సమగ్రతతో చెలగాటమా?

25 Aug, 2016 01:00 IST|Sakshi
సమగ్రతతో చెలగాటమా?

సీమాంతర ఉగ్రవాదం ద్వారా జమ్మూ కశ్మీర్‌లో కల్లోల పరిస్థితిని శత్రు దేశం రెచ్చగొడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వానికి బాసటగా నిలిచే బదులు.. దేశ భద్రత, సమగ్రతకు భంగం కలిగించే విధంగా కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరించటం మన దేశ ప్రజలపట్ల అన్యాయానికి పాల్పడటం తప్ప మరేమీ కాదు. మావోయిస్టులు, మతోన్మాదులు, మతతత్వవాదులు వంటి విచ్ఛిన్నకర శక్తులతో చేతులు కలుపుతూనే దేశ సమైక్యత గురించి ప్రవచనాలు వల్లించడం, బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేయడం కాంగ్రెస్‌ లాంటి కుత్సిత రాజకీయ శక్తులకే చెల్లుతుంది. కశ్మీర్‌ మంటల్లో చలి కాచుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నించడం దురదృష్టకరం.

ఈ దేశంలో ఏమి జరుగుతున్నది? కశ్మీర్‌ సమస్య పరిష్కారం, ఉగ్రవాద నిర్మూలనపై సంఘటితంగా దేశం యావత్తూ కృషి చేయాల్సిన తరుణంలో మన ప్రతిపక్షాలలో కొన్ని పార్టీలకు మాత్రం కేవలం రాజకీయాలే పరమావ ధిగా కనిపిస్తున్నాయి. దేశ సమగ్రత, సమైక్యత, అంతర్గత భద్రతలపై, విదే శాల్లో మన పరువు ప్రతిష్టలపై ఈ పార్టీ లకు ఏ మాత్రం పట్టింపులేనట్లు కనిపి స్తోంది. కశ్మీర్‌పై అఖిలపక్ష సమావేశం నిర్వహించి సమస్య పరిష్కారానికి, రాష్ట్రంలో శాంతిభద్రతలు చక్కబడడానికి ప్రధాని సహకారం కోరితే కొందరు వీధికెక్కి దుర్మార్గమైన ఆరోపణలు చేస్తున్నారు.

కశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితికి కేంద్రంలో ఉన్న నరేంద్రమోదీ ప్రభుత్వం బాధ్యత వహించాలా లేక 50 ఏళ్లకుపైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ పార్టీ బాధ్యత వహించాలా? కశ్మీర్‌లో ఉగ్రవాది, హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ బుర్హన్‌ ముజఫర్‌ వాని ఎన్‌కౌంటర్‌లో మరణిస్తే, పాకిస్తాన్‌ ఉగ్రవాదాన్ని ప్రేరేపించి లోయలో అల్లకల్లోలాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తే ఎవర్ని తప్పుపట్టాలి? ఈ దేశంలో ఐదు దశాబ్దాలుగా విచ్ఛిన్నకర రాజకీయాల్ని అవలంబిస్తూ ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న కశ్మీర్‌ లోయలో చిచ్చు రేపింది ఎవరు? దేశంలో మతతత్వం, కులం, ప్రాంతం ఆధారంగా అనేక వర్గాలను చీలుస్తూ తమ రాజకీయాలకు ఉపయోగించుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీ ఇంకెంత కాలం అవే నికృష్ట కార్యాలకు పాల్పడుతుంది? దేశ విభజనకు కార ణమైన ముస్లింలీగ్‌ను కేంద్ర కేబినెట్‌లో చేర్చుకున్న ఘనత కాంగ్రెస్‌దే. ఎంఐఎం వంటి మతోన్మాద శక్తులతో పొత్తు కుదుర్చుకుని, హైదరాబాద్‌ మేయర్‌ స్థానాన్ని కట్టబెట్టి ఆ పార్టీకి విశ్వసనీయత కల్పించిన పాపం కాంగ్రెస్‌దే. జమ్మూకశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్, సిమి, అల్‌ ఉమ్మా వంటి సంస్థ లతో ఒకప్పుడు చేతులు కలిపి వారిపట్ల సానుభూతితో వ్యవహరించిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉంది. ఎవరు కాదనగలరు?

వేర్పాటువాదానికి స్నేహ హస్తం
ఈ దేశంలో తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం వేర్పాటువాదాన్ని, విచ్ఛిన్నకరతత్వాన్ని కాంగ్రెస్‌ ప్రోత్సహించింది. భింద్రన్‌వాలేను ఒక గొప్ప సాధువుగా అభివర్ణించి, చివరకు అతడిని వధించేందుకు స్వర్ణ దేవాలయానికి సైన్యాన్ని పంపింది కాంగ్రెస్‌ ప్రభుత్వమే. ఆ తర్వాత 1984లో ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 3,400 మంది సిక్కుల ఊచకోతకు కారణమైంది కూడా కాంగ్రెస్‌ సర్కారే. ‘ఒక మహావృక్షం కూలితే భూమి కంపిస్తుంది’.. అని ఈ ఊచకోత అనంతరం వ్యాఖ్యానించింది దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ కాదా? చరిత్ర అబద్ధాలు చెప్పదు. శ్రీలంకలో ఎల్టీటీఈని ఎవరు ప్రోత్సహించారు? వారికి ఆయుధాలు, శిక్షణను అందించింది కాంగ్రెస్‌ ప్రభుత్వమే. శ్రీలంకలో వేయిమంది మన సైనికులు తమ అమూల్యమైన ప్రాణాలు అర్పించడానికి కారణం కాంగ్రెస్‌ సర్కార్‌ అవలంబించిన తప్పుడు విధానాల వల్లే కదా? ఒకరికి శిక్షణ, ఆయుధాలనిచ్చి, వారిపై మన సైనికులను ఉసిగొల్పి మరణిం చేందుకు కారణమైన కాంగ్రెస్‌ సర్కార్‌ చేతులకు అంటిన నెత్తురు ఎంత కడు క్కున్నా పోతుందా?

కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, వర్గాన్ని, ఆఖరుకు దేశ విద్రోహులను కూడా తమ కుత్సిత రాజకీయాలకు ఉపయోగించుకుని జాతి ప్రయోజనా లను దెబ్బతీస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి జాతీయవాద పార్టీ అయిన భారతీయ జనతా పార్టీని విమర్శించే హక్కు ఉందా? సుదీర్ఘకాలం దేశాన్ని పాలించి సర్వనాశనం చేసిన కాంగ్రెస్‌కు బీజేపీ సిద్ధాంతాలను విమర్శించే నైతిక అర్హత ఏ మాత్రం లేదు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్‌ ఆడిన దుర్మార్గ రాజకీయాలే దేశాన్ని ఈ పరిస్థితికి దిగజార్చినట్లు చరిత్రను అధ్యయనం చేసిన వారెవరికైనా అర్థం అవుతుంది. సుదీర్ఘ కాలంగా పరిపాలన చేసిన పార్టీల బుజ్జగింపు రాజకీయాలు మెజారిటీ, మైనారిటీ ప్రజలపట్ల అగాథాన్ని పెంచాయి. కాంగ్రెస్‌ ఎన్నో ఏళ్లుగా చేసిన తప్పుడు రాజకీయాలే నేడు కశ్మీర్‌ సమస్యను సంక్లిష్టంగా మార్చాయి.

ఆద్యంతం అవకాశవాదం
దేశ సమైక్యత, సమగ్రతపట్ల కాంగ్రెస్‌ అంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన పార్టీ మరొకటి లేదు. కేంద్రంలో కీలకమైన పదవులు అనుభవించిన ఆ పార్టీ నేతలు చేస్తున్న పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. బెలూచిస్తాన్, ఆక్రమిత కశ్మీర్‌పై అఖిలపక్ష సమావేశంలో ప్రధానమంత్రి చేసిన ప్రకటనలను ఒక కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సమర్థిస్తే మరో కాంగ్రెస్‌ నేత దాన్ని వ్యతిరేకిస్తారు. కాంగ్రెస్‌కు చెందిన మాజీ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలతో కూడా తమకు సంబంధం లేదని పార్టీ ప్రకటిస్తుంది. తమ మాజీ హోంమంత్రి చేసిన ప్రకటన, రాసిన వ్యాసాలతో కూడా తమకు సంబంధం లేదని కాంగ్రెస్‌ ప్రకటిస్తుంది. ఒక నేత చేసిన వ్యాఖ్యలు పార్టీ లైన్‌కు అను కూలంగా లేవని, అవి వ్యక్తిగత వ్యాఖ్యలేనని మరో నేత వివరణ ఇస్తారు. కేంద్ర మంత్రులు, ఒకప్పుడు ప్రభుత్వంలో థింక్‌ టాంక్‌లుగా ఉన్న చిదం బరం, సల్మాన్‌ ఖుర్షీద్, కపిల్‌ సిబల్, దిగ్విజయ్‌ సింగ్‌లు చేసిన పనులు, వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమైనవా? ఇంతకాలం తమ రెండు నాల్కల ధోరణితో కాంగ్రెస్‌ ప్రజల్ని మోసం చేసింది.

ఇప్పుడు కాంగ్రెస్‌ నేతలు రకరకాల నాలుకలతో మాట్లాడుతూ, ఒకర్నొకరు ఖండించుకుంటూ ఏది పార్టీ లైనో తేల్చుకోలేని దుస్థితిలో ఉన్నారు. కేవలం రాజకీయ అవకాశవాదం తప్ప కాంగ్రెస్‌కు ఒక పంథా కానీ సిద్ధాంతం కానీ ఉన్నట్లు కనబడటం లేదు. గత తప్పిదాల నుంచి ఆ పార్టీ ఏమీ నేర్చుకోలేదని దీన్నిబట్టి అర్థమవుతున్నది. సీమాంతర ఉగ్రవాదం ద్వారా జమ్మూ కశ్మీర్‌లో కల్లోల పరిస్థితిని శత్రు దేశం రెచ్చగొడుతున్న సమయంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి బాసటగా నిలిచే బదులు దేశ భద్రత, సమగ్రతకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ మన దేశ ప్రజలపట్ల అన్యాయానికి పాల్పడుతోంది.

లేకపోతే విచ్ఛిన్నకర శక్తుల నినాదాలకు, భారత వ్యతిరేక నినాదాలకు వేదిక కల్పించిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సంస్థపట్ల కాంగ్రెస్‌ ఎందుకు సానుభూతి ప్రకటిస్తున్నది? దేశ ద్రోహానికి పాల్పడ్డ యాకూబ్‌ మెమన్, మఖ్బుల్‌ భట్, అఫ్జల్‌ గురు వంటి వారికి అనుకూలంగా కార్యక్రమాలు నిర్వహించిన మావోయిస్టులు, మతోన్మాదులు, మతతత్వవాదులతో సమావే శాల్లో పాల్గొని కాంగ్రెస్‌ సంఘీభావం ఎందుకు ప్రదర్శించింది? ఒకవైపు ఇలాంటి శక్తులతో చేతులు కలుపుతూనే దేశ సమైక్యత గురించి ప్రవచనాలు వల్లించడం, బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేయడం కాంగ్రెస్‌ లాంటి కుత్సిత రాజకీయ శక్తులకే చెల్లుతుంది. జేఎన్‌యూ, హైదరాబాద్‌ యూనివర్సిటీ, కేరళ ఉదంతాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు నిదర్శనాలు.

ఈ దేశంలో అన్ని అధికారాలు అనుభవించింది కాంగ్రెస్‌. పార్లమెంట్‌ నుంచి పంచాయతీ వరకు, ముఖ్యమంత్రి నుంచి మునిసిపాలిటీ వరకు కాంగ్రెస్‌ అధికారం అనుభవించని పదవి అంటూ లేదు. కాంగ్రెస్‌ వైఫల్యాల వల్లే ఈ దేశంలో 69 సంవత్సరాల తర్వాత కూడా 35 నుంచి 40 శాతం వరకు నిరక్షరాస్యత తాండవిస్తోంది. 25 శాతం మంది ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. ఈ దేశంలో ప్రజల మధ్య సామాజిక అనైక్యత పెచ్చరి ల్లుతోంది. అస్పృశ్యత ఇంకా అనేకచోట్ల కొనసాగుతోంది. కాంగ్రెస్‌ పార్టీ వైఫ ల్యాలవల్లే, విచ్ఛిన్నకర ఎజెండావల్లే ఈ దేశం ఇంకా ఇలా కునారిల్లుతోంది.

మా ప్రభుత్వం కేవలం రెండేళ్ల క్రితమే అధికారంలోకి వచ్చింది. ఈ దేశంలో సామాజిక భద్రత సాధించేందుకు ప్రధానమంత్రి అహోరాత్రాలు కష్టపడి కృషి చేస్తున్నారు. సామాజిక సామరస్యత సాధించేందుకు తీవ్ర యత్నాలు సాగుతున్నాయి. దేశమంతా ఏకత్రాటిపై నిలిచి సామాజిక సమ స్యలపై పోరాడేందుకు తగిన వాతావరణం కల్పించేందుకు మేము కృషి చేస్తున్నాము. అభివృద్ధి సుపరిపాలనపై ఒకవైపు, పేదల్లో నిరుపేదలను చేరు కునేందుకు అంత్యోదయపై మరోవైపు మేము దృష్టి కేంద్రీకరించాము. సామాజిక భద్రత సాధించేందుకు అనేక పథకాలను మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మరోవైపు పెట్టుబడులు పెట్టేవారిని ఆకర్షిస్తోంది.

ఐఎస్‌ఐపై మౌనం.. ఆరెస్సెస్‌పై క్రోథం
ఈ సమయంలో దేశానికి అండగా నిలబడటం అన్ని పార్టీల బాధ్యత. ముఖ్యంగా కాంగ్రెస్‌ వంటి కొన్ని పార్టీలు కశ్మీర్‌ మంటల్లో చలి కాచుకునేం దుకు ప్రయత్నించడం దురదృష్టకరం. గతంలో విచ్ఛిన్నకర శక్తులను ప్రోత్స హించి, ప్రజల్లో వేర్పాటు ఆలోచనా ధోరణికి కారణమయింది చాలక ఇప్పుడు మా ప్రభుత్వాన్ని తప్పుపట్టడం దారుణం. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఉగ్రవాద, వేర్పాటువాద శక్తులను దునుమాడుతున్న మన సైనిక బలగాలను అవమానిస్తున్న వారిపై కూడా కొన్ని పార్టీలు సానుభూతి కురిపిస్తున్నాయి. పాక్‌ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ కార్యకలాపాలపై మౌనంగా ఉన్న కాంగ్రెస్‌ ఆర్‌ఎస్‌ఎస్‌పై మాత్రం విరుచుకుపడుతోంది. జాతీయ వాదు లపై విమర్శలు చేసే కాంగ్రెస్‌ ఉగ్రవాదుల పట్ల మెతకవైఖరి అవలంబిస్తోంది.

మన విదేశీ వ్యవహారాలకు సంబంధించి సాధారణంగా అన్ని రాజకీయ పార్టీలు అత్యంత జాగ్రత్తగా ఉంటాయి. ఆచితూచి వ్యాఖ్యానిస్తాయి. ఈ వ్యవ హారంపై అంతా కలిసికట్టుగా, ఒకే స్వరం పలకడం అవసరం. కానీ కాంగ్రెస్‌ మాత్రం పలు స్వరాలతో మాట్లాడుతోంది. ఒక పరిపక్వ ధోరణిని ప్రదర్శిం చకుండా మానసిక ప్రకోప వైఖరిని ప్రదర్శిస్తోంది. కాంగ్రెస్‌ నేతల కొన్ని వ్యాఖ్యలు పాకిస్తాన్‌కు వీనుల విందుగా వినిపిస్తున్నాయి. కానీ భారతదేశ ప్రజలు మాత్రం దీన్ని సహించబోరు. ఇప్పటికే దేశంలో పలుచోట్ల కాంగ్రెస్‌ బలహీనపడిపోయింది. కాంగ్రెస్‌తో సహా దేశంలోని కొన్ని పార్టీలు ఆత్మపరిశీ లన చేసుకోవలసిన, తమ విధానాలను సమీక్షించుకోవలసిన సమయం ఆసన్నమైంది. మరింత ఆలస్యం చేస్తే మొదటికే మోసం వస్తుంది.

వ్యాసకర్త కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార ప్రసార శాఖ మంత్రి
ఎం. వెంకయ్యనాయుడు

మరిన్ని వార్తలు