు’ అని బాధితురాలిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజా రవాణాకు కిరణ్‌ ఖేర్‌ చాలా కాలం నుంచి దూరంగా ఉన్నట్టున్నారు. అసలు ఆమెకు ఎన్నడూ ప్రజా రవాణాలో ప్రయాణించిన అనుభవమే ఉండక పోవచ్చు.

చండీగఢ్‌ లాంటి నగరాన్ని తీసుకుంటే షేరింగ్‌ టాక్సీలోగానీ, షేరింగ్‌ ఆటోలోగానీ వెళ్లాలంటే క్యూలో నిలబడాల్సిందే. నీ వంతు రాగానే గుడ్డిగా ఎక్కాల్సిందే, మరో ఛాయిస్‌ ఉండదు. లేదంటే పక్కకు  తోసేస్తారు. ఒక్కసారి క్యూ నుంచి పక్కకు వచ్చావంటే మళ్లీ అందరికన్నా వెనక నిలబడాల్సిందే. ఎక్కాల్సిన ఆటోలో ఎంత మంది ఉన్నారు? వారిలో పురుషులు ఎంత మంది ? మహిళలు ఎంత మంది? వారెలా ఉన్నారు? రౌడీల్లా ఉన్నారా? రేపిస్టుల్లా ఉన్నారా? సాధు జీవుల్లా ఉన్నారా? తెలుసుకునేందుకు వారి ముఖాలను పరికించి చూసే అవకాశంగానీ, ఆలోచించే క్షణంగానీ ఉండదు. ముందున్నది ట్యాక్సీ అయినా, ఆటో అయిన జనంతోపాటు ముందుకు నడవాల్సిందే.

షేరింగ్‌ కాకుండా సొంతంగా టాక్సీ లేదా ఆటో తీసుకోవడం వేరు. ఇంటి నుంచి ఆఫీసుకు, ఆఫీసు నుంచి ఇంటికి త్వరగా చేరుకునేందుకు ఆరాటపడే మహిళల్లో ఎక్కువ మందికి అంతటి స్థోమత ఉండదు. అంతటి స్థోమత ఉన్నవాళ్లు కూడా వాటిల్లో వెళ్లేందుకు ఇష్టపడరు. ఎందుకంటే భద్రత. ఒంటరిగా వెళితే జరుగకూడదేదో జరుగుతుందన్న ఆందోళన. అందుకనే పట్టణాల్లో ఉద్యోగాలు చేసి బతికే దిగువ, మధ్య తరగతి మహిళల్లో 99 శాతం ప్రభుత్వ లేదా ప్రజా రవాణేనే ఆశ్రయిస్తారు. కారణం, పదిమందిలోనే భద్రత ఉంటుందన్న నమ్మకం. అందుబాటులో ఉంటే ఎక్కువ మంది ప్రభుత్వ బస్సుల్లో వెళ్లేందుకు ఇష్టపడతారు. ఇప్పుడు దేశంలోని అనేక పట్టణాల్లో బస్సుల్లో, సెట్విన్లలో, షేరింగ్‌ ఆటో లేదా ట్యాక్సీల్లో వెళ్లాలంటే క్యూల్లో నిలబడాల్సిందే.

భారతీయ మహిళలకు ఇళ్లలో నుంచి బయటకు వెళ్లి రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కిరణ్‌ ఖేర్‌ లాంటి వారు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తల్లులు, అత్తలు, కజిన్స్, స్నేహితులు ఇలాంటి జాగ్రత్తలు చెబుతూనే ఉంటారు. అవి కాకుండా స్వానుభవంతో మరికొన్ని జాగ్రత్తలు తెలుసుకుంటారు. మనం ఎక్కడికి వెళుతున్నాం ? ఏ ప్రాంతానికి వెళుతున్నాం ? అక్కడ ఎలాంటి రకం మనుషులు ఉంటారు? వారి దృష్టిలో పడకుండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి దుస్తులు ధరించి వెళ్లాలి? ఇన్ని అంశాలను ఆలోచించి మహిళలు రోడ్డెక్కుతారన్న విషయం కిరణ్‌ ఖేర్‌కు ఎంత మేరకు తెలుసు?

రైళ్లలో ఎక్కినప్పుడు కూడా ఆ కంపార్ట్‌మెంట్‌లో మహిళలు ఉన్నారా, లేరా? ఉంటే ఎంత మంది మహిళలు ఉన్నారు? వారు గుంపుగా ఒక దగ్గరున్నారు ? వేర్వేరుగా ఉన్నారా? వాది వద్దకు వెళితే తనకు మరింత భద్రత ఉంటుందా? మగవాళ్లు ఎక్కువుంటే వారు గ్రూపులుగా కూర్చొని ఉన్నారా? విడివిడిగా ఎక్కువగా ఉన్నారా? వారు కాకతాళీయంగా  గుంపులుగా కూర్చున్నారా? లేదా వారి మధ్య పరిచయం ఉందా? అదే కంపార్ట్‌మెంట్‌లో ఉంటే తనకు మంచిదా, మరో కంపార్ట్‌మెంట్‌కు వెళ్లడం శ్రేయస్కరమా? ఇన్ని విధాలుగా మహిళలు ఆలోచిస్తారన్న విషయం కిరణ్‌ ఖేర్‌ లాంటి వారికి తెలుసా? దేశ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు ప్రపంచ స్థాయి రవాణా వ్యవస్థ ఉండాలని, దాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, అందుకు పోరాడాల్సిన బాధ్యత తన లాంటి ఎంపీలదని ఆమె ఎప్పటికైనా గ్రహిస్తారా? అత్యుత్తమ రవాణా వ్యవస్థ లేకనే ఇలా అప్పుడప్పుడు మహిళలు మగాళ్లకు బలవుతున్నారన్న విషయాన్ని ఇప్పటికైనా గుర్తిస్తారా? ప్రపంచస్థాయి రవాణా వ్యవస్థ అంటే ‘బుల్లెట్‌ ట్రెయిన్‌’ అనుకుంటే ఇక ఆ బుర్రలను ఏం చేయలేం!

ఇక్కడ చండీగఢ్‌లో గ్యాంగ్‌ రేప్‌కు గురైన అమ్మాయి ఎలాంటి రిస్క్‌ తీసుకోలేదు. పైగా  రిస్కు తీసుకువడం అనేది ఆమె ఇష్టం. నగరంలో ఎక్కడికైనా, ఎప్పుడైనా, రాత్రయినా, పగలైనా వెళ్లే హక్కు, పౌరుల మధ్య తిరిగే హక్కు ఆమెకుంది ? ఆమె హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.

(ముంబైలోని ‘టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌’ స్కూల్‌ ఆఫ్‌ మిడియా అండ్‌ కల్చరల్‌ స్టడీస్‌ ప్రొఫెసర్‌ శిల్పా పాడ్కే వ్యక్తం చేసిన అభిప్రాయాలకు అక్షరరూపం)

మరిన్ని వార్తలు