ధాన్యం కొను‘గోల్‌మాల్’ | Sakshi
Sakshi News home page

ధాన్యం కొను‘గోల్‌మాల్’

Published Sat, May 16 2015 12:37 AM

ధాన్యం కొను‘గోల్‌మాల్’ - Sakshi

- 5496.50 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్టు రికార్డుల సృష్టి
- పక్కా సమాచారంతో దాడిచేసి  పట్టుకున్న జేసీ సత్యనారాయణ
- డీసీసీబీ చైర్మన్ అధ్యక్షుడిగా ఉన్న సొసైటీలోనే ఈ అక్రమాలతంతు

కష్టకాలంలో రైతులను ఆదుకోవాల్సిన సహకార సొసైటీలే అక్రమాలకు తెరలేపాయి. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చెయ్యకుండానే కొన్నట్లు రూ. 77 లక్షల విలువ గల ధాన్యం కొనుగోలు చేసినట్టు కాగితాల మీద కాకి లెక్కలు సృష్టించారు. మిల్లర్లు,సొసైటీ నిర్వాహకులు కలిసి సాగించిన ఈ దందాను పసిగట్టిన జాయింట్ కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా దాడి చేసి బట్టబయలు చేశారు. ఈ కుంభకోణం జరిగిన రెండు సొసైటీల్లో ఒకదానికి సాక్షాత్తు డీసీసీబీ చైర్మన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండడం గమనార్హం.                                
కోదాడటౌన్ : రైతులకు మద్దతు ధర కల్పించడానికి  ఈ సంవత్సరం ఐకేపీ కేంద్రాలతో పాటు సహకార సోసైటీలకు ధాన్యం కొనుగోలుకు పౌరసరఫరాలశాఖ అనుమతి ఇచ్చింది. కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు, గుడిబండ(కోదాడ సొసైటీ సబ్‌సెంటర్) సొసైటీలు కూడ ధాన్యం కొనుగోలు చెయ్యడానికి ముందుకువచ్చాయి. ఈ విధంగా ధాన్యం కొన్నందుకు ప్రతి క్వింటాకు ప్రభుత్వం రూ.32 కమీషన్ రూపంలో సొసైటీకి చెల్లిస్తుంది. ఇది చాలదనుకున్నారో ఏమోగానీ ఎకంగా లక్షల రూపాయల కుంభకోణానికి తెరలేపారు. ఈ రెండు సొసైటీలో గింజ ధాన్యం కూడా రైతుల నుంచి కొనుగోలు చెయ్యలేదు. కానీ రైతుల నుంచి 5496.50 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు దొంగ రికార్డులు సృష్టించారు. కొనుగోలు చేసిన ఈ ధాన్యం కోదాడలోని శ్రీరంగాపురం సమీపంలో ఉన్న గౌరీశంకర్ రైస్ మిల్లును లీజుకు తీసుకుని నడుపుతున్న కాంట్రాక్టర్ జేవీ రామరావుకు సరఫరా చేసినట్లు దొంగ ట్రక్‌సీట్లు సృష్టించారు. అంటే రైతుల నుంచి గింజ ధాన్యం కొనకుండానే 5496.50 కింటాళ్ల(13,730 బస్తాలు) కొన్నట్లు, కోదాడకు రవాణా చేసినట్లు కాగితాల మీద కాకి లెక్కలు సృష్టించి డబ్బులను ఖాతాలో వేసుకోవడానికి బిల్లులను పౌరసరఫరాలశాఖకు సమర్పించారు.

రహస్య ఫిర్యాదుతో కదిలిన డొంక...
కాపుగల్లు, గుడిబండ సొసైటీలో జరుగుతున్న అక్రమ తంతును కొందరు అదే శాఖకు చెందిన ఉద్యోగులు జాయింట్ కలెక్టర్‌కు సమాచారం అందించడంతో ఆయన జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి నాగేశ్వరరావు కలిసి కోదాడలోని గౌరిశంకర్ రైస్ మిల్లుపై శుక్రవారం ఆకస్మికదాడి చేశారు. మిల్లులో ఈ రెండు సోసైటీల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం లేకపోవడంతో పాటు ట్రక్‌సీట్లు దొంగవని ఆయన గుర్తించారు. దీనిపై మిల్లు మేనేజర్ సరైన సమాధానం ఇవ్వక పొవడంతో జేసీ మండిపడ్డారు. ఈ సొసైటీలే కాకుండా ఇతర ఐకేపీ, సొసైటీల నుంచి సదరు మిల్లుకు 21 వేల క్విటాళ్ల ధాన్యం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో సరఫరా చేశామని, కొనుగోలు చెయ్యని 5496 క్వింటాళ్లు పోను మిగిలిన 16 వేల క్వింటాళ్లను స్వాధీనం చేసుకుని ఇతర మిల్లులకు సరఫరా చేస్తామన్నారు. మిల్లును సీజ్ చేసి మిల్లు లీజుదారుడిపై 6(ఏ) కేసు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. సొసైటీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: జేసీ
రైతులకు మద్దతు ధర కల్పించేందుకు సొసైటీలకు ధాన్యం కొనుగోలు చెయ్యమంటే కొనకుండానే దొంగట్రక్‌సీట్లు సృష్టించి మోసానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. సబ్ సెంటర్ల వల్ల  ఇబ్బందుల వస్తున్నందున వాటిని వెంటనే మూసివేయ్యాలని ఆదేశించామన్నారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నామని ఎక్కడ అక్రమాలు జరిగినా చర్యలు తప్పవని జేసీ హెచ్చరించారు.

Advertisement
Advertisement