-

11 నుంచి పార్లమెంటు

15 Nov, 2018 02:42 IST|Sakshi

జనవరి 8 వరకు శీతాకాల సమావేశాలు

విపక్షాలు సహకరించాలి: కేంద్రం

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్‌ 11 నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకూ జరగనున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ(సీసీపీఏ) సిఫార్సు చేసిందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి విజయ్‌ గోయెల్‌ చెప్పారు. డిసెంబర్‌ 11 నుంచి 2019, జనవరి 8 వరకు పార్లమెంటు సమావేశాలు జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు. క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా కేరళ, ఈశాన్య రాష్ట్రాల ఎంపీలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు వీలుగా సమావేశాల మధ్యలో వారం రోజుల విరామం ఇస్తామన్నారు.

మొత్తంమీద 20 రోజుల పాటు పార్లమెంటు జరుగుతుందన్నారు. ఈ సమావేశాలు ఫలప్రదమయ్యేందుకు వీలుగా సహకరించాలని అన్ని రాజకీయ పక్షాలను కోరుతున్నామన్నారు. కాగా, ఈ శీతాకాల సమావేశాల్లో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును రాజ్యసభలో ఆమోదింపజేసుకోవాలని కేంద్రం భావిస్తోంది. అలాగే భారత వైద్య మండలి సవరణ బిల్లు, కంపెనీల చట్టం సవరణ బిల్లు ఆర్డినెన్సులను ఆమోదింపజేసుకోవాలన్న కృతనిశ్చయంతో మోదీ ప్రభుత్వం ఉంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరం, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్న డిసెంబర్‌ 11నే పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుండటం గమనార్హం.

మరిన్ని వార్తలు