మలిన భారత విముక్తి పతాక

4 Aug, 2016 00:09 IST|Sakshi
మలిన భారత విముక్తి పతాక

కొత్త కోణం

భారతదేశ చరిత్ర అంతా అగ్రవర్ణాల చరిత్రేనంటే కొందరికి బాధ కలగొ చ్చుగానీ, అది సత్యం. అలాగే చరిత్రను ఎన్నడూ సమగ్రంగా లిఖించలే దన్నదీ ఒప్పుకోక తప్పని వాస్తవం. దళితుల చరిత్రను, అంటరాని చరిత్రను, పాకీ చరిత్రను, పాచి చరిత్రను ఎవ్వరూ తాకనైనా లేదు. అందుకే దళితు లెప్పుడూ తమ చరిత్రను తామే పునర్లిఖిస్తూ వచ్చారు. చింకి పాతల్లోంచి, మరుగున దాగిన మురుగులోంచి, దేహంనిండా పులుముకున్న మలినా ల్లోంచి, వెలివాడల మూలల్లోంచి, దగాపడ్డ బతుకుల్లోంచి, చెరచబడ్డ మానా ల్లోంచి, మానవ హననాల రక్తసిక్త జీవితాల్లోంచి తమ చరిత్రను తామే రాసు కున్నారు. లిఖిత రూపం దాల్చని ఆ గత చరిత్రను ఇకపై ఏ దళిత జీవితం లోనూ వినరాకుండా చెరిపేయాలనుకుంటున్నారు. వేల ఏళ్లుగా సమాజానికి వెలకట్టలేని సేవలు అందించిన దళితుల మలిన జీవితాల్లోని ఆ అధ్యాయా లను సమూలంగా మార్చేయాలనుకుంటున్నారు. మానవ మలమూత్రాలను చేతులతో ఎత్తివేసే (మాన్యువల్ స్కావెంజింగ్) అమానవీయమైన, నీచాతి నీచమైన, దుర్మార్గ వ్యవస్థను తుడిచిపెట్టేయడం కోసం మూడు దశాబ్దాలకు పైగా ‘సఫాయీ కర్మచారీ ఆందోళన్’లో నిర్విరామ కృషి చేసిన  బెజవాడ విల్సన్... పాకీ పని చేసే తల్లిదండ్రుల కడుపు పంట.  

దళితుల తొలి మెగసెసె
‘‘మాన్యువల్ స్కావెంజింగ్ స్వచ్ఛందంగా ఎన్నుకున్న వృత్తి కాదు. కులం వలన కొందరు బలవంతంగా ఈ వృత్తిలోకి విసిరివేయబడుతున్నారు. ఇది గౌరవప్రదమైన వృత్తికాదు. అనారోగ్యకరమైనది, అపరిశుభ్రమైనది. ఫలానా కులంలో పుట్టడం వల్ల ఈ వృత్తినే ఎన్నుకోవాలనే దుర్మార్గ వివక్ష నుంచి ఇది  ఉనికిలోనికి వచ్చింది’’ అంటూ ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ నెవి పిళ్లై ప్రకటించారు. మానవ మల మూత్రాలను చేతితో ఎత్తి, తట్టలో వేసి నెత్తిమీద పెట్టుకొని ఊరిబయట పారవేసేవారి బాధలను జాతీయస్థాయి నుంచి అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్ళిన దళిత నేతలలో బెజవాడ విల్సన్ ప్రథముడు. ఈ సమస్య పరిష్కారానికి ఐరాస ప్రయత్నించడానికి ప్రేరణగా నిలిచిన వారిలో ఆయన ముఖ్యులు. మాన్యువల్ స్కావెంజింగ్ నిర్మూలనకు విల్సన్ చేస్తున్న కృషికి మన దేశంలో కంటే ప్రపంచ మానవ హక్కుల ఉద్యమాల నుంచి బలమైన మద్దతు లభిస్తున్నది. అందులో భాగంగానే ఆయన 2009లో ‘‘అశోక ఫెలో’’గా ఎన్నిక కావడాన్ని, నేడు ప్రతిష్టాత్మకమైన రామన్ మెగసెసె అవార్డుని సొంతం చేసుకోవడాన్ని చూడాలి. ఫిలిప్పీన్స్ రిపబ్లిక్ మూడవ అధ్యక్షుడు రామన్ మెగసెసె పేరిట ఏటా ఇచ్చే ఈ అవార్డు 2016లో బెజవాడ విల్సన్‌కు దక్కింది. ఇది మాన్యువల్ స్కావెంజింగ్ వ్యవస్థ నిర్మూలనకోసం పోరాడుతోన్న వారికి ఓ ప్రోత్సాహం. భారతదేశంలో అంటరాని కులాల సమస్యలపై పోరాడుతోన్న నాయకులకు ఈ అవార్డు లభించడం ఇదే మొదటిసారి.

అమానుష వ్యవస్థకు శాస్త్రాలు, పురాణల వత్తాసు
గతంలో కొన్ని ఇతర దేశాలలో కూడా మాన్యువల్ స్కావెంజింగ్ వంటి విధనాలు ఉన్నా ఒక వర్గమో, కులమో, తెగనో ఈ పనిని చేసేది కాదు. మన దేశంలో ఇది ఒక కులవృత్తిగా మొదలయ్యింది. మలం అంటుకోరానిది కనుక, అంటరాని వారు మాత్రమే చేయదగ్గ పనిగా మానవ మలాన్ని ఎత్తివేసే నికృష్టమైన పనిని నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో అట్టడుగున ఉన్న దళితులకు అంటగట్టారు. అదే పనిలో గత 4,000 ఏళ్లుగా దళితులు మునిగి తేలుతున్నారు. ఈ దేశంలో పుట్టిన ప్రతివాడూ మనిషిగా పుడతాడు. కులంగా మారతాడు. ఫలానా కులంలో పుట్టినందుకు గౌరవాన్నో, ప్రతిష్టనో లేక అవ మానాన్నో, ఏహ్యభావాన్నో మూటగట్టుకుంటాడు. మనుధర్మం, పురాణాలు, ఇతిహాసాలు, సంహితలు ఆ మనిషి జీవితాన్ని శాసిస్తాయి. ఇలాగే బ్రతకా లనో, ఇది మాత్రమే తినాలనో, ఈ మలినాలను ఎత్తివేయాలనో, ఏ విషపు బావుల్లోనో దిగి ఊపిరాడక చచ్చి పుణ్యం కట్టుకోవాలనో పురాణాలు బోధి స్తాయి. భారత, రామాయణాల్లోని ఎన్నో ఉపకథల్లో కూడా ఇదే చెప్పారు. అంటే, ఈ పనులు దైవ నిర్దేశిత కార్యాలని నమ్మించారు. దానితో ఆ కులాల వారు తమ తలరాత ఈ విధంగా ఉన్నందువల్లనే, ైదె వం తమను ఈ విధంగా పుట్టించినందునే ఈ వృత్తిలోనే బతుకుతూ,  అందులోనే కడతేరి పోవడమే ధర్మమనినమ్మేలా హిందూ ధర్మ శాస్త్రాలు చేయగలిగాయి.

పవిత్రత బూటకం...కులం ఆడే నాటకం
మహాత్మాగాంధీ లాంటి వాళ్ళు సైతం పాకీ పనిని దేవుని కార్యంగా ప్రచారం చేశారు. తనకు మరో జన్మంటూ ఉంటే భంగి (పాకీపనిచేసే) కులంలో పుట్టాలనుకుంటున్నానని ఆయన ప్రకటించారు. నేటి మన ప్రధాని నరేంద్ర మోదీ సఫాయి పనిని స్వచ్ఛ భారత్‌లో భాగం చేశారు. తెల్ల బట్టలతో రోడ్డు మీదకు వచ్చి చీపుర్లు పట్టుకొని ఫొటోలు దిగి వెళ్ళిపోయారు. కానీ మల మూత్రాలను విసర్జించే డ్రై లెట్రిన్‌ల దగ్గరికి వెళ్ళి, చేతితో మలం తీసి, తట్టలో తలపైన ఎత్తుకొని పోయి ఉంటే ఇది ఎంతటి పవిత్రమైన కార్యక్రమమో, స్వచ్ఛ భారత్‌కి  భారతావని ఎంత దూరంలో ఉన్నదో మోదీకి స్పష్టంగా అర్థమయ్యేది. ‘‘పాకీ పని ఓ పవిత్రమైన పని అని మోదీ ప్రకటించారు సరే.. అది అంత పవిత్రమైనదైతే మోదీని కూడా ఈ పనిచేయమని నా మిత్రులు కొందరన్నారు. కానీ దళితులే కాదు, మోదీ సహా ఏ మనిషీ ఇటువంటి అమా నవీయమైన పనిని చేయాలని నేను కోరుకోవడం లేదు. ఇది మనుషులు చేసే పనికాదు. మనిషి తన శాస్త్రీయ పరిజ్ఞానంతో విశ్వాంతరాళాల్లో విహరిస్తు న్నాడు, అటువంటి మనిషిని అత్యంత నీచమైన పని నుంచి విముక్తిచేసే పరికరాన్ని ఎందుకు కనుగొనలేకపోయాడు?’’ అని విల్సన్ అన్నారు.

సఫాయీ, పాకీ పనిపైన రాజకీయంగా ధ్వజమెత్తిన అంబేడ్కర్... కుల వ్యవస్థను సమర్థించే గాంధీ పైన భావజాల యుద్ధాన్ని ప్రకటించారు. ‘‘పాకీ పని పవిత్రమైనదైతే అందరినీ చేయాలని ప్రోత్సహించాలి. కేవలం అంట రాని కులాలను మాత్రమే అందులో ఉండమని, పైగా ఆ పని చేస్తున్నందుకు గర్వించాలని చెప్పడం గాంధీకి ఒక్కడికే సాధ్యం’’ అని ఆయన విమర్శిం చారు. అంతేకాదు, అంటరాని కులాలు పాకీపని నుంచి బయటపడాలని అనేక సార్లు పిలుపునిచ్చారు. కుల వ్యవస్థను, పాకీ పనిని కొనసాగిస్తున్న హిందూ వ్యవస్థను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అంటరానితనం నిర్మూలన కావాలంటే కుల నిర్మూలన జరగాల్సిందేనని కూడా ప్రకటించారు.

అయితే 1950లో అమల్లోకి వచ్చిన రాజ్యాంగంలో అంటరాని కులాలు సాటి మనుషులుగా మనగలగడానికి కొన్ని హక్కులను పొందుపరచారు. ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనం నిషేధం. అయితే తరతరాల నుంచి దళితులను వారసత్వంగా వెంటాడుతోన్న పాకీ పని మాత్రం కొనసాగుతూనే ఉన్నది. ఈ సమస్య మీద ఎన్నో సంఘాలు, వ్యక్తులు అంబేడ్కర్ స్ఫూర్తితో ఉద్యమిం చాయి. ఫలితంగానే 1993లో మాన్యువల్ స్కావెంజింగ్‌ను నిషేధిస్తూ చట్టం వచ్చింది. ఇక్కడ మానవ హక్కుల కార్యకర్తలుగా బెజవాడ విల్సన్ లాంటి వారు ఆ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అయితే ఆ చట్టం అమలులోని  లోపాలను ఎత్తిచూపుతూ, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని బయటపెట్టడానికి 1994లో సఫాయి కర్మచారీ ఆందోళన్ ఏర్పడింది. దీని నిర్మాణంలో విల్సన్‌ది కీలక పాత్ర. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్.ఆర్. శంకరన్ చైర్మన్‌గా ఈ సంస్థ హైదరాబాద్‌లోనే ప్రారంభం కావడం విశేషం.

నిజమైన స్వచ్ఛ భారతం ఎంత దూరం?
బెజవాడ విల్సన్ కర్ణాటక రాష్ర్ట్రంలోని కోలార్ పట్టణంలో ఒక మాన్యువల్ స్కావెంజింగ్ సఫాయీ కార్మిక కుటుంబంలో జన్మించారు. చిన్నతనం నుంచి ఈ అమానుష వ్యవస్థలోని దుర్మార్గాన్ని, దానివల్ల కలిగే తీవ్ర అనారోగ్యాన్ని, ఏర్పడే ప్రాణహానిని, మొత్తంగా ఈ వ్యవస్థలోని బానిసత్వ భావజాలాన్ని సహించలేకపోయిన విల్సన్... మాన్యువల్ స్కావెంజింగ్ నిర్మూలనే జీవన లక్ష్యంగా ఎంచుకున్నారు. 2001లో దక్షిణాఫ్రికాలోని దర్బన్‌లో జరిగిన వర్ణ వివక్ష వ్యతిరేక సదస్సులో ఈ మాన్యువల్ స్కావెంజింగ్ సమస్యను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లాడు. ఈ ఉద్యమాన్ని జాతీయ స్థాయి ఉద్యమంగా మలచడా నికి 2003లో ఢిల్లీకి తన కార్యస్థలాన్ని మార్చాడు.

 మాన్యువల్ స్కావెంజింగ్‌ను నిషేధిస్తూ చట్టం చేసినా, ఆ అమానుషా వ్యవస్థను నిర్మూలించడంలో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతు న్నాయంటూ 2004లో సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. ఇట్లా ఈ సమస్య పరిష్కారానికి జరుగుతున్న ఉద్యమం సత్ఫలితాలను ఇచ్చింది. ఎంతో మంది పాకీ పని నుంచి విముక్తి పొందడానికి ముందుకు వచ్చారు. 1993కి ముందు 30 లక్షల మంది ఈ పనిలో ఉంటే... ప్రస్తుతం ఆరు లక్షల మంది ఉన్నట్టు లెక్కలు చూపుతున్నాయి. వీరికి పునరావాసం కల్పించాలని చట్టంలో పేర్కొన్నా ప్రభుత్వం చిత్తశుద్ధిని చూపడం లేదు. పాకీ పనివారి పునరా వాసం కోసం వంద కోట్లు కూడా కేటాయించలేకపో వడమే స్వచ్ఛ భారత్‌పై వారికి ఉన్న చిత్తశుద్ధికి అద్దం పడుతోంది.

స్వచ్ఛ భారత్ అంటే రోడ్ల మీద పైపైన ఉండే మామూలు చెత్తని ఊడ్చివేయడం కాదు. తరతరాలుగా చెత్తలో, మురికిలో, మానవ మలంలో  మునిగితేలుతూ ప్రాణాలు కోల్పోతున్న వారిని ఆ పనిలో నుంచి బయట పడేయడం. అదే స్వచ్ఛభారత్‌కి నిజమైన అర్థం కావాలి. పబ్లిక్ టాయ్‌లెట్స్ పేరుతో ప్రభు త్వాలు కడుతున్న అద్దంలాంటి భవనాలలో కూడా వాటిని శుభ్రం చేసేది ఈ అంటరాని కులాలే. అందుకే ఇంకా లక్షలాది మంది నెత్తిమీద మలం మోస్తూనే ఉన్నారు. ఈ అమానవీయ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేయడం అంటే మురికిలో, మలినంలో బతుకుతున్న వారి మధ్య బతకడమే. అది ఒక్క బెజవాడ విల్సన్‌కి మాత్రమే సాధ్యమైంది. అయినా అతనొక్కడే ఈ మహోద్యమాన్ని కొనసాగించలేడు. మరెందరో ఈ దుర్మార్గాన్ని పాతిపెట్టడానికి ముందుకు రావాలి.

(వ్యాసకర్త:మల్లేపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకులు)
 మొబైల్ : 97055 66213

 

మరిన్ని వార్తలు