విలవిలలాడుతున్న ప్రాణి ప్రపంచం

14 Aug, 2017 13:34 IST|Sakshi
విలవిలలాడుతున్న ప్రాణి ప్రపంచం

గువాహటి: భారీ వర్షాలతో బ్రహ్మపుత్ర నదికి వరద పొటెత్తటంతో అస్సాం అతలాకుతలం అవుతోంది. పునరావాస శిబిరాల్లోకి కూడా నీరు వచ్చి చేరటంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించటం అధికారులకు కష్టతరంగా మారుతోంది. ప్రతిష్టాత్మక కజిరంగా జాతీయ ఉద్యావనం పరిస్థితి మరీ ఘోరంగా ఉంది.

పార్క్ లోకి భారీ ఎత్తున్న నీరు వచ్చి చేరుతుండటంతో సమీపంలోని కబ్రి, అంగోలాంగ్‌ జిల్లాల సరిహద్దు గ్రామాలవైపు జంతువులు పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలో వేటగాళ్ల బారిన పడే అవకాశం ఉండటంతో 188 ప్రత్యేక కాంపులను ఏర్పాటు చేసి ఫారెస్ట్ అధికారులు, రక్షణ గస్తీ కాస్తున్నారు. "85 శాతం పార్క్‌ నీటితో నిండిపోయింది. ఆదివారం బ్రహ్మపుత్ర వరదతో 6 అడుగుల కంటే ఎక్కువే నీరు వచ్చి చేరింది. 1988 వరదల కంటే దారుణమైన పరిస్థితిని ఇప్పుడు చూస్తున్నాం" అని కజిరంగ డివిజన్‌ ఫారెస్ట్ ఆఫీసర్‌ రోహిణి బల్లవ సాయికియా తెలిపారు.  
 
కజిరంగ ఉద్యానవనం ఏనుగులు, పులులు, తెల్ల దున్నపోతులు, అరుదైన దుప్పిజాతులు, మరీముఖ్యంగా రైనోలకు ఆశ్రయంగా ఉంది. వర్షాకాలం వచ్చిందంటే చాలూ బ్రహ్మపుత్ర నదికి ప్రతీయేడూ ఇలా వరదలు రావటం, కజిరంగ పార్క్ లోకి నీరు చేరి జంతువులు ఇబ్బందిపాలు అవుతుండటం సర్వసాధారణంగా మారింది. అయితే రాను రాను ఈ పరిస్థితి అధ్వానంగా తయారువతోందని, జంతువులను తరలించటం చాలా కష్టతరంగా మారుతోందని సాయికియా చెబుతున్నారు. గత నెలలో వరదల మూలంగా 7 రైనోలతోసహా 107 జంతువులు చనిపోగా, అందులో 13 వరదల నుంచి తప్పించుకునే క్రమంలో రోడ్డు దాటుతూ మృత్యువాత పడ్డాయి. పర్యాటక రోడ్లు, బ్రిడ్జిలు దెబ్బతినటంతో సమారు 7కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు