రామాయణ రహస్యం తెలిసిన నది

14 Jul, 2015 00:37 IST|Sakshi
రామాయణ రహస్యం తెలిసిన నది

ఎన్నో నదీ తీరాలను చూసిన, అక్కడ వసించిన రాముడు మనసారా ‘గోదావరీ రమ్యా’ అని సంభాషించడం గోదావరి వరిష్ఠతకు నిదర్శనం. రాముడు మెచ్చిన నది గోదావరి. అది ఆంధ్రదేశంలో అధిక భాగం ఉండడం ఆంధ్రుల పుణ్యం.
 
సీత గంగాతీరంలో తన వనవాసాన్ని గడుపుతుంది. భర్త తోడు లేకుండా గడుపుతుంది. గోదావరి తీరంలో అలా కాదు. ఒక పుష్కరకాలం పైగా సీతారాములు అన్యోన్యంగా కలసిమెలసి ఉన్నారు. నాటి జనపదాల్లోని, నేటి తెలుగుదేశ భాగంలోని పెద్ద నదుల్లో గోదావరి గొప్పది. రామాయణంలో మొదటిసారిగా అరణ్యకాండలో గోదావరి దర్శనమిస్తుంది. సీతారామలక్ష్మణులు చిత్రకూటం నుంచి బయలుదేరి అగస్త్యాశ్రమానికి వస్తారు. నివాసానికి ఏదైనా ఉత్తమమైన ప్రదేశాన్ని సూచించమని అభ్యర్థిస్తారు. అప్పుడు అగస్త్యుడు ‘రామా! ఇక్కడకు సమీపంలో పంచవటి అనే రమ్యమైన ప్రదేశం ఉంది.
 
 ఆ పంచవటీ ప్రాంతం పక్కనే గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది..., అని చెప్తాడు. సీతారామలక్ష్మ ణులు పంచవటి చేరుకున్నారు. ఆ సందర్భంలో రాముడు ‘ఇయం గోదావరీ రమ్యా పుష్టితై స్తరుభిర్వృతా/ హంస కారండ వాకీర్ణ చక్రవాకోప శోభితా/ నాతి దూరే న బాసన్నే మృగ యూధ పీడితా’ అంటాడు. ఆ నదిని చూడగానే రాముని అనుభూతి ఇదే. అంటే- ‘ఇదే రమ్యమైన గోదావరీ నది. ఒడ్డునే విరగపూచిన చెట్లతో నిండి ఉంది. హంసలు, కారండవాలు, చక్రవాకాలు వంటి జలపక్షులతో శోభిస్తోంది. ఆ నది మనకు మరీ దూరంగానూ లేదు, దగ్గరగానూ లేదు. ఈ ప్రదేశంలో లేళ్లు మందలు మందలుగా నిర్భయంగా తిరుగుతున్నాయి.’
 
 సహసీత, సహానుజంగా రాముడు గోదావరిలో స్నానం చేశాడు. భక్తితో దేవత లకు, పితృదేవతలకు తర్పణాలు సమర్పించారు. ఉదయిస్తున్న సూర్యభగవానునికి నమస్కరించారు. సర్వదేవతలను స్తోత్రం చేశారు. ఆ సమయంలో సీతతో లక్ష్మణునితో కూడి ఉన్న శ్రీరాముడు గంగానదిలో స్నానం చేసి పార్వతితో నందితో ప్రకాశిస్తున్న శివునిలా ఉన్నాడంటాడు వాల్మీకి. ఈ శ్లోకం హరిహరాద్వైతాన్నే కాదు, గోదావరి గంగ వంటి పవిత్రమైన నది అనే విషయాన్ని కూడా ధ్వనింపచేస్తోంది.
 
 మాయలేడి సన్ని వేశంలో చివరిగా, ‘నేను నీకు దక్కుతాననుకుంటున్నావేమో, రాముడు లేకపోతే గోదావరిలో దూకేస్తాను’ అంటుంది సీతాసాధ్వి. ఈ విధంగా మానరక్షణకు గోదావరిని సమాశ్రయిస్తానంటుంది సీత. అంతేకాదు, రావణాసురుడు అపహరించుకుపోతూ ఉంటే, సీత గోదావరికి వందనాలర్పిస్తూ తన విషయం, రావణుని సంగతీ రామునికి చెప్పమని అర్థిస్తుంది. సీతాన్వేషణ సందర్భంలో రాముడు, సీతకు గోదావరి చాలా ప్రియమైనది. ఆ నదికి గాని వెళ్లిందా? అయినా నేను లేకుండా ఒంటరిగా వెళ్లదే అను కుంటాడు. ‘గోదావరీయం సరితాం వరిష్ఠాప్రియా యా మమ నిత్యకాలం/ అష్య త్రగచ్ఛేదితి చింతయామి నైకాకినీ యాతిహిసాకదాచితం’ అంటూ గోదావరి నదులలో శ్రేష్టమైనదని శ్రీరాముడే స్వయంగా చెప్పిన సందర్భమిది. ‘సీత ఏది?’ అని రాముడు గోదావరిని ప్రశ్నిస్తాడు.
 
 మళ్లీ గోదావరి ప్రసక్తి వాల్మీకి రామాయణంలో రావణ వధానంతరం శ్రీరాముడు విజయలక్ష్మీయుతుడై సీతాలక్ష్మణ సహితుడై పుష్పక విమానంలో అయోధ్యానగరికి వెళ్లే సందర్భంలో వస్తుంది. సీతాన్వేషణ సమయంలో తాను చూసిన ప్రదేశాలన్నింటినీ సీతకు చూపిస్తూ దండకారణ్య సమీపంలో గోదావరిని కూడా చూపిస్తూ, గోదావరి రమ్యమై ప్రసన్న సలిలయై ఉంది చూడు మైథిలీ అంటాడు. వాల్మీకి రామాయణాన్ని బట్టి రాముడు గోదావరిని చూడడం ఇది కడసారి. పంచవటిలో చూసినపుడు, ‘ఇయం గోదావరీ రమ్యా’ అని, చివరిసారి, ‘ఏషా గోదావరీ రమ్యా!’ అంటాడు. ఎన్నో నదీ తీరాలను చూసిన, అక్కడ వసించిన రాముడు మనసారా ‘గోదావరీ రమ్యా’ అని సంభాషించడం గోదావరి వరిష్ఠతకు నిదర్శనం. రాముడు మెచ్చిన నది గోదావరి. అది ఆంధ్రదేశంలో అధిక భాగం ఉండడం ఆంధ్రుల పుణ్యం.
 
రామాయణాన్ని వాడుక భాషలోకి వచన కావ్యంగా తెనిగించిన శ్రీ శ్రీపాద సుబ్ర హ్మణ్యశాస్త్రి అరణ్యకాండ పీఠికలో వ్రాసిన వాక్యాలు ఈ సందర్భంలో స్మరింపతగినవే. ‘మన గోదావరీ మధురజలాలు సీతారామలక్ష్మణ స్నానపుణ్యాలు. రాముడనేక నదులు చూశాడు. స్వయంగా ఒక నది వొడ్డునే పుట్టి పెరిగి వ్యవహరించాడు కూడా! కానీ మన గోదావరి వంటిది మాత్రం మరొకటి కనబడలేదతనికి’. భవభూతి తన ఉత్తర రామచరిత్ర నాటకంలో రామకథా ఘట్టాన్ని గోదావరీ తీరంలో నడిపించాడు. నన్నయ్యభట్టు భారత మూలంలో లేకపోయినా అర్జునుని తీర్థయాత్రా సందర్భంలో ‘దక్షిణ గంగనా తద్దయునొప్పు’ గోదావరిని ప్రవేశపెట్టాడు.
 (వ్యాసకర్త విశ్రాంత ఆచార్యులు ఫోన్: 0891-2530289
 - డా॥కోలవెన్ను మలయవాసిని

మరిన్ని వార్తలు