చైనాపై నిఘాకు 100 డ్రోన్లు!

22 Dec, 2015 09:50 IST|Sakshi
చైనాపై నిఘాకు 100 డ్రోన్లు!

వాషింగ్టన్: భారత్ కు అప్పుడప్పుడ తలనొప్పిగా మారుతున్న చైనా దుశ్చర్యల నుంచి బయటపడేందుకు భారత్ ఆలోచన చేస్తుంది. చైనా సైన్యం చేస్తున్న ఆగడాలను, సరిహద్దుల్లో చేస్తున్న నిర్వాహకాలను ఎప్పటికప్పుడు పసిగట్టి, అవసరం అయితే, గట్టి హెచ్చరికలు కూడా చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు అమెరికా నుంచి అత్యాధునిక మానవ రహిత విమానాలైన డ్రోన్ లను కొనుగోలుచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఢిల్లీలోని రక్షణ శాఖ వర్గాల సమాచారం ప్రకారం దాదాపు రెండు వేల కోట్ల రూపాయాలను డ్రోన్ల కోసం వెచ్చించనున్నట్లు సమాచారం.

ఆయుధ సహిత డ్రోన్లతోపాటు కేవలం నిఘాకు మాత్రమే ఉపయోగించే 100 డ్రోన్లను కొనుగోలుచేయనున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. సమావేశాలు, సదస్సుల సమయంలో భారత్ కు అనుకూలంగానే ఉన్నట్లు కనిపించే చైనా అప్పుడప్పుడు మాత్రం సరిహద్దుల్లో చెలరేగిపోతూ ఉంటుంది. కవ్వింపు చర్యలకు దిగుతుంటుంది. భారత్ సరిహద్దులోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేయడమే కాకుండా అప్పుడప్పుడు భారత్ మిలటరీ క్యాంపులపై దాడులు చేసే ప్రయత్నం కూడా చేస్తుంటుంది.

ఈ నేపథ్యంలో భారత్ చైనా సరిహద్దులో భారీ మొత్తంలో డ్రోన్లను భారత్ ఉపయోగించాలనుకుంటున్నట్లు సమాచారం. వీటితోపాటు ప్రిడేటర్ ఎక్స్ పీ డ్రోన్లను కూడా కొనుగోలు చేసి దేశ అంతర్గత భద్రతకు ఉపయోగించనుంది. ఇవి ఉగ్రవాదుల దాడుల వ్యూహాలను ముందే పసిగట్టడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఈ కొనుగోళ్లకు సంబంధించి అమెరికా అధికారులతో చర్చలు కూడా ఇప్పటికే ప్రారంభం అయినట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు