నవ్యాంధ్రకు నవసూత్రాలు

3 Jun, 2014 03:37 IST|Sakshi
నవ్యాంధ్రకు నవసూత్రాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేడు కొత్త రూపంలో మన ముందు ఉంది. అన్నీ సవాళ్లూ, సమస్యలే. సమన్వయంతో, సమష్టి కృషితో ఈ సవాళ్లను అధిగమించవచ్చు.
 
 పవర్ పెంచాలి....ప్రగతి సాధించాలంటే పరిశ్రమలు అవసరం. ఉపాధికీ, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికీ అవసరమైన స్థాయిలో అవి ఏర్పాటుకావాలి. పరిశ్రమలకు ముఖ్యమైనది నిరంతర విద్యుత్ సరఫరా.  భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను పెంచాల్సి ఉంది. జలవనరులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ విద్యుత్ రంగంలో కొత్త ప్రాజెక్టులకు నాంది పలకాలి.
 అన్నపూర్ణ...సీమాంధ్ర ఆది నుంచీ వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నది.  సంప్రదాయ, వ్యాపార పంటలలో ముందడుగు వేస్తోంది. రాష్ట్రానికి సరిపడే పూర్తిస్థాయి ఆహార పంటలు అందించగలిగే శక్తి ఈ ప్రాంతానికి ఉంది. సుదీర్ఘ తీరప్రాంతం ఉన్నందున మత్స్య సంపద వృద్ధికి వీలుంది. దీనిని సైతం పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం ద్వారా మత్స్యసంపదను ఆదాయ, ఆర్ధిక వనరుగా రూపొందించాలి. మత్స్యపరిశ్రమ నుంచి విదేశీ మారకద్రవ్యం గణనీయంగా పెంచుకోవచ్చు.
 
 పరిశ్రమలకు త్రిముఖ విధానం... సీమాంధ్ర భౌగోళిక పరిస్థితులు, వనరుల లభ్యత ఆధారంగా పరిశ్రమలను అభివృద్ధి చేయాలి. దీనిలో  వ్యవసాయం, సముద్ర ఉత్పత్తులు, అటవీ సంపదలను పరిగణనలోకి తీసుకోవాలి. సమానస్థాయి అభివృద్ధి  కావాలంటే ముందుగా రైతు బలపడాలి. మార్కెటింగ్ వ్యవస్థ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు కావాలి. లేని పక్షంలో ఆశించిన ఫలితాలు సాధ్యపడవు. అన్ని  జిల్లాలలోనూ చేనేత, ఖాదీ, హస్తకళలు, కుటీర పరిశ్రమలు ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేయాలి. కోస్తా ప్రాంతం డెయిరీ రంగానికి అనుకూలం. గుజరాత్‌లోని అమూల్‌ను ఒక ప్రయోగంగా తీసుకుని పాడి పరిశ్రమను అభివృద్ధి చేయాలి. యువతకు ఉపాధి కల్పనే నేడు కొత్త ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు. హైదరాబాద్‌కు దీటుగా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయాలి. నిర్మాణరంగం, ఫార్మా పరిశ్రమలు, టెక్స్‌టైల్ రంగం ఎక్కువ మందికి ఉపాధిని అందించే అవకాశం ఉంది. ప్రకృతి అందాలకు నిలయాలుగా ఉన్న ప్రాంతాల సహజత్వాన్ని దెబ్బతీయకుండా వాటిని టూరిస్టు కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి.
 
 మెరుగైన విద్య...ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యా సంస్థల విషయంలో సీమాంధ్ర కొంత మెరుగ్గానే ఉంది. ప్రపంచ పటంలో గుర్తింపు సాధించాలంటే ప్రఖ్యాత విద్యా సంస్థలు  ఏర్పాటు కావాలి. ఇప్పటివరకు ఒక్క కేంద్రీయ వర్సిటీ కూడా  ఏర్పాటు కాలేదు. ఐఐటీ. ఐఐఎం, కేంద్రీయ విశ్వవిద్యాలయాలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడంతోపాటు, పాత విశ్వవిద్యాలయాలను పరిశోధనా కేంద్రాలుగా తీర్చిదిద్దాలి.
 
 రవాణా వ్యవస్థ...ప్రస్తుతం సీమాంధ్రను నవ్యాంధ్రగా పిలుస్తున్నారు. దీనికి అవసరమైన వ్యవస్థలలో రవాణా రంగం ఒకటి. పల్లెలు పట్టణాలుగా, పట్టణాలు నగరాలుగా, నగరాలు మెట్రో నగరాలుగా రూపాంతరం చెందే అవకాశం ఈ రాష్ట్రంలో ఉంది. అందుకు బహుళ ఉపయుక్త, రవాణా వ్యవస్థల అభివృద్ధికి బాటలు వేయాలి. ప్రతీ గ్రామాన్ని అనుసంధానిస్తూ, గిరిజన ప్రాంతాలను సైతం అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలతో కలిపే విధంగా మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేసుకోవాలి.  పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి, అవసరమైనమేర ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి. ఇప్పటికే రెవెన్యూ లోటు స్పష్టంగా కనిపిస్తున్నందున వనరుల దుబారా నియంత్రించడం ఎంతో ముఖ్యం.
 (వ్యాసకర్త ఆంధ్రా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్)
 -ఆచార్య కె.రామ్మోహనరావు

మరిన్ని వార్తలు