డల్లాస్‌లో ఘనంగా ప్రాథమిక యోగా శిక్షణా సదస్సు

15 Dec, 2019 11:12 IST|Sakshi

టెక్సాస్‌:  ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్‌), ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) డల్లాస్‌లో  ప్రాథమిక యోగా శిక్షణా సదస్సు నిర్వహించింది.  జెన్‌స్టార్‌ మాంటెస్టరీ అకాడమీలో సభ్యుల ఆరోగ్య అవగాహన కోసం డిసెంబరు 14న ఏర్పాటు చేసిన ప్రాథమిక యోగా శిక్షణా సదస్సు అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంతో ఘనంగా జరిగింది. ప్రస్తుత టాంటెక్స్‌ అధ్యక్షులు చినసత్యం వీర్నపు, కళ్యాణి తాడిమేటి (సుఖీభవ కమిటీ సమన్వయ కర్త), సాంబ దొడ్డ(తానా SW region RVP) అందరికి స్వాగతం పలికారు. టాంటెక్స్‌, తానా నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించి సభకు టాంటెక్స్‌, తానా కార్యవర్గ సభ్యులను పరిచయం చేసి, వారి సహాయ సహకారాలతోనే ఇటువంటి మంచి కార్యక్రమాలను మీ ముందుకు తీసుకురాగలుగుతున్నాం అని చెప్పారు. తదుపరి దత్త యోగా క్రియ టీచర్స్‌ ప్రశాంత దుల్లూర్‌, శివరాజు జయన్నలను సభకు పరిచయం చేసి కార్యక్రమం ప్రారంభించారు.

యోగా టీచర్స్‌ ప్రశాంత్‌ దుల్లూర్‌, శివరాజు జయన్న ముందుగా టాంటెక్స్‌, తానా వారికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం యోగా ప్రక్రియ గురించి యోగా వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. నాడి సుద్ధి వ్యాయమాన్ని అందరికీ ఎలా చేయాలో చూయించి అందరూ ఆ వ్యాయామాన్ని ఎవరికి వారు చేయగలిగేలా నేర్పించారు. అలాగే ఆసనాలు, సూర్య నమస్కారాలు వాటివల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. సూర్యనమస్కారాల వల్ల జీర్ణశక్తి పెరుగుతుందని శరీరంలో నాడులన్నీ చక్కగా పనిచేస్తాయని మలబద్ధకం లాంటి రోగాల నుంచి ఉపశమనం కలుగుతుందని తెలియజేశారు.


యోగా మనకి పూర్వీకులు అందించిన మంచి ప్రక్రియ అని దాన్ని మనం సక్రమంగా వాడుకోగలిగితే మంచి ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉంటాయని తెలియజేశారు. చివరిగా ప్రాణాయమ ప్రక్రియను నేర్పి మన శరీరంలో ప్రతి అవయవం మన శ్వాసతో కలిసి పనిచేస్తుందని సరైన శ్వాసతో నాడులు పనితీరును యోగా ప్రక్రియ ద్వారా మెరుగుపర్చుకోవచ్చని తెలియజేశారు. అక్కడకు వచ్చిన సభ్యులు అందరూ ఎంతో ఓపికగా యోగాలో మెళకువలను నేర్పిన యోగా టీచర్స్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.

ముఖ్య అతిథులుగా వచ్చిన యోగా టీచర్స్‌ ప్రశాంత్‌ దుల్లూర్‌, శివరాజు జయన్నలను టాంటెక్స్‌ అధ్యక్షులు వీర్నపు చినసత్యం, సాంబ దొడ్డ (తానా sw region rvp), శ్రీకాంత్‌ పోలవరపు(తానా ఫౌండేషన్‌ డైరెక్టర్‌), కళ్యాణి తాడిమేటి(సుఖీభవ కమిటీ సమన్వయకర్త) శాలువా, జ్ఞాపిక ఇచ్చి సత్కరించారు. టాంటెక్స్‌ అధ్యక్షులు వీర్నపు చినసత్యం మాట్లాడుతూ యోగా టీచర్స్‌ ప్రశాంత్‌ దుల్లూర్‌, శివరాజు జయన్న సేవలను కొనియాడారు. టాంటెక్స్‌, తానా తరపున యోగా కార్యక్రమం చేయడానికి సహకరించినందుకు చాలా ఆనందంగా ఉందని, ఇటువంటి కార్య్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించినవారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంబ దొడ్డ, శ్రీకాంత్‌ పోలవరపు, మురళి వెన్నం, కళ్యాణం తాడవిమేటి తదితరులు పాల్గొన్నారు. ఎంతో కృషి, సమయం వెచ్చించిన టాంటెక్స్‌, తానా కార్యవర్గ సభ్యులకు వివిధ కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు