వలస గిరిజనులపై దాడి

10 Aug, 2015 01:16 IST|Sakshi

మన రాష్ట్ర సరిహద్దుల్లోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి ఆదివాసీలు ఎందరో ఖమ్మం, కరీంనగర్, వరంగల్  జిల్లాలకు వలసవచ్చారు. 35 సంవత్సరాల క్రితం మొదలైన ఈ వలసలు గత పదేళ్లుగా బాగా పెరిగాయి. జీవనోపాధికి వేటనే ఆధారం చేసుకున్న వారు తమ సంచార జీవనంలో భాగంగా ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి వలస వెళ్లి అడవిలో తమ ఇండ్లు నిర్మించుకొని జీవనం సాగిస్తున్నారు. అలాంటివారు 25 ఏళ్ల క్రితం కొందరు ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, దుమ్ముగూడెం, చింతూరు, చర్ల, పినపాక, జూలూరుపాడు మండలాల్లోని అడవుల్లో తమ నివాసమేర్పర్చుకొని జీవిస్తున్నారు. వీరికి ప్రభుత్వం ఓటు హక్కు, రేషన్ కార్డులు మంజూరు చేశారు. గత పదేళ్లుగా మావోయిస్టులు, సల్వాజుడుం  ప్రైవేటు సైన్యం ఛత్తీస్‌గఢ్  అటవీ ప్రాంతంలో జరుపుతున్న దాడులు, ప్రతిదాడులతో ఆ ప్రాంతంలో 600 గ్రామాల ప్రజలు పూర్తిగా నిరాశ్రయులై ఖమ్మం జిల్లాలోని అడవుల్లో నివాసమేర్పరచుకొని జీవనం సాగిస్తున్నారు.
 
 వారు తాము నివాసమున్న ప్రాంతంలో కొంత భూమిని సాగు చేసుకొని జీవిస్తున్నారు.  ఇట్టి భూమిని వదిలిపోవాలని అటవీ అధికారులు వారిని హెచ్చరిస్తూ వారి నివాసాలపై దాడి చేస్తూ వారి ఇళ్లను దగ్ధం చేస్తున్నారు. చర్ల మండలంలోని చెన్నాపురం, ఎర్రంపాడు, భద్రాచలం ప్రాంతాల్లోని వారి నివాసాలకు నిప్పుపెట్టిన అటవీ శాఖాధికారులు మానవత్వాన్ని మరచి ప్రవర్తిస్తున్నారు. వలస గిరిజనులపై దాడి చేస్తూ, అటవీ హక్కుల చట్టాన్ని అపహస్యం చేస్తున్న వారి పద్ధతి తక్షణమే మార్చుకోవాలని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదివాసీలను ఆదుకోవాలని ప్రభుత్వానికి మనవి.    
 - డాక్టర్ ఎ.సిద్దన్న (మాజీ సైనికుడు)
 కొల్లాపూర్, మహబూబ్‌నగర్ జిల్లా.

మరిన్ని వార్తలు