భారతీయులకు ఇక.. మెరుగైన వేతనాలు

31 May, 2019 12:08 IST|Sakshi

భారత్‌ – యూఏఈ మధ్య కొత్త ఒప్పందం

రిక్రూట్‌మెంట్‌ పోర్టళ్ల అనుసంధానం

నిపుణులైన కార్మికులకు వేతనాల పెంపు..

దుబాయ్‌ : భారత్‌ – యూఏఈ మధ్య కుదిరిన రెండు ఒప్పందాల వల్ల నిపుణులైన భారతీయ కార్మికుల వేతనాల పెరుగుదలతో పాటు మంచి ఉద్యోగాలు పొందే అవకాశాలున్నాయి. ఇటీవల జరిగిన ‘అబుదాబి డైలాగ్‌’ సమావేశాల సందర్భంగా ఇరు దేశాలకు చెందిన ఉన్నతస్థాయి దౌత్యాధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్‌ నుంచి దుబాయి, అబుదాబి, షార్జా వంటి యూఏఈలోని ఏడు రాజ్యాలకు కార్మికులు ఎక్కువగా ఉపాధి కోసం వెళ్తుంటారు. నైపుణ్యం కలిగిన కార్మికుల నియామకాలు ఇకపై ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. వివిధ రంగాల్లో నిపుణులైన కార్మికులకు ధ్రువీకరణ పత్రాలు జారీచేయాలని నిర్ణయించారు.  

ఇ–మైగ్రేట్‌ పోర్టల్‌  
కార్మికులను ఉద్యోగాలకు భర్తీచేయడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్న భారత ప్రభుత్వానికి చెందిన ఇ–మైగ్రేట్‌ పోర్టల్‌ను యూఏఈ ప్రభుత్వానికి చెందిన మినిస్ట్రీ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ అండ్‌ ఎమిరేటైజేషన్‌ పోర్టర్‌తో అనుసంధానం చేస్తారు. దీంతో యజమానులు, ఉద్యోగులు, రెండు దేశాల ప్రభుత్వాలు, రిక్రూటింగ్‌ ఏజెన్సీలు ఒకే వేదికపైకి వస్తారు. వేతన ఒప్పందాల రికార్డుల నిర్వహణ, కార్మికుల సంక్షేమం, భద్రత సులువవుతుంది. గత సంవత్సరం లక్షా 37వేల మంది కార్మికులు భారత్‌ నుంచి యూఏఈ కి ఇ–మైగ్రేట్‌ పోర్టల్‌ ద్వారా పంపబడ్డారు. 

వీసా మోసాలకు అడ్డుకట్ట..
దేశంలోని తెలంగాణ ప్రాంతం నుంచి అనేక మంది కార్మికులు దుబాయికి పనికోసం వెళ్తుంటారు. ఈ కొత్త విధానంతో దళారుల ప్రమేయం తగ్గి వీసా మోసాలకు ఆన్‌లైన్‌ నియామకాలతో అడ్డుకట్ట పడుతుంది. పని వీసా లేకుండా యూఏఈ వెళ్లేవారి సంఖ్య తగ్గుతుంది. చట్టబద్ధమైన వలసలకు, భద్రత కలిగిన వేతనాలకు అవకాశముంటుంది.

నైపుణ్యానికి గుర్తింపు..
నైపుణ్యం కలిగిన కార్మికులకు అధికారికంగా యూఏఈ అధికారులు ధ్రువీకరణ పత్రాలు జారీచేస్తారు. వీరికి ఎక్కువ జీతంతో పాటు ఉన్నతస్థాయి ఉద్యోగాలు పొందే అవకాశముంటుంది. ఇప్పటివరకు యూఏఈలోని ఏడు రాజ్యాల్లో లక్షలాది మంది తెలంగాణవాసులు పనిచేస్తుండగా చాలా మందికి నైపుణ్యం ఉన్నా గుర్తింపు లేక అరకొర వేతనాలతో కాలం వెళ్లదీస్తున్నారు. దౌత్యపరమైన ఒప్పందాలతో తెలంగాణ వలస కార్మికులకు మెరుగైన వేతనాలు లభించనున్నాయి. 

                                                                 -వూరడి మల్లికార్జున్, సిరిసిల్ల

>
మరిన్ని వార్తలు