యూసీసీకి సిద్ధం.. దేశంలోనే తొలి రాష్ట్రంగా నిలవనున్న ఉత్తరాఖండ్‌?

11 Nov, 2023 14:50 IST|Sakshi

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లోని బీజేపీ ప్రభుత్వం ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌) అమలు విషయంలో చర్యలు వేగవంతం చేసింది. సివిల్‌ కోడ్‌ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ రూపొందించిన నివేదిక (ముసాయిదా) అతిత్వరలో ప్రభుత్వానికి చేరనుంది. తద్వారా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఈ బిల్లుకు చట్ట రూపం తేవాలని పుష్కర్‌సింగ్‌ దామీ సర్కార్‌ యోచిస్తోంది. 

దేశంలోనే ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయబోయే తొలి రాష్ట్రంగా నిలిచేందుకు ఉత్తరాఖండ్‌ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రంజనా ప్రకాశ్‌ దేశాయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీని సివిల్‌ కోడ్‌ రూపకల్పన కోసం ఏర్పాటు చేసింది దామీ సర్కార్‌. ఈ కమిటీ రెండు లక్షల మందికి పైగా పౌరుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. మరో మూడు నాలుగు రోజుల్లో నివేదిక ప్రభుత్వాన్ని చేరనుందని సమాచారం. నివేదిక రాగానే.. యూసీసీని అమలులోకి తెచ్చేందుకు చర్యలు వేగవంతం చేస్తామని సీఎం పుష్కర్‌సింగ్‌  ఇదివరకే ప్రకటించారు. 

వచ్చే వారం ముసాయిదా (డ్రాఫ్ట్‌) కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. బిల్లులో బహుభార్యత్వం రద్దు ప్రధానాంశంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సహజీవనం కొనసాగించాలనుకునే జంట తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలనే నిబంధన కూడా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. కిందటి ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల హామీగా యూసీసీని చేర్చింది బీజేపీ.

మరిన్ని వార్తలు