తెలసీ తెలసీ

27 Sep, 2015 01:08 IST|Sakshi

ఎప్పుడూ ఇంతే!
 అతిగా మమేకమై
 అధికంగా బాధపడడం!
 నూరుశాతం ప్రేముండాలంటూ నూతిలో దూకి
 నిచ్చెనల సాయంతో పైకి రావడం
 ఉల్లికి మల్లెపూల గౌరవమిచ్చి
 మురిసి మెడలో ధరించి అభాసవడం
 కీకారణ్యపు బుర్రల్లోకి దారి చెయ్యబోయి
 తోవ తప్పి పులిగుహలో పడి పరితపించడం
 తేలుకొండిలో తేనె నింపాననుకుని
 వేలుపెట్టి పరీక్షించి విలవిల్లాడ్డం
 ఈర్ష్యాళువుకి త్యాగనిరతి గ్రంథం అంకితమిస్తూ
 అసూయా కంటకాలు గుచ్చుకుని అవాక్కవడం
 స్నేహమంటూ కనకపు సింహాసనాలిచ్చి
 బొడ్డు చుట్టూ సూదులు వేయించుకోవడం
 జిత్తులమారికి కవచకుండలాలిచ్చి
 దొంగతనం మోపించుకుని మ్రాన్పడిపోవడం
 ఎప్పుడూ ఇంతే!
 - అల్లూరి గౌరీలక్ష్మి
 9948392357
 
 తిరగబడిన బాపూజీ
 తెల్లటోపీని నిజాం ప్రభుత్వం వ్యతిరేకిస్తే, తిరుగుబాటుగా తెల్లటోపీ ధరించడం ప్రారంభించారు కొండా లక్ష్మణ్ బాపూజీ. బలవంతుడైన భూస్వామి విస్నూరు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా బందగి కేసును వాదించారు. తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా 1969లో కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గం నుంచి కేబినెట్ మంత్రిగా రాజీనామా చేశారు. నిజాం వ్యతిరేక పోరాటం, వెనుకబడిన కులాల ఉద్యమం, చేనేత సహకారోద్యమం, ప్రత్యేక తెలంగాణోద్యమాలతో ముడిపడిన సుదీర్ఘ జీవితం ఆయనది. సెప్టెంబర్ 27 బాపూజీ శతజయంతి. ఈ సందర్భంగా రుద్రమదేవి ఉమెన్ వెల్ఫేర్ సొసైటీ వారు ఆయన ఉద్యమం, స్మృతులు, ఇంటర్వ్యూలు కలిపి ‘కొండా లక్ష్మణ్ బాపూజీ దార్శనికత’గా పుస్తకం  తెచ్చారు. సంపాదకులు ప్రొఫెసర్ కె.శ్రీనివాసులు. వివరాలకు నరేందర్ తన్నీర్ ఫోన్: 9391064357
 
 కవిత్వం ద్వారా సంపాదించిన డబ్బుతో కవి ఎప్పటికైనా కారులో దర్జాగా తిరగాలని కలగనే జనార్దన మహర్షికి తెలుసు, అది పగటి కల అని! అయినా ఒక ఆశ, ‘పెద్ద పెద్ద కంపెనీలు క్రికెట్‌ని, సినిమాని స్పాన్సర్ చేసినట్టుగా’ కవిత్వాన్ని చేసే రోజులొస్తాయని. 2003లో ప్రచురించిన ఆయన ‘వెన్నముద్దలు’ తాజాగా పదో ముద్రణ (క్రియేటివ్ లింక్స్ ప్రచురణ)కు వచ్చిన నేపథ్యంలో ఆయనతో ఆయనే సంభాషించుకుంటే?
 అదే సెల్ఫీ!
 
 జనార్ధనతో మహర్షి
 ఇది నిజంగానే పదో ముద్రణా?
 నిజాయితీగానే పదో ముద్రణ.
 కవిత్వం, అదీ ఈ కాలంలో పదో ముద్రణంటే?
 సంతోషం, మీరిది కవిత్వం అని ఒప్పుకున్నందుకు.
 ఛా నా ఉద్దేశం, ఇది ఎలా సాధ్యమైందని?
 అలా ప్రచారం చేస్తున్నా. పుస్తకాన్ని పుస్తకాల షాపుల్లోనే కాకుండా, సూపర్ మార్కెట్స్‌లో, చిన్న షాపుల్లో, అది టీ స్టాల్ అయినా సరే, పది మంది కలిసే ప్రతిచోటా ఉంచుతున్నా. చక్కెర, ఉప్పు దొరికే ప్రతిచోటా నా ‘వెన్నముద్దలు’ అందుబాటులో ఉంచడానికి ప్రయత్నిస్తున్నా.
 గ్రేట్, అందుకే బాగా పోయాయి...
 పోయాయి. డబ్బులు కూడా!
 అదేంటి? పుస్తకాలు పోతేనేగా వేశారు!
 పుస్తకాలు ‘అమ్ముడు’ పోనక్కర్లేదు, ‘అయిపోయినా’ వేస్తారు.
 ‘పంపకాలు’ ఎక్కువన్నమాట! అయినా ఎందుకు వేస్తున్నట్టు!
 ఒకే ఒక్క కారణం: కవిత్వం మీది ప్రేమ.
 వెన్నముద్దలు అని పేరెందుకు పెట్టారు?
 నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా ఉండాలని.
 మీరు సినిమా రచయితగా సంతృప్తి చెందారా?
 సినిమా అంటే నా చేత పదిమంది రాయించేది. పుస్తకం నేనే పదిమందై రాసేది.
 మీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే...
 నాలోని బొక్కలు/ వెతక్కండి/ అదే వెదురుని/ ‘వేణువు’ని చేసింది.
 జనార్దన మహర్షి ఫోన్: 9848034309
 
 ‘బంకుపల్లి’ పుస్తకావిష్కరణ
 శ్రీకాకుళ సాహితి’ ఆధ్వర్యంలో నేడు శ్రీకాకుళం ప్రెస్‌క్లబ్‌లో ఉదయం 10 గంటలకు  కె.ముత్యం రాసిన ‘స్వాతంత్య్రోద్యమ కాలపు సంస్కర్త బంకుపల్లి మల్లయ్య శాస్త్రి జీవిత దృశ్యం’ పుస్తకావిష్కరణ జరగనుంది. ఆవిష్కర్త: కాళీపట్నం రామారావు. రామారావు నాయుడు, అట్టాడ అప్పల్నాయుడు, పి.ఎస్.నాగరాజు వక్తలు.
 
 జాషువా జయంతి సదస్సు
 ‘బహుజన రచయితల వేదిక-ఆంధ్రప్రదేశ్’ ఆధ్వర్యంలో నేడు ఉదయం 10 నుంచి సాయంత్రం 7 వరకు ప్రకాశం జిల్లా కందుకూరులోని లక్ష్మీశ్రీనివాస ఫంక్షన్ హాలులో జాషువా జయంతి సదస్సు జరగనుంది. పత్రాల సమర్పణతోపాటు, ‘అప్పు వడ్డది సుమీ భరతావని వీని సేవకున్’ అంశంపై కవితాగోష్టి ఉంటుందనీ, అనంతరం ఇటీవల హత్యకు గురైన కన్నడ సాహితీవేత్త కల్బుర్గిని స్మరిస్తూ ర్యాలీ ఉంటుందనీ కన్వీనర్ నూకతోటి రవికుమార్ తెలియజేస్తున్నారు.
 
 జాషువా పుస్తకాలు
 గుంటూరు ఏసీ కాలేజీ ఆడిటోరియంలో నేడు జరగనున్న జాషువా సదస్సులో మహాకవి జాషువా-ప్రగతి శీలత, కళాత్మకత(అద్దేపల్లి రామమోహనరావు), దళిత సాహిత్యవాదం - జాషువా (కత్తి పద్మారావు), జాషువా స్వప్నం-సందేశం(రాచపాళెం చంద్రశేఖరరెడ్డి), జాషువా సాహిత్యం- దృక్పథం- పరిణామం (ఎండ్లూరి సుధాకర్) పుస్తకావిష్కరణలు జరగనున్నాయి.
 
 బైరాగి సాహిత్య సదస్సు
 ఆలూరి బైరాగి 90వ జయంతి సందర్భంగా లోక్‌నాయక్ ఫౌండేషన్ సహకారంతో ఆంధ్ర విశ్వవిద్యాలయ తెలుగు, హిందీ విభాగాలు ఒక సాహిత్య సదస్సును సెప్టెంబర్ 28న ఉదయం 9 గంటలకు అంబేడ్కర్ అసెంబ్లీ హాలు, ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నంలో నిర్వహిస్తున్నట్టు ఆ విభాగాల అధిపతులు ఎస్.మెహన్‌రావు, ఎన్.సత్యన్నారాయణ తెలియజేస్తున్నారు. పొత్తూరి వెంకటేశ్వరరావు, గొల్లపూడి మారుతిరావు, కె.ఎస్. చలం, చందు సుబ్బారావు, వాడ్రేవు చినవీరభద్రుడు, ఎ.కృష్ణారావు, కాట్రగడ్డ మురారి, తుల్లిమిల్లి విల్సన్ సుధాకర్, వెలమల సిమ్మన్న, కొర్రపాటి ఆదిత్య పాల్గొంటారు.  యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచన ‘బైరాగి- జీవితం సాహిత్యం’ పుస్తకాన్ని కె.వెంకటేశ్వర్లు ఆవిష్కరిస్తారు. పురుగుళ్ళ ఆదేశ్వరరావుకు సత్కారం ఉంటాయి.
 
 జాషువా పురస్కారాల ప్రదానం
 ‘యునెటైడ్ ఫోరం ఫర్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్, వరంగల్ యూనిట్’ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28న హన్మకొండలోని జెడ్పీ హాల్లో ఉదయం 11 గంటలకు తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి చేతుల మీదుగా జాషువా పురస్కారాల ప్రదానం జరగనుంది. గ్రహీతలు: బన్న అయిలయ్య, వి.ఆర్.విద్యార్థి, చల్లపల్లి స్వరూపరాణి, పసునూరి రవీందర్, పొట్లపల్లి శ్రీనివాసరావు, షాజహాన, గోనా నాయక్.

మరిన్ని వార్తలు