అతని జ్ఞాపకాలు మనవే

24 Nov, 2013 04:03 IST|Sakshi
అతని జ్ఞాపకాలు మనవే

క్రికెట్ సారాన్ని, సంస్కృతిని, చరిత్రను మార్చిన క్రీడాకారుని ఖ్యాతి ఒక్కరికే. క్రికెట్‌ను భారత ఊహాశక్తి మహానగరంగా, పచ్చని స్టేడియంగా, వాస్తవికతగానూ, భ్రమాత్మక వాస్తవికతగానూ భాసించే టెలివిజన్‌గా మార్చేసిన వాస్తుశిల్పి సచిన్. ‘సచిన్’ అనే అద్భుత స్వప్నాన్ని వీక్షించిన అభిమానులకు ఆ జ్ఞాపకాలను తిరిగి కచ్చితంగా చెప్పడం ఎలాగో తెలియదు. వాస్తవం అతిశయోక్తిగా మారక తప్పదు. 60 ఏళ్లు దాటాక సచిన్... పదిమందీ చెప్పుకునే కథల్లో తనను గుర్తించవచ్చు.
 
 సచిన్ టెండూల్కర్‌కు అప్పుడు పదేళ్లు. 1983లో భారత క్రికెట్ హఠాత్తుగా ఎవరూ ఊహించని రీతిన రివ్వున రోదసికి ఎగసే సీతాకోక చిలుకగా మారిపోయింది. బ్రిటిష్ వాళ్లు మొదట బ్యాటు, బంతి పట్టినది మొదలుకొని అంత వరకు మన క్రికెట్ గొంగళి పురుగులాగా కాళ్లీడ్చుకుంటూ గడిపింది. కపిల్‌దేవ్ ఆ ఏడు ఇంగ్లండ్‌కు తీసుకుపోయిన టీంలో ఎలాంటి ప్రత్యేకతా లేదు. కపిల్ ఒక్కడే అందుకు మినహాయింపు. అప్పుడప్పుడే తనలో దాగిన ఆత్మవిశ్వాసాన్ని గుర్తిస్తున్న నూతన భారతావని నుంచి బయటకు తొంగి చూస్తున్న క్రికెటర్లలో అతడే అత్యంత ఉత్కృష్ట క్రీడాకారుడు. పరిమితమైన తన ఇంగ్లిషు భాషా పరిజ్ఞానాన్ని కపిల్ తన విలక్షణమైన నవ్వుతో విదిల్చి పారేసేవాడు. అ నవ్వు ఎదుటివారిని నొప్పించే తుంటరితనంతో కూడినదీ కాదు, అణకువతో ముడుచుపోయి ఆత్మన్యూనతా భావానికి గురయ్యేలా చేసేదీ కాదు. ప్రపంచం తన భాషను అర్థం చేసుకునే వరకు కపిల్ బ్యాట్, బంతితోనే మాట్లాడాడు.
 
 తన కాలం రాక ముందే ఏ ప్రవక్తా జన్మించడు. 1983 ప్రపంచ కప్పు... భారత క్రికెట్ ఆధిక్యతా శిఖరాలను అందుకునే సాహస యాత్రకు ప్రారంభ స్థానం. క్రికెట్ క్రీడలోని మన శకి ్తసామర్థ్యాలు, సంపదలు గగనానికి దూసుకుపోవడం ప్రారంభించిన సమయానికే... సచిన్ సరిగ్గా తన టీనేజ్‌లోకి ప్రవేశించాడు. క్రికెట్‌లో అలాంటి శక్తిసామర్థ్యాలు, సంపదలను అంతకు ముందయితే అర్థరహితంగా, జానపద కథల్లాంటి కల్పనగా కొట్టిపారేసేవారే.
 
 నివ్వెరపోయి చూస్తున్న వెస్ట్ ఇండీస్‌ను ఓడించి భారత్ 1983 ప్రపంచ క్రికెట్ కప్‌ను గెలుచుకునే వరకు అంతర్జాతీయ క్రికెట్ దుర హంకార పూరితమైన కుల విభజనతో నడుస్తుండేది. బ్రాహ్మణులు, ఇంగ్లండూ, ఠాకూర్‌లు, ఆస్ట్రేలియా క్రీడను శాసిస్తుండేవారు. కొన్నిసార్లు వెస్ట్ ఇండీస్ ఆటగాళ్లు మెరుపుల్లాగా కళ్లు మిరిమిట్లు గొలిపింపజేసేవారు. గ్యారీ సోబర్స్, రోహాన్ కన్హాయ్, వెస్ హాల్, చార్లీ గ్రిఫిత్‌లను ఎవరు మరిచిపోగలరు? క్లైవ్ లాయడ్ ఒక టీమ్‌గా వారందరినీ గుదిగుచ్చే వరకు వారంతా 11 మంది ఆటగాళ్లు మాత్రమే. భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్‌లు బడుగు ప్రపంచం. దక్షిణ ఆఫ్రికా అయితే విందుకు వచ్చిన దెయ్యమే (వారి ఆటను రేడియోలో వినడమే తప్ప చూసింది లేదు).
 
 గవాస్కర్ పాత ప్రపంచపు అత్యంత విశిష్ట క్రీడా నైపుణ్యం. సచిన్, మన మెరుగని ఖండఖండాతరాలను జయించడానికి బయల్దేరిన నౌకకు కెప్టెన్. వీక్షకుల విస్ఫోటనం బ్యాంకు ఖాతాల్లో ప్రతిధ్వనిస్తుండేది. సచిన్ మొట్టమొదటి వ్యాపార ప్రకటన ఒప్పందపు మొత్తం... భారీ పరిశ్రమను ప్రారంభించడానికి అవసరమయ్యే మూల ధనం అంత పెద్దది. అసాధారణమైన ఆ ఒప్పందాన్ని కుదుర్చుకున్న సాహసికుడు మార్క్ మాస్కరెనాస్. అది అతి మంచి వ్యాపార నిర్ణయమని అతనికి తెలుసు. యువ సచిన్‌కు సైతం ఆ విషయంలో ఎలాంటి సందేహాలూ లేవు.
 
 సచిన్‌కు ముందు కూడా క్రికెట్ మేధో దిగ్గజాల తారా తోరణం ఉండేది. సచిన్ రిటైరైన తర్వాత కూడా మరింత ఎక్కువ నైపుణ్యం ఉంటుంది. అయితే క్రికెట్ క్రీడ సారాన్ని, సంస్కృతిని, పరిధులను, చరిత్రను మార్చేసిన క్రీడాకారునిగా ఆ ఖ్యాతి దక్కేది మాత్రం శతాబ్దికి ఒక్కరికే. అక్కడక్కడా నలుసుల్లాగా ఒయాసిస్‌లున్న విశాలమైన బీడు భూమిని భారత ఊహాశక్తి మహానగరంగా, అవధులు లేని పచ్చని స్టేడియంగా, వాస్తవికతగానూ, వాస్తవమనిపించే భ్రమాత్మక వాస్తవికతగానూ కూడా భాసించే టెలివిజన్‌గా మార్చేసిన వాస్తుశిల్పి సచిన్.
 
 వివశులను చేసే సచిన్ సొగసరి క్రీడా నైపుణ్యానికి బ్యాట్ ఓ క్షణం శస్త్ర చికిత్సకు ఉపయోగించే కత్తిగా మారితే, మరో క్షణం నగల వర్తకుని పనిముట్టుగా మారేది, ఇక సచిన్ పిడుగులు కురిపించే మూడ్‌లో ఉన్నాడంటే అది నార్డిక్ ప్రజల దేవుడు ‘థోర్’ సమ్మెటగా మారిపోయేది. ఆ వశీకరణ శక్తిని గురించి చర్చించాల్సిన పని లేదు. దాన్ని కళ్లారా చూసి, చెవులారా విని పసందైన విందుగా ఆస్వాదించగలిగే శాశ్వత టెలివిజన్ యుగంలో మనం ఉన్నాం. ప్రతి వీక్షుకుడు తనంతకు తానే ఒక నెవిల్లె కార్డస్ (సుప్రసిద్ధ ఇంగ్లిషు క్రికెట్ విమర్శకుడు, రచయిత). సచిన్‌కు, అతని అభిమానుల విలక్షణ విశ్వంలో వెలుగుతుండే ప్రతి అభిమానికి మధ్యన అంతుపట్టని అనుబంధం ఉంది. కాబట్టి సచిన్ క్రీడా నైపుణ్యం గురించి చెప్పడమంటే ఆ అనుబంధంలోకి తలదూర్చడమే అవుతుంది. ఇది ఆరాధనే తప్ప మెచ్చుకోలు కాదు. సచిన్ కనీసం రెండు తరాలకు జీవితాంతం మాట్లాడుకోడానికి సరిపడా తన గొప్పదనం జ్ఞాపకాలను మిగిల్చాడు.
 
 సచిన్ గురించి డొంక తిరుగుడుగా మాట్లాడుకోవడం ముగిసింది. సూటి గా మాట్లాడుకోవడం ఇప్పుడే మొదలైంది. రెండు దశాబ్దాలు గడిచేసరికి జ్ఞాప కం ఎప్పటిలాగా తన పని తాను చేసుకుపోతుంది... వాస్తవాన్ని అతిశయించి చెబుతుంది. రోజువారీ జీవితం పంజరానికి వెలుపల తమ జీవిత కాలంలోనే అద్భుత స్వప్నాన్ని వీక్షించే విశేషావకాశం లభించిన సచిన్ అభిమానులకు ఆ జ్ఞాపకాలను తిరిగి కచ్చితంగా చెప్పడం ఎలాగో తెలియదు. వాస్తవం అతిశయోక్తిగా మారడం అనివార్యం. 60 ఏళ్లు దాటాక సచిన్... ఏ బార్‌లోనో లేదా ఏ డ్రాయింగ్ రూంలోనో పదిమందీ చేరి కాస్త ఉల్లాసంగా గడిపేటప్పుడు చెప్పుకునే కథల్లో తనను గుర్తించవచ్చు. ఆ నక్షత్ర ధూళి వ్యాపనంలో గణాంకాలను లేదా యదార్ధాలను చెబుతూ సచిన్ ఏ మాత్రం జోక్యం చేసుకోకూడదు. సచిన్ ‘తన’ జీవిత కాలంలోని పౌరాణిక నాయకుడు కాడు. మన జీవితాల్లోని పురాణ పురుషుడు. సచిన్ జీవితం సచిన్‌దే. అతని జ్ఞాపకాలు మాత్రం మనవే.   

- ఎం. జె. అక్బర్, సీనియర్ సంపాదకులు

>
మరిన్ని వార్తలు