కడిగిన ముత్యం - అమ్మ

16 May, 2015 08:19 IST|Sakshi
కడిగిన ముత్యం - అమ్మ

 (అక్షర తూణీరం)

 ‘‘ఈ వేడుకలో జయలలిత, శశికళ ధరించిన నగల్ని చూశాక మన దేశ విదేశ రుణాల గురించి మనం వర్రీ కానక్కర్లేదనిపిస్తోంది. వాళ్లు వజ్రాలు పొదిగిన బంగారు మెట్టెలు కాలి వేళ్లకు ధరించారు. మరీ తప్పనిసరైతే
 వారి ఒంటి మీద నగలు వలిస్తే భారతమాత రుణ విముక్త కాగలదనిపిస్తోంది. జయహింద్’’


 ‘‘నా దేశం భగవద్గీత’’ అం టూ ఆరంభించి, మధ్యలో ఏదో అని ‘‘ నా దేశం అగ్నిపు నీత, సీత’’ అని ముక్తాయిం చారు మహాకవి ఆచార్య సినారె. నాల్రోజుల్నించి ఆ మాటలే నా చెవుల్లో రింగు మంటున్నాయి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి నిత్య పురుచ్చితలైవి అమ్మశ్రీ జయలలిత కడిగిన ముత్యమని ఉన్నత న్యాయస్థానం సుత్తి బజాయించి మరీ చెప్పింది. ఈ కలియుగంలో ధర్మం నాలుగు పాదాల నడుస్తోందని నమ్మకం ఏర్పడింది. జెయిళ్ల సీజన్ పోయి, బెయిళ్ల సీజ న్ వచ్చినట్టుంది. ఎందరో మహాదోషులుగా పరిగణింప బడినవారు నిష్కళంకులుగా జనజీవన స్రవంతిలోకి వచ్చారు. జయలలితది బెయిల్ కూడా కాదు, శుభ్ర పత్రం! నరేంద్ర మోదీ పాలన మొత్తం సజావుగా నడు స్తున్నట్టుంది. నీతినిజాయితీలకు, ధర్మరక్షణకు మోదీ పెద్దపీటలు వేస్తున్నారు. ఆ పీటలకు మంచి గంధపు కోళ్లు, వెండిపూల తాపడాలు కనిపిస్తున్నాయి.


 న్యాయశాస్త్రంలో ‘వైకేరియస్ లయబిలిటీ’ అని ఒక పదకట్టుంది. తుపాకీ పేలితే తప్పు తుపాకీది కాదు, దాన్ని పేల్చిన చేయి తాలూకు యజమానిది. మన ముద్దుకుక్క ఎవరినైనా కరిస్తే మనం కరిచినట్టే లెక్క. ‘వైకేరియస్ ఎస్సెట్’ కి కట్టుబడి ఈ మంచిముత్యం మెరుపు యావత్తూ మోదీకే దక్కాల్సివుంది. ఆయన మొహమాటపడ్డా సరే, ఈ కీర్తి కిరీటాన్ని ఆయనే ధరిం చాలి. ఆయనే భరించాలి. సత్యధర్మాలు విజయఢంకాలు మోగించిన శుభవేళ ఎన్నెన్నో మధురస్మృతులు కళ్ల ముం దు సుళ్లు తిరుగుతున్నాయి.

 నాటి మద్రాసులో ఇరవై ఏళ్ల క్రితం పురుచ్చితలైవి ఇంట వివాహ వేడుక. ఆ పెళ్లికి అమ్మ ఎన్నో కోట్లు చేతికి ఎముక లేకుండా ఖర్చు చేసిందని అయిదారు భాషల్లో చెప్పుకున్నారు. అపోజిషన్ వారు అప్రతిష్టపాలు చేద్దా మని, పెళ్లి హంగామాని కథలు కథలుగా ప్రసారం చేసే వారు. కథ అడ్డం తిరిగి, జనం హాయిగా చూసి ఆనం దించారుగాని అపార్థం చేసుకోలేదు. ఆ పందిళ్లు, అలం కారాలు, ఆ వంటలూ వార్పులూ, ఆ భోగాలు భాగ్యాలు వర్ణించి చెప్పడం తరమే బ్రహ్మకునైన?! కొన్నివేల మం దికి శుభలేఖలలో లక్ష రూపాయల వరుమానం ముట్టిం ది. దాంతో కంజీరాలు, మంజీరాలు కొని, ధరించి, ఘనంగా పెళ్లికి తరలిరావచ్చు.

మరో కొన్నివేల మందికి బంగారు కుంకుమ భరిణలు. కొందరికి వెండివి. నగర మంతా దీపవృక్షాలు మొలిచాయి. కొద్దిరోజులు మద్రా సు పన్నీర్ కళాపితో ఘుమఘుమలాడింది. ఇక పెళ్లి భోజనం జిహ్వలదిరేలా లక్ష మందికి వండి వడ్డించారు. ‘‘నాటి శ్రీనివాస పెరిమాళ్ కల్యాణం మాదిరి’’ అన్నా డొక పెద్దాయన. ఆ పెళ్లికి కొండ మీద ఒక జలపాతం నీరంతా సాంబారుకి, మరోదాని నీరు వడపప్పు నానే యడానికి, మూడోదాన్ని బియ్యం కడగడానికి సర్ది వాడు కున్నారని భక్తి తన్మయత్వంలో చెప్పాడాయన. మావూరి మేష్టారు ‘‘ఏవోయ్! అమ్మాయి ఇంట్లో పెళ్లికి కేరళ నుం చి మూడులారీల జీడిపప్పు వచ్చిందటగా’’ అని అడిగా రు. ఆయనకి జీడిపప్పు అబ్సెషన్ ఉంది. అది వేరే కథ.

ఆ పెళ్లి సందడిలో చో రామస్వామి (తుగ్లక్ ఫేం) మాట నాకు భలే గుర్తు. ఈ పెళ్లి వైభవం మీకెలా అనిపి స్తోందని మీడియా అడిగితే ఆయన విలాసంగా నవ్వి, కొండంత ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. ‘‘ఈ వేడుకలో జయలలిత, శశికళ ధరించిన నగల్ని చూశాక మన దేశ విదేశ రుణాల గురించి మనం వర్రీ కానక్కర్లేదనిపిస్తోం ది. వాళ్లు వజ్రాలు పొదిగిన బంగారు మెట్టెలు కాలి వేళ్లకు ధరించారు. మరీ తప్పనిసరైతే వారి ఒంటి మీద నగలు వలిస్తే భారతమాత రుణ విముక్త కాగలదనిపి స్తోంది. జయహింద్’’ అంటూ ముగించారు.

 

 (వ్యాసకర్త శ్రీరమణ..  ప్రముఖ కథకుడు)
 
 
 

మరిన్ని వార్తలు