గుడ్లు, చేపలు ఎందుకు మండుతున్నాయంటే..

17 Nov, 2017 12:22 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: కోడిగుడ్లు,చేపలు,కూరగాయల ధరలు భగ్గుమంటుండటంతో ఏం తినాలన్నా సామాన్యుడు జేబులు గుల్లవుతున్నాయి. రూ 5 దాటి భయపెడుతున్న గుడ్డు కొనాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితైతే చేపలూ, కూరగాయలదీ ఇదే దారి. శీతాకాలం చలిగాలుల తీవ్రత పెరగడంతో ఉత్తరాదిలో గుడ్డుకు డిమాండ్‌ పెరగడంతో ధర అమాంతం పెరిగిందని చెబుతున్నారు. ఇక తమిళనాడును కరువు బారిన పడటం, బీఫ్‌ నిషేధించడంతో చికెన్‌కు డిమాండ్‌ ఊపందుకోవడం ఇవన్నీ కోడిగుడ్డు ధరలకు రెక్కలు తెచ్చాయని వ్యాపారులు పేర్కొంటున్నారు.

దేశంలో తొలిసారిగా ఫౌల్ట్రీ ఫామ్‌లతో పాటు నెక్‌ సైతం కోడిగుడ్డు ధరను రూ 5.16గా ఖరారు చేసింది. కోడిగుడ్డు ధర రూ 5 పలకడం ఇదే మొదటిసారి. దేశంలో అతిపెద్ద పౌల్ట్రీ మార్కెట్‌ అయిన నమక్కల్‌ నుంచి 50 లక్షల గుడ్లను ఉత్తరాది రాష్ర్టాలకు పంపుతున్నారని మరోవైపు దక్షిణాదిలోనూ గుడ్లకు డిమాండ్‌ పెరగడంతో ధర ఎగబాకిందని తమిళనాడు పౌల్ర్టీ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎన్‌కే నల్లతంబి చెప్పారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ కోడిగుడ్ల ధరలు రూ 5పైనే ఉన్నాయని, ఇవి ముందుముందు పెరిగే అవకాశం లేకపోలేదని ఆయన అంచనా వేశారు.

వాతావరణ పరిస్థితులు అనుకూలించ మత్స్యకారులు చేపల వేటకు దూరంగా ఉండటంతో చేపలకూ గిరాకీ పెరిగిందని మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఇక అకాల వర్షాలు, కరువు నేపథ్యంలో కూరగాయల ధరలూ 30 శాతం మేర పెరిగాయి. 

మరిన్ని వార్తలు