దాహంతో వచ్చి.. కాలువలో పడి..

2 Feb, 2018 19:42 IST|Sakshi
సింగితం రిజర్వాయర్‌ కాలువలో పడిపోయిన నీల్‌గాయ్‌లు, గాయపడిన నీల్‌గాయ్‌

గాయాలపాలైన నీల్‌గాయ్‌లు

 రక్షించిన అటవీశాఖ అధికారులు

నిజాంసాగర్‌(జుక్కల్‌):  వేసవి కాలం ఆరంబానికి ముందే వన్యప్రాణులకు తాగునీటి తిప్పలు ప్రారంభమయ్యాయి. నీటికోసం వచ్చిన మూడు నీల్‌గాయ్‌లు గురువారం నిజాంసాగర్‌ మండలంలోని సింగితం రిజర్వాయర్‌ కాలువలో పడిపోయాయి. రిజర్వాయర్‌ కాలువలో నుంచి బయటకు రాలేక ఇబ్బందిపడ్డాయి. దీనిని గమనించిన స్థానికులు బాన్సువాడ అటవీశాఖ సెక్షన్‌ అధికారి సిద్ధార్థకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు.

బాన్సువాడ డివిజనల్‌ అటవీశాఖ అధికారి గోపాల్‌రావ్, సెక్షన్‌ ఆఫీసర్‌ సిద్ధార్థ సంఘటన స్థలానికి చేరుకుని బయటకు తీసేందుకు ప్రయత్నం చేశారు. సుమారు మూడు గంటలపాటు శ్రమించి వాటిని బయటికి తీశారు. ఒక నీల్‌గాయ్‌ రహదారి వెంట పరుగులు పెట్టడంతో ఊర కుక్కలు వెంబడించాయి. దీంతో అది నిజాంసాగర్‌ ప్రధాన కాలువలోకి దూకింది. ప్రధాన కాలువలో నీటి ప్రవాహం 1,600 క్యూసెక్కులు ఉండడంతో నీటిలో కొట్టుకుపోయింది. స్థానికులు సిరాజుద్దీన్, హన్మాండ్లు కాలువలోకి దూకి, తాళ్లతో బంధించి సురక్షితంగా బయటకు తీశారు. ఆ నీల్‌గాయ్‌కి గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స చేసి అటవీ ప్రాంతంలో వదిలారు.

మరిన్ని వార్తలు