ఓట్ల వేటలో ‘ఆహ్వానాల’ ఆట

16 Dec, 2015 00:32 IST|Sakshi
ఓట్ల వేటలో ‘ఆహ్వానాల’ ఆట

డేట్‌లైన్ హైదరాబాద్

 ఇటు కేసీఆర్, చంద్రబాబును చండీయాగానికి ఆహ్వానిస్తూనే, అటు తన కుమారుడితో తెలంగాణలో టీడీపీని ఖాళీ చేసే యాగాన్ని జరిపించేస్తున్నారు. ఆయన కుమారుడు టీడీపీ సీనియర్ నేత విజయరామారావు ఇంటికి వెళ్లి మరీ టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఇదేమీ ఆశ్చర్యకరమైన సంగతి కాదు. విజయవాడలో ముఖ్యమంత్రులు ఇద్దరూ సరదా కబుర్లు చెప్పుకుంటుంటే, ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీడీపీ నేతలు టీఆర్‌ఎస్‌ను తిట్టిపోస్తుంటారు. కేటీఆర్ తదితరులు టీడీపీ లీడర్లకు గులాబీ కండువాలు కప్పుతుంటారు.

 

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎర్రబెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్న అయుత చండీయాగానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆహ్వానించడానికి సోమవారం నాడు ప్రత్యేక హెలికాప్టర్‌లో విజయవాడ వెళ్లారు. ఆ ఆహ్వానాన్ని ఆయన ఆనందంగా స్వీకరించారు. పత్రికలు, వార్తా చానళ్లు కనువిందు చేసే ఈ అపురూప కలయికను కళ్లకు కట్టినట్టు చూపాయి. నిజమే, కొన్ని నెలల క్రితం ఈ ఇద్దరే సభ్యతను సైతం మరచి ఒకరినొకరు బండబూతులు తిట్టుకున్నారు. అందుకే మొన్నటి కలయిక అపురూపంగానే కనిపిస్తుంది. ముఖ్యమంత్రులు ఇరువురూ చాలా విషయాలు మాట్లాడుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నివాస స్థలం చుట్టూ ఉన్న ఆహ్లాదకర వాతావరణం దగ్గరి నుంచి ఏపీ ఆర్థిక పరిస్థితి దాకా చర్చకు వచ్చాయి. ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రుల మధ్య ఈ సఖ్యత చిరకాలం వర్ధిల్లాలని, అక్కడా, ఇక్కడా ప్రజలందరి ఆకాంక్ష. దానివల్ల ప్రజలకు మేలు జరగాలన్నది కూడా అందరి కోరిక.

గులాబీ కండువాల యాగం

అయితే ఇదేదో దీర్ఘకాలం కొనసాగే స్నేహమని ఎవరూ విశ్వసించడం లేదు. వచ్చే నెల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న గ్రేటర్ హైదరాబాద్‌లో ఆంధ్ర ప్రాంత ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారిని ఆకట్టుకుని, టీఆర్‌ఎస్‌ను గెలిపించుకోడానికే చంద్రశేఖర్‌రావు ఈ విజయవాడ ప్రయాణం పెట్టుకున్నారని అందరూ నమ్ముతున్నారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని భారీ ఎత్త్తున నిర్వహిస్తూ చంద్రబాబు ఈయనను ఆహ్వానించారు. కాబట్టి ఈయన అదేస్థాయిలో అయుత చండీయాగం తలపెట్టి ఆయనను పిలిచారని కూడా అనుకుంటున్నారు. చంద్రశేఖరరావు ఒక పక్క చంద్రబాబు నాయుడును చండీయాగానికి ఆహ్వానిస్తూనే, మరోపక్క తన కుమారుడితో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఖాళీ చేసే యాగాన్ని జరిపించేస్తున్నారు. ఆయన కుమారుడు, రాష్ర్ట మంత్రి కేటీ రామారావు టీడీపీ సీనియర్ నేత విజయరామారావు ఇంటికి వెళ్లి మరీ టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో గెలుపు కోసం ఎడాపెడా టీడీపీ వారిని టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్న నేపథ్యంలో ఇది ఆశ్చర్యకరం కాదు. ఒక పక్క విజయవాడలో కృష్ణ ఒడ్డున ముఖ్యమంత్రులు ఇద్దరూ సరదా కబుర్లు చెప్పుకుంటుంటే.. ఇక్కడ హైదరాబాద్‌లో ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీడీపీ నేతలు టీఆర్‌ఎస్‌ను తిట్టిపోస్తుంటారు, కేటీఆర్ వగైరా నాయకులు టీడీపీ లీడర్లకు గులాబీ కండువాలు కప్పుతుంటారు. ఇదీ నిఖార్సయిన రాజకీయం అంటే.

గులాబీ గూట్లో విజయరామారావు

 ఇక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కే విజయరామారావు పార్టీ మార్పిడి విషయానికి వద్దాం. పోలీసు శాఖలో మంచి పేరున్న ఆయన ప్రతిష్టాత్మకమైన సీబీఐ డెరైక్టర్‌గా పనిచేసి రిటైరయ్యారు. 1999 ఎన్నికలకు కొద్ది మాసాల ముందు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో వివిధ స్థాయిల ప్రభుత్వ అధికారుల శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా పౌరహక్కులు, తీవ్రవాద ఉద్యమం గురించి మాట్లాడటానికి విజయరామారావుతో బాటు నన్ను కూడా పిలిచారు. ఆ సందర్భంగా నేను ఆయన అనుభవాలను గ్రంథస్తం చేయమని కోరాను. ఆ ఆలోచన ఉంది, తప్పకుండా చేద్దామన్నారు. టీడీపీలోకి చంద్రబాబు తటస్తులను ఆహ్వానిస్తున్నారని, వారిలో విజయరామారావు కూడా ఉన్నారని తదుపరి రెండో రోజున పత్రికల్లో వార్త వచ్చింది. వెంటనే వారికి ఫోన్ చేయగా ఆయన ధ్రువీకరించారు. పోలీసు అధికారిగా మంచి పేరున్న మీరు రాజకీయాల్లో చేరడం ఎందుకని నేను అన్నాను. లేదు, ఇంకా పని చేసే శక్తి ఉంది కదా, రాజకీయాలు మంచి వేదికని ఈ నిర్ణయం తీసుకున్నాను అన్నారాయన. ఆ తరువాత ఒకటి రెండు, రోజుల్లో ఆయన టీడీపీలో చేరడం, 1999 ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి  పోటీ చేసి గెలవడం, రాష్ర్ట మంత్రి కావడం చకచకా జరిగిపోయాయి.

 ఆ తరవాత చాలా కాలం నేను వారిని కలవలేదు. కానీ విషయాలు తెలుస్తూ ఉండేవి. ఇవాళ నడుస్తున్న రాజకీయాలకు విజయరామారావు వంటి వారు పనికి రారన్నది నా అభిప్రాయం. పైగా రాజకీయాల్లో రాటుదేలిన చంద్రబాబుతో స్నేహం ఎంతో కాలం కొనసాగడం కష్టమే. అదే జరిగింది. 2004 ఎన్నికలలో ఆయన మళ్లీ గెలవలేదు. ఆ తరువాత టీడీపీలో, దాని అధినేత వద్ద విజయరామారావుకు ఎంత ప్రాధాన్యత లభించిందీ అందరికీ తెలుసు. రాజకీయాల్లో ఇట్లాగే జరుగుతుందని విజ్ఞ్ఞులయిన ఆయనకు ముందే తట్టక పోవడం విచారకరం. ఆయన ఆపై మళ్లీ అటువంటిదే ఇంకో నిర్ణయం తీసుకుని ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో చేరారు. విజయరామారావు టీఆర్‌ఎస్‌లో చేరడం గురించి మాట్లాడుకునే ముందు ఆయన గురించి మరొక్క విషయం చెప్పుకోవాలి.

ఆయన మంత్రి కాకపోతే టీఆర్‌ఎస్ లేదుగా!

 తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తుది నిర్ణయం తీసుకుని, పార్లమెంట్ ముందు రాష్ర్ట విభజన బిల్లు పెట్టబోతున్న రోజుల్లో, ఒక సందర్భంగా ఆయనను కలిశాను. అక్కడ ఓ పది మందిమి ఒకే టేబుల్ దగ్గర కూర్చున్నాం. తెలంగాణ రాష్ర్టం ఎవరి వల్ల వచ్చిందని అక్కడున్న వాళ్లను నేను అడిగాను.   అందరూ ముక్తకంఠంతో కేసీఆర్ వల్ల, టీఆర్‌ఎస్ వల్ల అన్నారు. నేను విజయరామారావును చూపించి వీరి వల్ల మాత్రమే తెలంగాణ వచ్చిందన్నాను. ఆయన కొంత ఇబ్బందిగా ఫీలయ్యారు. మిగతా వాళ్లు అదెలాగన్నారు. 1999లో తిరిగి గెలిచాక చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలోకి ఆయనను తీసుకున్నారు... అదే సామాజిక వర్గానికి, అదే ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్‌రావును పక్కన పెట్టేశారు. ఆనాడు మిత్రులందరూ పలికిన హితవును మన్నించి చంద్రబాబు, విజయ రామారావుకు బదులు చంద్రశేఖర్‌రావును కేబినెట్‌లోకి తీసుకుని ఉంటే టీఆర్‌ఎస్ లేదు కదా! అందుకే తెలంగాణ మలి దశ ఉద్యమం రావడానికి పరోక్షంగానే అయినా విజయరామారావే కారణమన్నాను. ఉద్యమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకుపోయి రాష్ర్టం సాధించుకున్న తెలంగాణ ఉద్యమకారులు, సంస్థలను కించపరిచేందుకు అంటున్న మాటలు కావివి. అప్పుడున్న వాస్తవ పరిస్థితి అది. చంద్రశేఖర్‌రావు కాకపోతే మరొకరు ఉద్యమించే వారు, తెలంగాణ స్వప్నం సాకారం అయ్యేది.

నాడు చంద్రబాబు మంత్రి వర్గ ఏర్పాటు కసరత్తు చేస్త్తున్న సమయంలో, ఒక రోజు రాత్రి ఆయనకు సన్నిహితంగా ఉండే ఒక టీడీపీ నాయకుడు నాకు ఫోన్ చేసి చంద్రశేఖర్‌రావును మంత్రివర్గం బయట ఉంచడం మంచిది కాదు, ఈ విషయం చంద్రబాబుకు చెప్పగలరా? అని నన్ను అడిగారు. ఇప్పుడాయన తెలంగాణ ప్రభుత్వంలో కీలక మంత్రి పదవిలో ఉన్నారు. వృత్తి, ట్రేడ్ యూనియన్ అవసరాల దృష్ట్యా నాకు ముఖ్యమంత్రిని తరచూ కలిసే అవకాశం ఉండేది. సున్నితంగానే ఆ మిత్రుడి అభ్యర్థనను నిరాకరించాను. ఎవరి కారణంగానయితే చంద్రశేఖర్‌రావు ఆ నాడు మంత్రివర్గంలో చేరలేక పోయారో అదే విజయరామారావును ఆయన ఇవాళ ముఖ్యమంత్రిగా తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. రాజకీయాలు ఇట్లాగే ఉంటాయి మరి.

 వారెందుకు పిలిచారు? ఈయన ఎందుకు వెళ్లారు?

 టీఆర్‌ఎస్, విజయరామారావును పార్టీలోకి ఆహ్వానించడానికి కారణం... రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో ప్రతిపక్షాలను పూర్తిగా నిర్వీర్యం చేసి విజయం సాధించాలని. మరి విజయరామారావు ఎందుకు టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌కు వలస పోతున్నట్టు? రాజకీయ వ్యూహాలు, ఎత్త్తుగడల విషయానికి వస్తే చంద్రశేఖర్‌రావు, చంద్రబాబు కంటే తక్కువేమీ కాదు. ఆ మాటకొస్తే కొంచెం ఎక్కువే. తెలుగుదేశంలో కరువయిన గౌరవాన్ని టీఆర్‌ఎస్‌లో వెతుక్కోడానికే ఆయన బహుశా పార్టీ మారుతున్నారేమో.

 విజయరామారావుగారి సన్నిహితులు చెబుతున్న ప్రకారం టీఆర్‌ఎస్‌లో ఆయన కోసం ఒక గ్రాండ్ ప్లాన్‌ను సిద్ధం చేశారు. అదేమిటో త్వరలోనే తెలుస్తుంది. కానీ బయట ప్రచారంలో ఉన్నట్టు కుమార్తె రాజకీయ అరంగేట్రం కోసం ఆయన పార్టీ మారాలనే నిర్ణయం తీసుకుని ఉంటే మాత్రం తప్పులో కాలేసినట్టే. అంతకంటే ఆయన సుదీర్ఘ వృత్తి జీవితం, స్వల్ప రాజకీయ పయనం అనుభవాలను గ్రంథస్తం చేస్తే భావితరాలకు కొంత మేలు చేసిన వారవుతారు.

http://img.sakshi.net/images/cms/2015-10/61444765286_Unknown.jpg

వ్యాసకర్త, దేవులపల్లి అమర్
datelinehyderabad@gmail.com

 

మరిన్ని వార్తలు