కశ్మీరీల వాట్సాప్‌ ఖాతాలు తొలగింపు

6 Dec, 2019 12:27 IST|Sakshi

ఢిల్లీ : జమ్ము కశ్మీర్‌లోని పౌరుల వాట్సాప్‌ ఖాతాలను ఆ సంస్థ తొలగించింది. ఆ రాష్ట్రంలో భద్రతా కారణాల రీత్యా ప్రభుత్వం ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆంక్షలు విధించిన తర్వాత ఇప్పటి వరకు నాలుగు నెలలు పూర్తయ్యాయి. వాట్సాప్‌ కంపెనీ అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఏ ఖాతా అయినా 120 రోజుల వరకు యాక్టివ్‌గా లేకపోతే ఆ ఖాతాకు సంబంధించిన డాటా ఆటోమేటిక్‌గా డిలీట్‌ అయిపోతుంది. అప్పటి వరకు ఏదైనా గ్రూపులో సభ్యులుగా ఉంటే డియాక్టివేట్‌ అయిపోతుంది. ఈ నేపథ్యంలో దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉంటున్న కశ్మీరీలకు తమ తమ స్నేహితులు, బంధువులు ఆయా గ్రూపుల నుంచి నిష్క్రమించినట్టు మెసేజ్‌లు వచ్చాయి. నాలుగు నెలల గడువు బుధవారంతో అయిపోవడంతో ఈ మెసేజ్‌లు వచ్చాయి.

ఈ విషయంపై వాట్సాప్‌ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘వాట్సాప్‌ అనేది గ్లోబల్‌ సంస్థ. ఒక ప్రాంతానికి సంబంధించినది కాదు. నాలుగు నెలల పరిమితి అనేది కంపెనీ నియమం. ఖాతాదారుల డేటా భద్రత కోసం పరిమితిని ఎక్కువ కాలం ఉంచవద్దని నియమంగా పెట్టుకున్నాం. ఇప్పుడు భౌగోళికత ఆధారంగా కశ్మీర్‌ ప్రాంత ప్రజల కోసం ప్రత్యేకంగా ఎలాంటి చర్యలు తీసుకోం. ఇంటర్నెట్‌ పునరుద్ధరించినప్పుడు వారు తిరిగి తమ ఖాతాలను యాక్టివేట్‌ చేసుకోవాలి. అయితే అంతకు ముందు వరకు ఉన్న డేటా మాత్రం వారికి అందుబాటులో ఉండద’ని స్పష్టం చేశారు. కాగా, భారత్‌లో వాట్సాప్‌ ఖాతాదారుల సంఖ్య దాదాపు 40 కోట్లు. ఇందులో జమ్ము కశ్మీరీల ఖాతాలు సుమారుగా 15 లక్షల వరకు ఉండవచ్చని ఒక అంచనా. 

మరిన్ని వార్తలు