త్యాగ ఫలం ఇదేనా?

21 Nov, 2013 00:45 IST|Sakshi
త్యాగ ఫలం ఇదేనా?
రాష్ట్ర విభజనపై కేంద్ర మం త్రుల బృందానికి (జీఓఎం) ఇటీవల టీఆర్‌ఎస్ ఒక విజ్ఞాపనా పత్రాన్ని సమర్పించింది. కృష్ణా పరివాహక ప్రాంతానికి బయట చట్టవిరుద్ధంగా నిర్మిం చిన తెలుగు-గంగ, గాలేరి-నగరి, హంద్రీ-నీవా, వెలుగొండ, వెలుగోడు, సోమశిల, కండలేరు, చిత్రావతి, లింగాల కాలువలకు నీటి కేటాయింపులను తమ పార్టీ వ్యతిరేస్తుందని ఆ లేఖలో విస్పష్టంగా పేర్కొన్నట్టు ఆ పార్టీ అధినేత తెలిపారు. ఇది అత్యంత ప్రమాదకరమైన వైఖరి. వెనుకబడ్డ రాయలసీమను ఎడారిగా మార్చే దుశ్చర్య. రాయలసీమ, ప్రకాశం జిల్లాలు కృష్ణా పరివాహక ప్రాంతంలోనివి కావనడం దుస్సాహసం. కృష్ణా మిగులు జలాలు తెలంగాణకే దక్కాలనే దురాశతోనే టీఆర్‌ఎస్ ఈ వివాదానికి తెరలేపింది. తెలంగాణ ఇంజనీర్స్ ఫోరం, తెలంగాణ అభివృద్ధి ఫోరం లాంటి సంస్థలు కూడా ఇలాగే అర్థసత్యాలు, అసత్యాలు, అభూతకల్పనలతో ప్రాంతీయ దురభిమానాన్ని ప్రకటించాయి. ‘‘శ్రీశైలం జలాశయం నిల్వ సామర్థ్యం 263 టీఎంసీలు కాగా, దానికి మించి 203 నుండి 364 టీఎంసీల వరకు వరద లేదా మిగులు జలాల పేరుతో దోచుకెళ్లడానికి ప్రాజెక్టులు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణాన్ని చేపట్టారు. పోతిరెడ్డిపాటు హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం పూర్తయిన తరువాత మొత్తం కృష్ణా నదినే రాయలసీమకు మళ్లిస్తారు’’ అని తెలంగాణా ఇంజనీర్స్ ఫోరం తమ వినతి పత్రంలో పేర్కొన్నది. ఇది ఎంతటి హాస్యాస్పదమో పామరులకు కూడా బోధపడుతుంది.
 
వాస్తవమేమిటి?
మొత్తం కృష్ణా నికర జలాలు 69 టీఎంసీలు. వీటిలో చెన్నైకి 15, ఎస్‌ఆర్‌బీసీకి 19, కేసీ కెనాల్‌కు 10 టీఎంసీలు, కాగా తెలుగు గంగకు 29 టీఎంసీలు. ఇకపోతే గాలేరు-నగరి పథకానికి 38 టీఎంసీల మిగులు లేదా వరద జలాలు. వెరసి 112 టీఎంసీల నీరు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి తరలించడానికి వీలుగా నిర్మాణాన్ని చేపట్టారు. కేసీ కెనాల్ 150 ఏళ్ల నాటిది. కాగా, 30 ఏళ్లుగా ఎస్‌ఆర్‌బీసీ, తెలుగుగంగ నిర్మాణంలోనే ఉన్నాయి. గాలేరు-నగరిలో భాగమైన గండికోట జలాశయం మాత్రమే పూర్తయింది. తప్పుడు లెక్కలతో ఎవరిని మోసగించాలని నీటిని అక్రమంగా కొల్లగొడుతున్నారని గగ్గోలు పెడుతున్నారు? ఇహ హంద్రీ-నీవా (40 టీఎంసీలు), వెలుగొండ (43.5) మిగులు జలాలపై ఆధారపడే నిర్మాణంలో ఉన్నాయి. వీటికి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు సంబంధమే లేదు. శ్రీశైలం మీద ఆధారపడిన రాయలసీమ, ప్రకాశం జిల్లా ప్రాజెక్టులకు నికర జలాలు 54+మిగులు జలాలు 126.5= 180.5 టీఎంసీలు మాత్రమే.
 
 ట్రిబ్యునళ్ల తీర్పులను అమలు చేయడానికి కృష్ణా, గోదావరులకు సంయుక్తంగా లేదా వేరువేరుగా స్వయం ప్రతిపత్తి గల నియంత్రణ మండళ్లను ఏర్పాటు చేస్తే నీటి సమస్య పరిష్కారమవుతుందని పలువురు సూచిస్తున్నారు. కావేరి, తుంగభద్ర బోర్డుల చేదు అనుభవాలను చూస్తూనే ఉన్నాం. కృష్ణపై నిర్మాణంలో ఉన్న పలు ప్రాజెక్టులు మిగులు లేదా వరద జలాలపై ఆధారపడి నిర్మిస్తున్నవని విస్మరించరాదు. పైగా కేటాయింపులు లేకుండానే మిగులు జలాలను వినియోగించుకోవడానికి బచావత్ ట్రిబ్యునల్ కల్పించిన స్వేచ్ఛ ఆధారంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల నీటి సమస్యలను బోర్డులు ఎలా నియంత్రించగలవన్నదే మౌలిక ప్రశ్న. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆ మిగులు జలాలను 285 టీఎంసీలుగా నిర్ధారించి సింహభాగాన్ని మహారాష్ట్ర, కర్ణాటకలకు కేటాయించింది. మిగులు జలాలను ఇలా పంపిణీ చేయడం అశాస్త్రీయమన్న మన అభ్యంతరాల దృష్ట్యా ఆ అంశంపై నేడు పునర్విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే టీఆర్‌ఎస్ మిగులు జలాలపై ఈ చిచ్చును రాజేసింది. 
 
 దగాపడ్డ వారు నీటి దొంగలా?
 ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్న కోస్తాంధ్ర, రాయలసీమ కాంగ్రెస్ నాయకుల మధ్య కుదిరిన ‘శ్రీబాగ్ ఒడంబడిక’ (1937) చెల్లని కాసుగా అటకెక్కింది. కృష్ణా, తుంగభద్ర జలాల వినియోగంలో రాయలసీమకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని నాడు లిఖిత పూర్వక హామీని ఇచ్చారు. ఆ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ నాలుగు జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు సాగు నీరు లభించేది. కానీ ఇతర ప్రాంతాల్లోని తెలుగు ప్రజలకు నష్టం జరుగుతుందనే వాదన కు తలొగ్గి నాడు సీమ ప్రజలు తెలుగు జాతి ఉమ్మడి ప్రయోజనాలనే మిన్నగా ఎంచారు. రాయలసీమ సమగ్రాభివృద్ధికి బాటలు వేయగలిగిన కృష్ణా-పెన్నార్ పథకాన్ని తృణప్రాయంగా కాలదన్నారు. ఆ ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంతాల ప్రయోజనాలను కొంతైనా నెరవేర్చడానికి దోహదపడే ప్రాజెక్టులను, జలాశయాలను నేడు తెలంగాణవాదులు వివాదాస్పదం చేస్తున్నారు. కృష్ణా-పెన్నార్ పథకంలో భాగమైన సిద్ధేశ్వరం, గండికోట జలాశయాలను నిర్మించి రాయలసీమకు న్యాయం చేస్తామని చేసిన వాగ్దానాలు గాలిలో కలిసిపోయాయి. సిద్ధేశ్వరం స్థానంలో శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పారు. నాగార్జునసాగర్‌ను సాధించుకొన్నారు. ఆరు దశాబ్దాలు గడచిపోయాయి. కరవుకాటకాలు కరాళ నృత్యం చేస్తున్న రాయలసీమ గుక్కెడు నీళ్ల కోసం ఆర్తనాదాలు చేస్తూనే ఉంది. నాడు రాయలసీమ కోల్పోయిన కృష్ణా-పెన్నార్ ఆయకట్టు ప్రాంతాల ప్రయోజనాలను కొంతైనా నెరవేర్చడానికే తెలుగు-గంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలుగొండ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది. అది కూడా దశాబ్దాల రాయలసీమ ప్రజా పోరాటాల ఫలితమే. ఈ వాస్తవాలను విస్మరించి త్యాగాల సీమపై నీటి దొంగ ముద్ర వేయడం ఏం నీతి? నాడే ఈ ప్రాజెక్టులను చేపడితే బచావత్ ట్రిబ్యునల్ ఆ నీటి వాడకాన్ని కూడా చట్టబద్దం చేసి ఉండేది. నమ్మి దగాపడ్డ నిత్య కరువు సీమకు కృష్ణా మిగులు లేదా వరద జలాలు సైతం దక్కడానికి వీల్లేదని టీఆర్‌ఎస్ వివాదాన్ని రేపుతోంది. 
 
  • {బజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా జలాల్లో 65 శాతం ప్రామాణికమైవిగా నిర్ధారించి, తెలుగుగంగకు 25 టీఎంసీలను కేటాయించింది. ఆ ప్రాజెక్టులో భాగమై న వెలుగోడు, కండలేరు జలాశయాలను వ్యతిరేకించడమంటే ఆ నీటి కేటాయింపును వ్యతిరేకించడమే. 
  •  
  • కృష్ణా పరివాహక ప్రాంతాలైన అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాల ప్రజల దప్పికను తీర్చడానికే తెలుగు-గంగ, హంద్రీ-నీవా, వెలుగొండ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నది. 
  •  
  • చెన్నైకు తాగు నీటి కోసం మహారాష్ట్ర, కర్నాటక, ఆం ధ్రప్రదేశ్, తమిళనాడుల మధ్య కుదిరిన ఒప్పం దంలో భాగంగానే కండలేరు నిర్మాణం జరిగింది. కండలేరు, పెన్నా నదుల వరద నీటిని సద్వినియో గం చేసుకోవడానికి వీలుగా 70 టీఎంసీల నిల్వ సామర్థ్యంగల జలాశయాన్ని నిర్మించారు. 
  • సోమశిల (68 టీఎంసీ) పెన్నా నది నీటిపై ఆధారపడినది. 
  • చిత్రావతి ఆన కట్ట పెన్నానదికి ఉపనది చిత్రావతిపై నిర్మించినది. 
  • ఈ కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడటం తెలంగాణ వాదులకే చెల్లింది. టీఆర్‌ఎస్ తదితరులు అంటున్నట్టుగా తెలుగు-గంగ, హంద్రీ-నీవా, వెలుగొండ కేంద్ర అనుమతి లేని అక్రమ ప్రాజెక్టులయితే... అదే ప్రాతిపదికన నెట్టంపాడు, కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ, మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం కూడా అక్రమమైనవే కావాలి కదా! 
 
 ‘శ్రీశైలం’ ఎవరి సొత్తు?
 కృష్ణానదిపై నిర్మించిన, నిర్మిస్తున్న సాగునీటి పారుదల వ్యవస్థ మొత్తానికి శ్రీశైలం గుండెకాయ. నీటి వినియోగంలో ఇక్కడ ఏ చిన్న తప్పు జరిగినా అది అనివార్యంగా నీటి యుద్ధాలకు దారితీస్తుంది. ఈ ప్రమాదకర పరిస్థితి తలెత్తకూడదనే బచావత్ ట్రిబ్యునల్ తీర్పునకు లోబడి 1996 జూన్ 15న రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెం. 69ని జారీ చేసింది. దాన్ని ఉల్లంఘిస్తే కొరివితో తలగోక్కోవడమే అవుతుంది. శ్రీశైలం జలాశయం నిర్మాణం వెనుక ఉన్న చరిత్రను కూడా పరిగణలోకి తీసుకోవాలి. సిద్ధేశ్వరం వద్ద జలాశయాన్ని నిర్మించి రాయలసీమకు సాగు నీటిని అందిస్తామంటూ దగా చేసి అక్కడ విద్యుదుత్పత్తి ప్రాజెక్టును, జలాశయాన్ని ఏర్పాటు చేశారు. రాయలసీమ ప్రజల పోరాటాలకు తలవొగ్గి ఆ ప్రాజెక్టు స్వభావాన్ని సాగునీటి అవసరాలను కూడా తీర్చడానికి వీలుగా మార్చారు. ఆ జలాశయం నిర్మాణంతో కర్నూలు జిల్లాలో మొత్తం 50 గ్రామాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 67 గ్రామాలు ముంపునకు గురయినాయి. చరిత్రను గౌరవించే వారెవరూ శ్రీశైలంపై రాయలసీమ ప్రజలకు హక్కులేదనే సాహసం చేయలేరు. ఆ చరిత్రపై గౌరవం లేదు కాబట్టే శ్రీశైలం జలాశయం నుండి 11 టీఎంసీలకు మించి ఒక్క చుక్క నీటిని కూడా తరలించుకుపోయే హక్కు రాయలసీమకు లేదని కొందరు హుకుం జారీ చేస్తున్నారు. ప్రాంతాలకు అతీతంగా విస్తృత ప్రజానీకపు ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చి, ప్రత్యేకించి వెనుకబడ్డ, నిత్యకరువు పీడిత ప్రాంతాల కడగండ్లను తీర్చే విశాలమైన దృక్పథంతో ఆలోచించి అతి కీలకమైన నీటి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని అన్వేషించాల్సిన బాధ్యత సాగునీటి రంగ నిపుణులపైన, రాజకీయ పార్టీలపైన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నది.
 
విశ్లేషణ : టి. లక్ష్మీనారాయణ
 డెరైక్టర్
 నీలం రాజశేఖరరెడ్డి
 పరిశోధనా కేంద్రం
మరిన్ని వార్తలు