అమెరికాలో ‘వసంత పంచమి’

19 Jan, 2018 04:31 IST|Sakshi

ఆలయ అనుమతి లేదంటున్న అధికారులు

నిర్మల్‌/బాసర: బాసర క్షేత్రం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఈ ఏడాది వసంత పంచమి వేడుకలకు ఏర్పాటు చేయటం.. ఇక్కడి నుంచి పూజసామగ్రి.. పూజారులను తరలించే యత్నం చేశారు. ఇప్పటికే పంపిణీ చేసిన కరపత్రం.. ఇక్కడి నుంచి పూజారులను, పూజా సామగ్రిని తరలించేయత్నం వంటి చర్యలన్నీ అధికారిక కార్యక్రమాన్ని తలపిస్తుండగా.. ఆలయ అధికారులు మాత్రం తమకు సంబంధం లేదనడం చర్చనీయాంశంగా మారింది. 

బాసర దేవస్థానం పేరిట ఈనెల 20న అమెరికాలోని గ్రేటర్‌ ఫిలడెల్ఫియాలో నిర్వహించనున్నట్లు ఇప్పటికే అక్కడ కరపత్రాలు పంపిణీ చేశారు. పూజాసామగ్రి కూడా దేవస్థానమే అందిస్తోందని కరపత్రాల్లో పేర్కొన్నారు. అయితే, అమెరికాలో పూజా కార్యక్రమాలకు ఇక్కడి ఆలయం నుంచి విగ్రహాలు, ఎలాంటి పూజాసామగ్రి, అర్చకులు వెళ్లడం లేదని ఈవో సోమయ్య పేర్కొన్నారు. ఆలయ రిటైర్డ్‌ ఈవో వెనకుండి ఈ కార్యక్ర మాన్ని జరిపిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదరు కరపత్రంలో అతని పేరు ఇప్పటికీ ఈవోగానే ఉండటం గమనార్హం. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ఆలయానికి చెందిన ఇద్దరు అర్చకులు, ఇద్దరు ఉద్యోగులను తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే, వారి వీసాలు రద్దు కావటంతో పక్క జిల్లాకు చెందిన అర్చకులను తీసుకెళ్తున్నట్లు సమాచారం.  

మరిన్ని వార్తలు