ఇరుప్రాంతాల్లోనూ సంక్షోభమే!

23 Nov, 2015 12:22 IST|Sakshi
ఇరుప్రాంతాల్లోనూ సంక్షోభమే!

పార్లమెంట్‌లో ఏం జరిగింది -21


విభజన బిల్లుపై 20-02- 2014న రాజ్యసభలో జరిగిన చర్చ వివరాల కొనసాగింపు
శ్రీ డి.రాజా (తమిళనాడు): సార్, మా సీపీఐ పార్టీ ఈ బిల్లును సమర్థిస్తోంది. మా పార్టీ తెలంగాణ ఏర్పాటును సమర్థిస్తోంది. నా పార్టీ ఉద్దేశం స్పష్టపరుస్తాను. తెలంగాణను సమర్థించటమంటే దేశాన్ని చిన్న రాష్ట్రాలుగా మార్చటాన్ని సమర్థించటం కాదు. దీనర్థం, దేశంలోని ఇతర చిన్న రాష్ట్రాల డిమాండ్‌ను సమర్థిస్తామని కాదు. ప్రతి విషయం మెరిట్ ఆధారంగా నిర్ణయించబడాలి. సార్- ఈ విభజన కూడా శాంతి యుతంగా ఉభయుల అంగీకారంతో జరిగుండాల్సింది. మా పార్టీ సమ్మతితో విభజన జరగాలనే చెప్పింది. విభజించబడి ఎవరి కుటుంబాలు వారు ఏ ద్వేషభా వమూ లేకుండా ఏర్పరుచుకోవాలి. కానీ ఈ రోజు ఇరు ప్రాంతాలలో సంక్షోభం చూస్తున్నాం. ఈ సంక్షోభానికి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిది. సార్ ఈ మాట చెప్తూనే, పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంశాన్ని మేము బలపరుస్తున్నాం. విద్య, ఉపాధి, సాగు నీటి పంపిణీ, విద్యుత్, నేచురల్ గ్యాస్, పెట్టుబడుల విషయంలో సీమాంధ్ర ప్రజలకు బలమైన అను మానాలున్నాయి.


ఇవి చాలా నిజమైన అనుమానాలు. వీటిని పరిష్క రించాలి. లేకపోతే శాంతియుత వాతావరణం ఏర్పడదు. కేంద్ర ప్రభుత్వం సీమాంధ్రకు కొత్త రాజధాని కోసం, రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలి. మరీ ముఖ్యంగా సీమాంధ్ర అభివృద్ధి చెందాలి. రాయలీ సమ వెనుకబడిన ప్రాంతం. దేశంలో అతి తక్కువ వర్షపాతం రాయలసీమలోనే (అంతరాయం). నిజానికి దేశం మొత్తం  మీద అతి తక్కువ వర్షపాతమున్న ప్రాం తాల్లో అది రెండవది. తెలంగాణ అభివృద్ధి చెందాలి. కోస్తాంధ్ర అభివృద్ధి చెందాలి. ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజిద్దామనుకున్నప్పుడు, తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు కావాల్సిన ఆర్థిక సహాయం చేయటానికి తగు ఏర్పాట్లు చేయాలి. రెండు ప్రాంతాలూ శాంతి, సౌభాగ్యాలతో కలసిమెలసి ఉండేలా కృషి చేయాలి. ఈ మాటలతో ఈ బిల్లు సమర్థిస్తున్నా థాంక్యూ.

శ్రీ విశ్వజిత్‌దైమారి(అస్సాం): మహోదయా, నేను బిల్లు సమర్థిస్తున్నా. తెలంగాణ ప్రజల హక్కు మేరకు వారికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రధానమంత్రిని, హోంమం త్రిని, యూపీఏ ప్రభుత్వాన్ని అన్ని పార్టీలనూ, ఇంత బలమైన నిర్ణయం తీసుకున్నందుకు అభినందిస్తున్నా. దీనితోపాటే ఈశాన్య ప్రాంతంలో అస్సాంలో బోడో లాండ్ ఆందోళన మీ దృష్టికి తెస్తున్నాను. చాలా సంవత్సరాల నుంచి ప్రత్యేక రాష్ట్రం కోరుతూ ఇక్కడ ఆందోళన జరుగుతోంది. ఇండియా మొత్తం ఈ విషయం తెలుసు. భారత ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. బోడోలాండ్ కౌన్సిల్ అని, బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ అని అనేక ప్రయోగాలు చేసింది. కాని సమస్య పరిష్కరించబడలేదు.  దానితో అక్కడి ప్రజలు, మళ్లీ ప్రత్యేక రాష్ట్రం కావాలంటున్నారు. అక్కడి ప్రత్యేక రాష్ట్ర ఆందోళన చేస్తున్న ఎన్ని గ్రూపులున్నా, ఏ గ్రూపుతో సంప్రదింపులు జరిపినా, ఒకే మాట చెప్తూ వచ్చారు. కొత్త రాష్ట్రాల పునర్ఘటన కమిషన్ ఎప్పుడు ఏర్పడితే అప్పుడు బోడోలాండ్ కూడా ఏర్పడుతుంది. ఇవే కాకుండా, ఇంకో మాట కూడా చెప్తూ వచ్చారు. అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే సమ్మతిస్తుందో అప్పుడు ఈ రాష్ట్రం ఏర్పడుతుందని. మహోదయా, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమ్మతి లేకుండా తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తున్నారో అదేవిధంగా బోడోలాండ్ కూడా చెయ్యాలి.

బోడోలాండ్ సమస్య వల్ల అక్కడ ఉగ్రవాదం చాలా పెరిగిపోయింది. అక్కడి పరిస్థితి గురించి ఎక్కువగా చెప్పనక్కర్లేదు. తెలంగాణ బిల్లు అయిన తర్వాత అక్కడి అన్ని వర్గాలూ ఆందోళన ప్రకటించాయి. తెలంగాణను ఏ విధంగా చేశారో అదే పద్ధతిలో బోడోలాండ్ కూడా చెయ్యమని కోరుచున్నాను. రేపు బోడోలాండ్ ఉద్యమకారుల గ్రూపులతో మీటింగ్ అయినప్పుడు, ఏదో ఒక పరిష్కారం చెయ్యాలి. కమిషన్ ఏర్పాటు చేయలేకపోతే, ఒక బలమైన కమిషన్‌ను నియమించి, ఈ సమస్యకు పరిష్కారం సూచించాలి. ఈ బిల్లును సమర్థిస్తూ నేనింతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు.

డిప్యూటీ చైర్మన్ : ఆనందభాస్కర్, రెండు మూడు నిముషాలు.. అంతకన్నా ఎక్కువ వద్దు.  
రాపోలు ఆనందభాస్కర్ (ఆంధ్రప్రదేశ్) : మూడు నిమిషాల్లో ముగిస్తాను. (అంతరాయం) సావధానం, సుముహుర్త సావధానం, అరవై ఏళ్ల తెలంగాణ ప్రజల దుఃఖం దూరమవుతున్న సమయంలో సభ ముందు రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను. తెలంగాణ స్థితి గజేంద్రమోక్షంలో గజేంద్రుని పరిస్థితి. లావొక్కింతయు లేదు, ధైర్యం విలోలంబయ్యే, ప్రాణంబులున్ ఠావుల్‌దప్పెను, మూర్చవచ్చె, తనువు డస్సెన్, శ్రమంబయ్యెడిన్ నీవే తప్ప ఇతః పరం బెరుగమన్నింపదగునే ఈశ్వరా’ ఈ విధంగా తెలంగాణ ప్రజలు భారత ప్రభుత్వంతో, కాంగ్రెస్‌తో, కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీతో వినమ్రంగా ప్రార్థిస్తూ ఇంత దూరం వచ్చాం. కాంగ్రెస్ అధినేత్రి, మా నాయకురాలు మహోన్నత మాతృ హృదయంతో తీసుకున్న నిర్ణయం కారణంగా తెలంగాణ ప్రజలు సోనియాగాంధీని ‘తెలంగాణ తల్లి’గా భావిస్తున్నారు.


తెలంగాణకు ఒక పిన్ని కూడా ఉంది. ఆమే సుష్మాస్వరాజ్. అది కూడా మనం మర్చిపోకూడదు. తెలంగాణ ప్రజలకు ఆమె ‘పిన్ని’. తెలంగాణ ప్రజల్లో సుష్మాకు చాలా గౌరవముంది. దీంతో పాటు మాయావతిని మనం మర్చిపోలేం. మొదట్నించీ ఆమె తెలంగాణకు మద్దతు ఇచ్చారు. సామాజిక న్యాయ సూత్రాల ఆధారంగా ఏర్పడుతున్న తెలంగాణకు వీరిస్తున్న మద్దతు, స్వీకరిస్తూనే మా దీదీ, కాంగ్రెస్ ముఖ్య కార్యకర్త స్థాయి నుంచి వచ్చిన బెంగాల్ మహానీయురాలుగా ఎదిగిన, కాళిక వచ్చే బెంగాల్ నుంచి వచ్చిన దీదీ మాకెందుకు సపోర్టు ఇవ్వటంలేదో మాకర్థంకావటం లేదు. ఏది ఏమైనప్పటికీ, సార్, ఆవేశం ముందు ఆర్థికశాస్త్రం నిలబడదు. అది రుజువయ్యింది. తెలంగాణ ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనాలనుకుంటోంది.


ఉండవల్లి అరుణ్‌కుమార్
వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు: a_vundavalli@yahoo.com

మరిన్ని వార్తలు