భవిష్యత్‌పై బెంగతో దంపతుల ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

భవిష్యత్‌పై బెంగతో దంపతుల ఆత్మహత్య

Published Fri, May 31 2019 11:54 AM

Couple Commits Suicide With Financial Problems - Sakshi

పెందుర్తి: వృద్ధాప్యంలో చూసేందుకు పిల్లలు లేరు... ఆర్థిక స్థితి అంతంతమాత్రంగానే ఉంది... వీటన్నింటికీ తోడు ఎలా బతుకుతామనే బెంగతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సింహాచలం ఆర్టీసీ డీపో సమీపంలోని బాలాజీ గార్డెన్స్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన గురువారం సాయంత్రం వెలుగుచూసింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... కొత్తపల్లి కృష్ణప్రసాద్‌(54), రాధారాణి దంపతులు నాలుగేళ్ల క్రితం స్థానిక బాలాజీ గార్డెన్స్‌లోని ఓ ఇంట్లో అద్దెకు దిగారు. వీరికి సంతానం లేదు. కృష్ణప్రసాద్‌ తన తమ్ముడి వరసైన వైద్యుడి క్లినిక్‌లో పనిచేస్తున్నాడు. కొన్నాళ్లుగా ప్రసాద్‌ కంటి చూపు మందగించడంతో క్లినిక్‌కు సరిగా వెళ్లేవాడు కాదు. పరిస్థితి మరింత క్షీణించడంతో వారం రోజులుగా పూర్తిగా పని మానేశాడు.

అయితే పనికి రావాల్సిందిగా క్లినిక్‌ నుంచి ఫోన్లు చేస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఈ క్రమంలో గురువారం కూడా మరోసారి కృష్ణప్రసాద్‌ సోదరుడు ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉండడంతో అనుమానం వచ్చి క్లినిక్‌లో పనిచేస్తున్న సిబ్బందిని కృష్ణప్రసాద్‌ ఇంటికి పంపాడు. ఎంతకీ తలుపులు తెరవకపోవడంతో కిటికీలో నుంచి చూడగా కృష్ణప్రసాద్, రాధారాణి హాల్లో పడి ఉండడాన్ని గమనించి వెంటనే స్థానికులను పిలిచారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకున్న పెందుర్తి సీఐ ఈ.వెంకునాయుడు, సిబ్బంది తలుపులను తెరిచారు. భార్యభర్తలు ఇద్దరూ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్థారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అనారోగ్యంతోపాటు వయసు పెరుగుతున్న దృష్ట్యా భవిష్యత్‌పై ఆందోళనతోనే వీరు ఈ చర్యకు పాల్పడ్డారని సీఐ ప్రాథమిక విచారణ తరువాత వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement