అందరికీ శిరోభారంగా అవినీతి ‘బాబు’

10 Jul, 2016 01:15 IST|Sakshi
అందరికీ శిరోభారంగా అవినీతి ‘బాబు’

రాష్ర్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చైనా పర్యటన వివరాలు తెలుపుతూ మీడియా సమావేశంలో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు బదులుగా (తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులను ఉద్దేశించి) ‘‘నాకు లేదా నోరు’’ అని డాంబికంగా సమాధానం చెప్పారు. ఈ మాట వినగానే, మర్నాడు పేపర్లలో చదవగానే రాష్ర్ట ప్రజలకు మాత్రం ‘‘అవును! చంద్రబాబుకు నోరు మూతపడింది’’ అనే భావన  స్ఫురించింది.  ‘‘ఓటుకు కోట్లు కేసు’’లో ప్రత్యక్షంగా దొరికిపోయిన ముఖ్యమంత్రి కొంత కాలం మేకపోతు గాంభీర్యం నటించినా తెలంగాణ సీఎం చేతిలో కీలుబొమ్మగా మారాల్సిన దుస్థితికి దిగజారారని ప్రజ లందరికీ తెలుసు. కేసీఆర్ పెట్టిన డిమాండ్లకు తలొగ్గిన చంద్రబాబు ఆగమేఘాలమీద హైదరాబాద్ నుంచి అమరావతికి విధిలేక మకాం మార్చేశారని అందరూ భావిస్తున్నారు.

మరోవైపు బాబు రెండేళ్ల పాలనలో అవినీతి, దోపిడీ విచ్చలవిడిగా, బాహాటంగా సాగిపోతుందని తనకు మిత్రపక్షమైన కొందరు బీజేపీ నేతలే ఢిల్లీకి బాబు అవినీతిపై కట్టలుకట్టలుగా నివేదికలు అందజేశారనే వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. తనది మచ్చలేని చరిత్ర అని బాబు ప్రతి వేదికపైనా సొంతడబ్బా కొట్టుకుంటున్నప్పటికీ ఇటీవల ‘‘నేషనల్ కౌన్సెల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్’’ (ఎన్.సి.ఎ.ఇ.ఆర్.) జరిపిన సర్వేలో అవినీతిలో ఏపీ రాష్ర్టం మొదటి స్థానంలో ఉందని చెప్పింది. బాబు ప్రభుత్వం చేసుకుం టున్న వ్యాపార ఒప్పందాల్లో అధిక శాతం అవినీతిమయమేనని ఈ సర్వే అభిప్రాయ పడింది. సోషల్ మీడియా ద్వారా ఈ విషయం ఇప్పటికే ప్రపంచంలోని తెలుగువారందరికీ చేరిపోయింది.
   
 బాబు అటు కేంద్ర ప్రభుత్వం ముందు ఇటు తెలంగాణ ప్రభుత్వం ముందు చేతులు ముడుచుకుని, నోరు మూసుకుని ఉండాల్సిన దుస్థితి తలె త్తిందని రాష్ర్టంలోని ప్రతి ఒక్కరికి అర్థ మవుతూనే ఉంది. బాబు నిస్సహాయత వ్యక్తిగతమైనదైతే ఎవరైనా జాలిపడి వదిలివేయవచ్చు లేదా నిస్సహాయత వలన కలిగే నష్టం ఆయనకే పరిమితమైతే కూడా టీడీపీ శ్రేణులు సహనంతో భరించు కోవచ్చు. కానీ బాబు నిస్సహాయత, అవినీతి బందిఖానాలో చిక్కుకున్న చేతకానితనం, ఫలితంగా నోరు మూత పడాల్సిన స్థితి కోట్లాది ప్రజల ప్రయోజనాలకు భంగకరమైన ప్పుడు కచ్చితంగా ఈ అంశాన్ని చర్చించాల్సిన అనివార్య పరిస్థితి తలెత్తుతోంది.
 
 రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అటు మోదీతో ఇటు కేసీఆర్‌తో పోరాడలేని దుస్థి తికి చేరిన బాబు నాయకత్వం గురించి టీడీపీ శాసనసభా పక్షం అంతర్గతంగా సమీక్షించు కోవడం మంచిదనిపిస్తుంది. టీడీపీ శ్రేణులకు ఈ మాట ఊహించడానికే కొంత ఇబ్బం   దిగా అనిపించినా విశాల రాష్ర్ట ప్రజల ప్రయోజనాల దృష్ట్యా సమర్థుడైన, నీతిమంతుడైన మరొక టీడీపీ నేతను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకుని సీఎం బాధ్యతలను అప్పగిస్తే  రాష్ట్రానికి, టీడీపీకి కూడా మంచి జరుగుతుందని నా సలహా.
 
 ప్రత్యక్షంగా, పరోక్షంగా బాబు కారణంగా  రాష్ర్ట ప్రజల హక్కులకు భంగం కలుగుతున్నప్పుడు, రాష్ర్ట ప్రయోజ నాలు దెబ్బతింటున్నప్పుడు ముఖ్యంగా ఆంధ్రుల ఆత్మగౌరవానికి భంగం ఏర్పడుతున్న  ప్పుడు టీడీపీ, బాబులాంటి నోరు మూతపడిన నాయకుడి నాయకత్వంలో ప్రభుత్వాన్ని నడపడం చారిత్రక తప్పిదమవుతుంది. ఎన్టీఆర్  పార్టీని స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఎంతో మంది సీనియర్ నేతలు ఆ పార్టీలో కొనసాగుతున్నారు. వీరిలో కొందరు సమర్థులు, నిజాయితీపరులు కూడా ఉన్నారు. అవినీతిలో బందీకాని నేతలు ఇప్పుడు రాష్ట్రానికి ఎంతో అవసరం. అలాంటి వారు మాత్రమే అటు కేంద్రంతోనూ, ఇటు పక్క రాష్ర్టంతోనూ రాజీ లేకుండా పోరాడి రాష్ర్ట ప్రయోజనాలను కాపాడగలరు. కనుక రాష్ర్ట ప్రయోజనాల కోసం టీడీపీ శాసనసభా పక్షం సమిష్టిగా తమ ముఖ్యమంత్రి మార్పు విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకుంటే  రాష్ట్రానికి ఎంతో మంచి జరుగుతుంది.
 
 రాష్ర్ట పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని స్పష్టంగా పేర్కొన్నారు.  దీన్ని కేంద్రం నుంచి సాధించాల్సిన ముఖ్యమంత్రి చైనా ప్రైవేట్ కంపెనీతో కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నామని చెబుతుంటే ఆయన సామర్థ్యం కేంద్రంవద్ద ఏవిధంగా ఉందో సులువుగానే అర్థం చేసుకోవచ్చు.

సుమారు రూ. 5 లక్షల కోట్ల విలువ చేసే ప్రయోజనాలు పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరచినప్పటికీ వీటిని కనీసంగా కూడా సాధించుకోలేని బాబు నాయకత్వంలోని టీడీపీ కేంద్ర ప్రభుత్వంలో కొనసాగడంవల్ల కానీ, రాష్ర్ట సీఎంగా చంద్రబాబు బాధ్యతలు నడపడంవల్లగానీ ప్రజలకు పెద్దగా ప్రయోజనం ఏమీ కలగదు. తమ స్వప్రయోజనాల కోసం, అవినీతిని యథేచ్ఛగా కొనసాగించుకునేందు కోసం ప్రజల ప్రయోజనాలను పట్టించుకోకుండా తాము పాలన సాగించుకుంటామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు.
 వ్యాసకర్త అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ  8297199999
 - ఎన్. రఘువీరారెడ్డి

మరిన్ని వార్తలు